సాక్షి, సిద్దిపేట: రాజకీయ నేతలకు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధం లేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమని ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసం ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమర వీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ పేరుతో రెండేళ్ల నుంచి బీఆర్‌ఎస్‌పై వేధింపులు కొనసాగుతున్నాయి. తెలంగాణలో సమస్యలను పక్క దారి పట్టించి.. అలీబాబా 40దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నారు. రాజకీయ నాయకులకు ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదు. 1875లోనే ట్యాపింగ్‌పై చట్టం వచ్చింది.
ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరు. ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హననం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ కుట్రల నుండి కేసీఆర్ తెలంగాణ తేవడమే నేరమా?. రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు సమ్మక్క సారలమ్మ జాతరకి రమ్మని ఎర్రవెల్లికి వెళ్ళి ఆహ్వానిస్తారు. కానీ, పోలీస్ అధికారులు నంది నగర్ ఇంటి వెళ్లి నోటీసులు ఇస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌కి నోటీస్ ఇచ్చారు. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయం అని ఘాటు విమర్శలు చేశారు.


