బిహార్‌ ఎన్నికలు.. మరక మంచిదే

RJD Justifies Selection of Candidates With Criminal Charges - Sakshi

22 మంది ఆర్జేడీ అభ్యర్థులపై తీవ్రమైన నేరారోపణలు

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అయితే రాష్ట్రీయ జనతా దళ్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కనీసం 22 మందిపై హత్య, దోపిడీ వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. కానీ దీని గురించి పార్టీ ఎలాంటి ఆందోళన చెందలేదు. ఇక ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ఆర్జేడీ తన అభ్యర్థులు ఎదుర్కొంటున్న నేరారోపణలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా, ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటించింది. క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అభ్యర్థులలో అనంత్ సింగ్ కూడా ఉన్నారు. అతను 38 తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీ అతన్ని మోకామా నుంచి బరిలో నిలుపుతుంది. సోషల్ మీడియాలో ఆర్జేడీ సమర్పించిన అతని నేర చరిత్ర కథనం ప్రకారం, అనంత్ సింగ్‌పై మొత్తం హత్యా నేరం సహా మొత్తం 38 కేసులు ఉన్నాయి. మర్డర్‌ కేసు పెండింగ్‌లో ఉంది. (చదవండి: వీడిన చిక్కుముడి.. కుదిరిన ఒప్పందం)

అయినప్పటికీ, ఆర్జేడీ అనంత్ సింగ్‌కు టికెట్ ఇచ్చింది. ఇతర అభ్యర్థుల కంటే అనంత్ సింగ్ చాలా ఫేమస్‌ అని వాదిస్తుంది. పైగా అతను పేద, అణగారిన వర్గాలకు సాయం చేస్తాడు కాబట్టే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అని పార్టీ సమర్థించింది. అనంత్‌ సింగ్ మోకామా నుంచి గెలిచే అవకాశం ఉందని, ఇది అతన్ని ఆదర్శ అభ్యర్థిగా మారుస్తుందని పార్టీ పేర్కొంది. ఇక క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న ఇతర ఆర్జేడీ అభ్యర్థులు బెలగంజ్ నుంచి పోటీ చేస్తున్న సురేంద్ర యాదవ్, షాపూర్ నుంచి రాహుల్ తివారీ, జాముయి నుంచి విజయ్ ప్రకాష్, నోఖా నుంచి అనితా దేవి, డెహ్రీ నుంచి ఫతే బహదూర్ సింగ్, ఫతుహా నుంచి రామానంద్ యాదవ్, రాజౌలి నుంచి రెజాజుల్, షెర్ఘాటి దినారా నుంచి కుమార్ మండల్, భాబువా నుంచి భరత్ బింద్, షాపూర్ నుంచి రాహుల్ తివారీ, బెల్హార్ నుంచి రామ్‌దేవ్ యాదవ్, సూర్యగర నుంచి ప్రహ్లాద్ యాదవ్, సందేష్ నుంచి కిరణ్ దేవి, మఖ్దంపూర్ నుంచి సతీష్ కుమార్, జముయి నుంచి విజయ్ ప్రకాష్, ఝాజ నుంచి రాజేంద్ర ప్రసాద్‌, సీతామార్హి నుండి రఫీగంజ్ మొహమ్మద్ నిహలుద్దీన్, మీనాపూర్ నుంచి సునీల్ కుమార్, మీనాపూర్ నుంచి రాజీవ్ కుమార్, మహువా నుంచి ముఖేష్ కుమార్ రోషన్, దర్భంగా రూరల్ నుంచి లలిత్ కుమార్ యాదవ్, అత్రి నుండి అజయ్ యాదవ్ ఈ జాబితాలో ఉన్నారు. వీరందరిపై దోపిడీ, మోసం, దాడి మొదలైన నేరారోపణలు ఉన్నాయి. (చదవండి: జేడీ(యు)లో చేరిన ఆర్జేడీ నేత కుమారుడు)

ఈ క్రమంలో జనతా దళ్ (యునైటెడ్) ప్రతినిధి రాజీవ్ రంజన్ ఆర్జేడీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ తీరు మారదని దుయ్యబ్టటారు. ‘ఆర్జేడీ ఇచ్చిన సమాచారం చూస్తే.. ఇ​క అది తన వైఖరిని ఎన్నటికి మార్చుకోదని స్పష్టం అవుతుంది.  హత్య, దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది, ఎందుకంటే వారు పాపులర్, తప్పక గెలుస్తారని. బిహార్ అభివృద్ధి చెందుతుంది.. కానీ ఆర్జేడీ కాదని ఇప్పుడు స్పష్టమైంది’ అన్నారు. జేడీ (యూ) ఆరోపణలను ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఖండించారు. తన పార్టీని సమర్థిస్తూ.. "మేము బాహుబలి, నేరస్థులకు టికెట్లు ఇచ్చామని మా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒక నాయకుడు బీజేపీ, జేడీ (యూ)లో ఉన్నంత కాలం, అతను ఒక ప్రవక్త, హరిశ్చంద్ర. కానీ అతను ఆర్జేడీలోకి వస్తే అతను క్రిమినల్, రేపిస్ట్, బాహుబలి అవుతాడు. ఆశ్రయం గృహ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంజు వర్మకు టికెట్ ఇచ్చినందున జేడీ (యూ)కు మాపై ఆరోపణలు చేసే హక్కు లేదు" అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top