కేటీఆర్‌ ఏమైనా రకుల్‌​ సినిమాకు సైన్‌ చేసినట్టా..! ధర నిర్ణయించి అగ్రిమెంట్‌ చేసుకోవడానికి?: రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Slams TS Govt And KTR On TSPSC Paper Leak Case - Sakshi

సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంపై.. టీఎస్‌పీఎస్సీ మెంబర్లను విచారించాలని సిట్‌ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరాయి. తాజాగా పేపర్‌ లీకేజీకేసులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ఈడీకి గురువారం ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌కు వందకోట్లు ఇస్తే ఎన్నిబూతులైనా తిట్టొచ్చా అని విమర్శించారు. తన పరువు వందకోట్లు అని ఎలా నిర్ధారించాడని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఏమైనా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సినిమాకు సైన్‌ చేసినట్టా?.. లేకపోతే సమంత సిరీస్‌కు సంతకం పెట్టినట్టా.. ధర నిర్ణయించి అగ్రిమెంట్‌  చేసుకోవడానికి అని దుయ్యబట్టారు. పబ్లిక్‌ డోమైన్‌లో లేని సమాచారం కేటీఆర్‌కు ఎలా వచ్చిందని నిలదీశారు. 

‘కేటీఆర్‌ ఏం చెప్తున్నారో సిట్‌ అదే చేస్తోంది. కేటీఆర్‌ నీచుడు.. నాకు నోటీసులు ఇచ్చుడేంది. దమ్ముండే పేపర్‌ లీకేజీ కేసును సీబీఐ, ఈడీకి ఇవ్వాలి. ఎవరికి ఎన్ని మార్పులువచ్చాయని కేటీఆర్‌కు ఎలా తెలుసు.. పేపర్‌ దొంగలు ఏమైనా సమాచారం ఇచ్చారా?. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వానికి చీమ కుట్టనట్టైనా లేదు. 

ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలను సిట్‌ నోటీసులు ఇస్తుంది. కోట్లు కొల్లగొట్టిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. శంకర్‌ లక్ష్మికి తెలియకుండా ఏం జరగదు. ఆమెను ఏ1 గా చేర్చాలి. విదేశాల్లో ఉన్నవారు కూడా పరీక్షల రాశారు. ఇప్పటి వరకు సీజ్‌ చేసిన వాటి ఈడీ అధికారులు తీసుకోవాలి. పేపర్‌ల లీక్‌పై  సీఎం ఎందుకు  స్పందించడం లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి. గతంలో కూడా ఇలాగే సిట్‌ ఏర్పాటు చేసి కేసులను పక్కదారి పట్టించారు.’ అని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top