బలిదానాలు మీ కోసమేనా?

Revanth Reddy Slams On KCR Over Bhupalpally Bahiranga Sabha - Sakshi

భూపాలపల్లి బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ ధ్వజం 

భూపాలపల్లి: ‘‘కేసీఆర్‌ రెండుసార్లు ముఖ్యమంత్రి.. కేటీఆర్, హరీశ్‌రావు మంత్రులు, ఎంపీగా ఓడిపోయిన కవిత ఎమ్మెల్సీ, సంతోష్‌ రాజ్యసభ సభ్యుడి పదవి అనుభవిస్తున్నారు. తెలంగాణ విద్యార్థులు, యువకులు బలిదానాలు చేసింది మీ కుటుంబం కోసమేనా..? అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారులు నేటికీ దుఃఖిస్తూనే ఉన్నారు. ఈ ఏడేళ్ల కాలంలో మీరు చేసిందేముంది?’’ అని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఏఐఎఫ్‌బీ నాయకుడు గండ్ర సత్యనారాయణరావు గురువారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడారు. నక్సల్స్‌ ఎజెండాయే తమ ఎజెండా అని చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఎన్నో ఎన్‌కౌంటర్లు చేయించి విప్లవకారుల రక్తం నేలచిందించాడని మండిపడ్డారు.

కేసీఆర్‌ కుటుంబంలో ఉన్న వారందరూ పదవులు అనుభవించాలని నక్సల్స్‌ ఎజెండాలో ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఒక్కడితోనే తెలంగాణ రాలేదని, ఎందరో అమరుల త్యాగం ప్రత్యేక రాష్ట్రమని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో ఉన్న అప్పటి ఎంపీ విజయశాంతి సైతం ఇప్పుడు కేసీఆర్‌ వెంట లేదని పేర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ చచ్చిపోతుందని, జాతీయస్థాయిలో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయని తెలిసి కూడా.. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల కల నెరవేర్చడానికి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. ప్రధాని మోదీ సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చారని, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిని నిర్బంధిస్తున్నారని, త్వరలోనే టీఆర్‌ఎస్‌ పార్టీకి కాలం చెల్లడం ఖాయమని రేవంత్‌ పేర్కొన్నారు.

కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు 
సింగరేణి కార్మికులు దసరా, దీపావళి పండుగలను పక్కనపెట్టి మరీ సకల జనుల సమ్మెలో పాల్గొంటే.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ వారి హక్కులను కాలరాస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఓపెన్‌కాస్టుల పేరిట ఈ ప్రాంత భూములను బొందలగడ్డలుగా మారుస్తున్నారని.. ఇక్కడి భూమి, నీరు, జీవితాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు గులాబీ పార్టీని బొందపెట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ సభలో మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సీతక్క, శాసనమండలి ప్రతిపక్ష నేత జీవన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు మధుయాష్కీగౌడ్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top