అధికారంలోకొచ్చిన 30 రోజుల్లోనే రూ.2లక్షల రుణమాఫీ

ప్రభుత్వం పక్షాన బ్యాంకులకు కౌంటర్ గ్యారంటీ ఇస్తాం
రైతు డిక్లరేషన్‌ను నూటికి నూరుపాళ్లు అమలు చేస్తాం
‘మీట్ ది ప్రెస్’లో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని అమలు చేసి తీరుతామని, బ్యాంకర్లను ఒప్పించి తనఖా కింద ఉన్న పాస్ పుస్తకాలను విడిపిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘వరంగల్ రైతు డిక్లరేషన్’ను నూటికి నూరుపాళ్లు అమలు చేస్తామని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘మీట్ ది›ప్రెస్’కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని రైతుల పంట రుణాలు రూ.25–30 వేల కోట్ల వరకు ఉంటాయని, ఈ మొత్తాన్ని నాలుగేళ్లలో వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించేలా బ్యాంకర్లతో ఒప్పందం చేసుకుంటామని చెప్పారు. అంతకుముందే రైతుల రుణాలకు కౌంటర్ గ్యారంటీ ఇచ్చి మాఫీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రేవంత్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే..
కేసీఆర్ షోకుల కోసం అప్పులు: ‘‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ అప్రాధాన్య పనులకు ఖర్చు చేసిన కారణంగానే అప్పులు పెరిగిపోయాయి. ఏటా పెరిగే 15 శాతం ఆదాయాన్ని కేసీఆర్ తనకు లాభం వచ్చే కార్యక్రమాలకు మళ్లించడం వల్లే నష్టం జరుగుతోంది. అలాంటి నిరర్థక పెట్టుబడులను నియంత్రిస్తాం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ అవినీతిని అరికడతాం. దోపిడీకి గురవుతున్న సహజ వనరులను కాపాడుకుంటాం. పౌడర్లు, స్నోలు, డెకరేషన్లు, బాత్‌రూంలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు, సోకులు, విందులు, వినోదాలకు ఖర్చు తగ్గించుకుంటే.. వరంగల్ డిక్లరేషన్‌లో అన్ని హామీలను అమలు చేయవచ్చు.
కౌలు రైతులకూ పెట్టుబడి సాయం
టీఆర్‌ఎస్ ప్రభుత్వ బరితెగింపు, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా ఆగర్భ శ్రీమంతులకు కూడా రైతుబంధు ఇస్తున్నారు. మేం అధికారంలోకి వచ్చాక అలాంటి అనర్హులకు రైతుబంధు రద్దు చేస్తాం. ఇందుకోసం కొన్ని ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకుంటాం. ఇదే సమయంలో భూమి యజమానితోపాటు కౌలు రైతులకూ ఇందిరమ్మ భరోసా పథకం కింద ఏటా రూ.15వేల పెట్టుబడి సాయం అందజేస్తాం. ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమి లేని పేదలకు ఏటా రూ.12 వేలు ఇస్తాం.
ప్రతి పంటకు మద్దతు ధర
రాష్ట్రంలో పండించే ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తాం. సన్నరకం వరి ఎంత సాగు చేసినా కొనుగోలుకు ఇబ్బంది లేదు. కేసీఆర్ నిర్వాకం కారణంగానే పసుపు, చెరుకు, ఎర్రజొన్న, కందులు వంటివి పండించే రైతులు కూడా వరి పండించడం మొదలుపెట్టారు. మేం వరి పండించే రైతులను బెదిరించబోం. వద్దని ఒత్తిడి చేయబోం. రైతుబంధుకు లింకు పెట్టబోం. ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లినవారికి బోనస్ ఇస్తాం. ఆయా పంటల సాగుపై పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తాం.
కేసీఆర్‌ను దింపేయడమే పరిష్కారం
రాష్ట్రంలో భూరికార్డుల నిర్వహణ పేరిట.. కేసీఆర్ దురుద్దేశంతో, దోపిడీ ఆలోచనతో ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక ఆ పోర్టల్‌ను రద్దు చేసి.. దానిస్థానంలో డిజిటల్ టెక్నాలజీతో కూడిన సులభతర విధానాన్ని అమల్లోకి తెస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం. రైతు టాస్క్‌ఫోర్స్‌ను, చట్టబద్ధత కల రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ విషయంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మరనే విషయంలో వాస్తవం లేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైతులకు ఏది చేసినా కాంగ్రెస్ పార్టీనే చేసింది. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినది, భూసంస్కరణలు అమలు చేసింది, పేదలకు భూములిచ్చింది, 2004లో అధికారంలోకి వచ్చాక ప్రణాళిక ప్రకారం జలయజ్ఞం పేరుతో 81 ప్రాజెక్టులను నిర్మించింది, పంటలకు కనీస మద్దతు ధరలను అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే. రూ.73 వేల కోట్ల మేర రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది, రుణమాఫీ వర్తించని వారికి రూ.5వేల ఆర్థిక సాయం, ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెసేనని గుర్తుంచుకోవాలి. అంతేకాదు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. టీఆర్‌ఎస్‌ను ఓడించగల శక్తి కూడా కాంగ్రెస్‌కే ఉంది.
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు
కాంగ్రెస్, ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం కోసం చేసిన అప్పులు రూ.69వేల కోట్లు మాత్రమే. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏడేళ్లలోనే ఆ అప్పు ఐదు లక్షల కోట్లకు చేరింది. రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో తెలంగాణను ఇస్తే.. ఇప్పుడు లోటు బడ్జెట్‌తో కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితి లేని స్థాయికి దిగజార్చారు. శ్రీలంకతో పోటీపడే స్థాయికి ఈ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కింది. అక్కడ రాజపక్సే కుటుంబం ప్రజల ఆగ్రహానికి ఎలా గురయిందో.. ఇక్కడ కేసీఆర్ కుటుంబం కారణంగా ప్రజల ఆగ్రహం ఎదుర్కొనే పరిస్థితి టీఆర్‌ఎస్ నేతలకు వచ్చింది’’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల అధ్యయన వేదిక నేతలు బి.వేణుగోపాల్‌రెడ్డి, సాదిక్, మధు, సురేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.