
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, రాబోయే వందరోజుల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డిల సమక్షంలో పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి ఆదివారం గాందీభవన్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ గద్వాల జిల్లా బంగ్లాలో బందీ అయ్యిందని, ఆ జిల్లా ప్రజలను బంగ్లాల ముందు బానిసలుగా మార్చారని ఆరోపించారు. జిల్లాలో కొందరు బీఆర్‌ఎస్, బీజేపీలోకి వెళ్లినంత మాత్రాన ఏమీ కాదన్నారు. గద్వాలకు చెందిన బడుగు,బలహీన వర్గాలు ఎప్పు డూ కాంగ్రెస్ వైపే ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బిడ్డ అయిన తనకు టీపీసీసీ అధ్యక్ష పదవితో సోనియాగాంధీ గౌరవం ఇచ్చారని, అందుకు ప్రతిగా పాలమూరుజిల్లాలో 14కు 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి తదితరులు పాల్గొన్నారు.
జీఓ 111పై నివేదిక సమర్పణ
జీఓ 111పై అధ్యయనం చేసేందుకుగాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ రూపొందించిన నివేదికను రేవంత్‌రెడ్డికి అందజేశారు. కమిటీ చైర్మన్ ఎం.కోదండరెడ్డి నేతృత్వంలో సభ్యులు అన్వేశ్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు ఈ నివేదిక తయారు చేశారు.