
చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేసిన రావెల కిషోర్ బాబు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో..
గుంటూరు, సాక్షి: అంబేద్కర్ ఆశయాల్ని నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆయన పేదలకు చేస్తున్న సేవ తనను ఆకట్టుకుందని ఏపీ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. బుధవారం మధ్యాహ్నాం సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారాయన.
‘‘అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్న సీఎం జగన్ మాత్రమే. పేద, బడుగు, బలహీన వర్గాల రాజకీయ కలను జగన్ సాకారం చేస్తున్నారు. రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేదల ఖాతాలో జమ చేయటం ఒక చరిత్ర. డ్వాక్రా మహిళలను గత పాలకులు ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. జగన్ మాత్రం వారి రుణాలను విడతల వారీగా మాఫీ చేశారు . అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా జగన్ చూస్తున్నారు. పేదలకు చేస్తున్న సేవలను చూసి వైఎస్సార్‌సీపీలో చేరాను. పార్టీ కోసం జగన్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం. ఒక విధేయుడిగా ఉంటా అని రావెల తెలిపారు.
ఐఆర్‌టీఎస్ మాజీ అధికారి అయిన రావెల 2014లో గుంటూరు ప్రత్తిపాడు(ఎస్సీ) నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసి నెగ్గారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2018 చివర్లో టీడీపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరారు.