Siddham Sabha: చంద్రబాబుకు సీఎం జగన్‌ సవాల్‌ | Raptadu Siddham Sabha: CM Jagan Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

Siddham Sabha: చంద్రబాబుకు సీఎం జగన్‌ సవాల్‌

Feb 18 2024 4:27 PM | Updated on Feb 18 2024 5:46 PM

Raptadu Siddham Sabha: Cm Jagan Comments On Chandrababu - Sakshi

సాక్షి, అనంతపురం జిల్లా: విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాప్తాడు వైఎస్సార్‌సీపీ ‘సిద్ధం’ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘‘ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోంది. జిల్లాల పునర్విభజన తరువాత రాయలసీమకు జల సముద్రం తరలి వస్తే... ఈ రోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు.. ఇక్కడున్న ప్రతి సీమ బిడ్డకు మీ జగన్‌ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతున్న యుద్ధం’’ అని సీఎం పేర్కొన్నారు.

కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదు. ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన అభివృద్ధి, సంక్షేమం.. పథకాలు కొనసాగాలని అడుగులేస్తున్న మనకు.. వీటన్నింటినీ రద్దు చేయడమే లక్ష్యంగా డ్రామాలు ఆడుతున్న చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధానికి మీరు సిద్ధమేనా?’’ అంటూ  పార్టీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు

‘‘ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున.. పెత్తందారులు మరోవైపున ఉన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న ఆ పెత్తందారులకూ మధ్య జరుగుతున్నదీ యుద్ధం. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధమిది. పేదవాడి భవిష్యత్తు కోసం.. వారి తరఫున నిలబడేందుకు మీరందరూ సిద్ధమేనా?’’

ఈ యుద్ధం వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ వచ్చేందుకు వస్తున్న నాన్‌ రెసిడెంట్‌ ఆంధ్రాస్‌కు... ఈ గడ్డమీదే పుట్టి.. ఈ గడ్డమీద మమకారంతో ఇక్కడే ఇల్లు కట్టుకుని, ప్రజలమధ్యే ఉన్న మనకూ మధ్య జరుగుతోంది. ఇదే వేదిక నుంచి చంద్రబాబు నాయుడుకు ఒక సవాలు విసురుతున్నా.. పద్నాలుగేళ్లు సీఎంగా పరిపాలన చేశారు. మూడుసార్లు సీఎం కుర్చీలో కుర్చున్నారు.. మరి మీ పేరు చెబితే రైతులకు గుర్తొచ్చే ఒక్కటైనా పథకం ఉందా అని చంద్రబాబును అడుగుతున్నా!

‘‘అయ్యా చంద్రబాబు.. మీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చే పథకం... కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా?’’ చంద్రబాబు పేరు చెబితే బడికెళ్లే పిల్లలకైనా, కాలేజి వెళ్లే విద్యార్థులకైనా గుర్తుకొచ్చే పథకం ఏదైనా ఒక్కటైనా ఉందా?’’ పోనీ.. రైతన్నలకూ, అక్కచెల్లెమ్మలు, విద్యార్థులకూ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే పథకం ఒక్కటంటే ఒక్కటి లేదు.. కనీసం అవ్వాతాతలైనా మమ్మల్ని బాగా చూసుకున్నాడు... పింఛన్‌ ఇంటికైనా పంపే పరిస్థితి ఉందా? అని అడుగుతున్నారు. బాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ ఆయన సీఎంగా ఉండగా ఫలాన మంచి చేశాడని, ఫలానా మంచి పథకం తీసుకొచ్చాడని గుర్తుకురాదు. ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఒక్క మంచి పనైనా ఉందా? తీసుకొచ్చిన ఒక్క స్కీమైనా ఉందా?. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ కనీసం ఒక్కటైనా కనిపిస్తోందా?  బాగుపడిన స్కూళ్లున్నాయా?. ఆసుపత్రులున్నాయా? 

పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు.. అయినా కూడా కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ ఏ గ్రామంలోనైనా సరే.. ఎవరు ఆగినా.. బాబుగారి మార్కు ఎక్కడైనా ఉందా? అని ఈ వేదికపై నుంచి అడుగుతున్నా?. బాబు పేరు చెబితే సామాజిక న్యాయమనే పదం కనీసం ఏ ఒక్కరికైనా గుర్తుకొస్తుందా? అని అడుగుతున్నా. ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మ్యానిఫెస్టోల్లో రంగురంగుల్లో రాయడం.. ఆ తరువాత మోసం చేయడమే ఆనవాయితీగా చంద్రబాబు పెట్టుకున్నాడు..

1995, 1999, 2014లలో సీఎం అయిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు తెలుగుదేశం మ్యానిఫెస్టో అంటూ ప్రజలకు ఇచ్చిన హామీల్లో పదిశాతమైనా అమలు చేశారా? అని అడుగుతున్నా. గతం ప్రజలకు గుర్తుండదన్న దీమాతో మళ్లీ చంద్రబాబు బంగారు కడియమిస్తానని ఊబిలోకి దింపి మనుషులను తినేసే పులి మాదిరిగా ఈ రోజు ఎర చూపుతున్నాడు చంద్రబాబు. రంగు రంగుల మానిఫెస్టో అంటాడు.. ఆరు స్కీములు అంటున్నాడు. ఇంకో ఆరు వస్తాయంటున్నాడు. రంగు రంగుల మానిఫెస్టోతో మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరాడు’’అంటూ సీఎం జగన్‌ మండిపడ్డారు.

చదవండి: రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పంచ్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement