కేంద్ర ఆర్థిక ‘సర్వే’ సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్‌ చౌర్యం.. 'రీ సర్వే' సూపర్‌ | Union Economic Survey praised decisions of YS Jagan govt of Resurvey | Sakshi
Sakshi News home page

కేంద్ర ఆర్థిక ‘సర్వే’ సాక్షిగా బద్దలైన బాబు క్రెడిట్‌ చౌర్యం.. 'రీ సర్వే' సూపర్‌

Jan 30 2026 3:22 AM | Updated on Jan 30 2026 3:22 AM

Union Economic Survey praised decisions of YS Jagan govt of Resurvey

2025–26 కేంద్ర ఆర్థిక సర్వేలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రశంసలు    

భూముల రీ సర్వే ప్రాజెక్టు 2021లో ఏపీలో ప్రారంభం 

6,901 గ్రామాల్లో రీ సర్వే పూర్తి  

81 లక్షల కమతాలు తిరిగి సర్వే  

సుమారు 86,000 సరిహద్దు వివాదాలు పరిష్కారం.. దాదాపు 15 వేల మంది సర్వేయర్ల నియామకం 

రైతులకు పైసా ఖర్చు లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే 

తొలిసారి డ్రోన్లు, రోవర్లు, విమానాల వినియోగం.. భూములకు జియో హద్దులు.. పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు 

ట్యాంపర్‌ ప్రూఫ్‌ డిజిటల్‌ టైటిళ్లు జారీ 

2023–24లో మహిళల సారథ్యంలో ఏపీలో పెద్ద ఎత్తున పరిశ్రమల నమోదు 

సింగిల్‌ విండో విధానంతో సులభంగా పారిశ్రామిక అనుమతులు 

ఏపీలో ప్రపంచ స్థాయి బల్క్‌ డ్రగ్‌ పార్కుకు ప్రోత్సాహం 

పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా ‘ఈ–ఫార్మర్‌ మార్కెట్‌’ విధానం 

కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేసిన వైఎస్‌ జగన్‌ సర్కారు  

సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: కేంద్ర ఆర్థిక సర్వే సాక్షిగా.. పార్లమెంట్‌ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్‌ చోరీ మరోసారి రుజువైంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన భూ సంస్కరణలపై బురద చల్లుతూ చంద్రబాబు ఆడిన కపట నాటకం బట్టబయలైంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ.. ఆంగ్లేయుల తరువాత వందేళ్ల అనంతరం దేశంలో తొలిసారిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో చేపట్టిన భూముల సమగ్ర రీ సర్వే యజ్ఞం ఫలితాలను తాజాగా కేంద్ర ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రశంసించింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెచ్చిన కీలక మార్పులు, ప్రతి అడుగులో రైతన్నలకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు, విప్లవాత్మక రీతిలో అమలు చేసిన భూ సంస్కరణలను అభినందించింది. 

వైఎస్‌ జగన్‌ హయాంలో నిర్వహించిన భూ రీ సర్వే ఫలితాలను వివరిస్తూ కేంద్ర ఆర్థిక సర్వే(2025–26)లో పేర్కొన్న భాగం 

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమలు చేసిన సమగ్ర భూ సర్వే ఫలాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాల్లో ఎలా వేసుకున్నారో దేశానికి చాటి చెప్పింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెచ్చిన భూ సంస్కరణలు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలు­దారులను రైతులకు పరిచయం చేసి పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా తెచ్చిన ‘ఈ–ఫార్మర్‌ మార్కెట్‌’  విధానాలకు కేంద్రం కితాబిచ్చింది. ఇక వ్యాపార వాతావరణ అనుకూల విధానాల్లో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పారిశ్రామిక అనుమతులకు సింగిల్‌ విండో విధానాన్ని అమలు చేసిందని, 2023–24లో మహిళల నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఎక్కువగా నమోదయ్యా­యని తెలిపింది. ఈమేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే నివేదిక 2025–26 ప్రవేశపెట్టారు. 

ట్యాంపర్‌ ప్రూఫ్‌ డిజిటల్‌ ల్యాండ్‌ టైటిళ్లు
భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2021లో భూముల రీ సర్వే ప్రాజెక్టును ప్రారంభించిందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. రీ సర్వేకు డ్రోన్‌ టెక్నాలజీని వినియోగించడంతో పాటు కంటిన్యూస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్లు (సీవోఆర్‌ఎస్‌), జీఐఎస్‌ సాయంతో ట్యాంపర్‌ ప్రూఫ్‌ డిజిటల్‌ ల్యాండ్‌ టైటిళ్లను జారీ చేసినట్లు ఆర్థిక సర్వే ప్రధానంగా ప్రస్తావించింది. సమగ్ర భూ సర్వేలో భాగంగా 6,901 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేశారని, 81 లక్షల భూ కమతాలను రీ సర్వే చేశారని వెల్లడించింది. తద్వారా సుమారు 86,000 సరిహద్దు వివాదాలను పరిష్కారమయ్యాయని స్పష్టం చేసింది. దాదాపు 15 వేల మంది సర్వేయర్లను నియమించి రైతులకు పైసా ఖర్చు లేకుండా భూముల సమగ్ర సర్వేను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టడం తెలిసిందే. 

సచివాలయాల సిబ్బంది పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రీ సర్వే ద్వారా తొలిసారిగా డ్రోన్లు, రోవర్లు, విమానాలను వినియోగించి సర్వే చేశారు. భూములకు జియో హద్దులు నిర్ణయించి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు ముద్రించారు. ట్యాంపరింగ్‌కు వీలులేని విధానాల ద్వారా భూ రికార్డుల వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. సర్వే రాళ్లు విలక్షణంగా ఉంటేనే అందరికీ తెలుస్తుందనే ఉద్ధేశంతో 1.25 కోట్ల సర్వే రాళ్లను పాతించారు. అంతేకాదు.. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ లాంటి అన్ని సేవలను సచివాలయాల్లోనే పొందే సౌలభ్యం కల్పించారు. నిర్విరామంగా ఒక మహాయజ్ఞంలా జరిగిన రీ సర్వే కార్యక్రమంలో సర్వే ఆఫ్‌ ఇండియా కూడా పాలుపంచుకుంది. కేరళ, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాలు రీ సర్వే మోడల్‌పై అధ్యయనం చేసి టెక్నాలజీ సాయం కోరాయి. 


ఆర్బీకేలతో పంటలకు మెరుగైన ధరలు
రైతులు పండించిన ఉత్పత్తులకు మార్కెట్‌లో మెరుగైన ధరలు కల్పించే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెచ్చిన రైతు భరోసా కేంద్రాలు, ‘ఈ–ఫార్మర్‌ మార్కెట్‌’ను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను కళ్లాల నుంచే నేరుగా తమకు నచ్చిన ధరకు అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తూ వైఎస్సార్‌ సీపీ హయాంలో ‘ఈ–ఫార్మర్‌ మార్కెట్‌’ విధానాన్ని ప్రవే­శపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొనుగోలుదారులను రైతులకు పరిచయం చేస్తూ, మన పంట ఉత్పత్తులకు మంచి ధరలు లభించేలా దీన్ని తెచ్చింది. మండీలకు ప్రత్యామ్నాయంగా రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు, ప్రాసెసర్లను అనుసంధానిస్తూ దేశంలో తొలిసారిగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ఎలక్ట్రానిక్‌ ట్రేడింగ్‌ పోర్టల్‌ ద్వారా కొనుగోళ్లు చేపట్టేందుకు వ్యాపారులు పోటీపడి ముందుకొచ్చారు. వీరిలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు కూడా ఉండటం గమనార్హం.

ఈ– ఫార్మర్‌ మార్కెట్‌తో ప్రయోజనాలెన్నో..
దళారీల ప్రమేయం ఉండదు. ఎలాంటి ఫీజులు, రుసుములు లేకుండా కళ్లాల నుంచే అమ్ముకోవచ్చు.
⇒ ఉత్పత్తి లభ్యత, పంట వివరాలు, నాణ్యత వివరాలను ఎలక్ట్రానిక్‌ పోర్టల్‌లో నమోదు చేస్తే ఇదే పోర్టల్‌లో వ్యాపారులు నేరుగా రైతులతో సంప్రదించి కొనుగోలు చేస్తారు. నగదు రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తారు.

పరిశ్రమలకు సింగిల్‌ విండో అనుమతులు
బిజినెస్‌ రీఫార్మ్‌ యాక్షన్‌ ప్లాన్‌ (బీఆర్‌ఎపీ) 2024 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు, ఆన్‌లైన్‌లో భూమి రిజిస్ట్రేషన్, పర్యావరణ అనుమతులు జారీ చేసి పారి­శ్రామికవేత్తలను ప్రోత్సహించినట్లు కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది.

తయారీ రంగంలో మహిళా యాజమాన్య సంస్థల సత్తా
దేశంలో మహిళా యాజమాన్యంలోని సంస్థల వాటా పెరుగుతోందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది. 2021 – 2022లో 24.2 శాతం ఉండగా 2023 – 24లో 26.2 శాతానికి పెరిగినట్లు తెలిపింది. 2023–24లో మహిళా యాజమాన్యంలోని సంస్థలకు సంబంధించి తయారీ రంగంలో వాటా అత్యధికంగా 58.4 శాతం ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక వాటా కలిగిన రాష్ట్రాల్లో నిలిచింది.
⇒ వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటుకు కృషి చేసినట్లు కేంద్ర ఆర్థిక సర్వే ప్రస్తావించింది. 
⇒ కోవిడ్‌ మహమ్మారి తరువాత విదేశీ విద్యార్ధులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందని, 2023 గణాంకాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement