సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ మద్యం కేసులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆయన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు.
శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వెళ్లారు. తనపై టీడీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు, తన కుటుంబ సభ్యులను కేసులతో వేధించిన తీరును జగన్‌కు వివరించారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని వైఎస్ జగన్ చెవిరెడ్డికి భరోసా ఇచ్చారు. ప్రజల పక్షాన పోరాడే క్రమంలో ఇలాంటి వేధింపులు తప్పవని.. వాటిని ధీటుగా ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలుద్దామని.. ఈ విషయంలో పార్టీ నాయకులు, క్యాడర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెవిరెడ్డితో జగన్ అన్నారు. చెవిరెడ్డి వెంట ఆయన కుమారులు మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డిలు ఉన్నారు.
అక్రమ మద్యం కేసులో.. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి ద్వారా ముడుపులు అందుకుని, వాటిని అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల కోసం ఖర్చు చేశారంటూ చంద్రబాబు నాయుడు వేసిన సిట్ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో కిందటి ఏడాది జూన్ 17న బెంగళూరులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది. అయితే విచారణలో ఆయన పాత్రపై ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో సుమారు 226 రోజులపాటు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపిన చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ గురువారం(జనవరి 29న) ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.


