ముంబై: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగక ముందే తమిళనాడు ఎన్నికల్లో ఆయా పార్టీల గెలుపు–ఓటములపై,పొత్తులపై అంతర్గతంగా చర్చలు మొదలయ్యాయా? ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోకపోతే హీరో,తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ను ఆహ్వానించే అవకాశముందా? ఒప్పందం ప్రకారం విజయ్ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టనున్నారా? త్రిముఖ పోరులో విజయ్ ‘కింగ్ మేకర్’అవుతాడా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎన్‌డీయే మిత్రపక్షం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే.
కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీఏ కూటమిలో విజయ్ చేరుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత మద్దతు కోరుతాం. తమిళనాడు ఎన్నికల్లో టీవీకే గట్టిపోటీ ఇస్తుంది. హంగ్ ఏర్పడితే టీవీకే ఎన్‌డీఏలో చేరుతుంది. విజయ్ మద్దతుతో ఎన్‌డీఏ సర్కార్ వచ్చే ఛాన్స్’ఉందని అని వ్యాఖ్యానించారు.
మంగళవారం పుదుచ్చేరిలో ఇండియా రిపబ్లికన్ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం.. అథవాలే మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి, అస్సాంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాదు. తమిళనాడులో మెజారిటీ సాధించకపోతే ఎన్‌డీఏ కూటమి విజయ్‌తో మాట్లాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
ప్రస్తుతం కేరళంను అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్) ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారు.అక్కడ కూడా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.ఎన్నికల తర్వాత, ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్‌డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలో ఉన్నారు. దేశాభివృద్ధియే ఆయన లక్ష్యం’అని ఆయన అన్నారు.
ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌తో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేసింది. పొత్తును ఖరారు చేసేలా చర్చలు ఎన్‌డీఏ పెద్దలు ఓ దూతను విజయ్ వద్దకు పంపించారు. ఎన్‌డీఏ కూటమి తరుఫున సదరు నేత విజయ్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చల్లో విజయ్ రెండున్నర సంవత్సరాలు, అన్నాడీఎంకే ఎడప్పాడి పళనిస్వామి మరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండేలా మంతనాలు జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత ఇదే అంశాన్ని టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున ధృవీకరించారు.
అయితే, పళనిస్వామి రెండున్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి ఒప్పందాన్ని అంగీకరించలేదు.దీంతో, విజయ్‌తో పొత్తు కోసం బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైంది. విజయ్ ఒంటరిగా ఎన్నికల పోటీ చేస్తున్నారు. తాజా,పరిణామల నేపథ్యంలో తమిళనాడులో ఎన్‌డీఏ కూటమికి మెజారిటీ రాకపోతే విజయ్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని రామ్‌దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయా పార్టీల పొత్తులు, గెలుపు–ఓటములు ఊహాగానాలు మాత్రమే. ఏ రాష్ట్రంలో ఎవరు గెలిచారు? కింగ్ మేకర్ ఎవరు అవుతారు? ఏ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి? అన్నది ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత మాత్రమే స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


