‘రెండు జీరోలు కలిస్తే వచ్చేది జీరోనే’ | Raj Thackeray And Uddhav Thackeray Both Hinted At A Reunion | Sakshi
Sakshi News home page

‘రెండు జీరోలు కలిస్తే వచ్చేది జీరోనే’

Apr 20 2025 11:30 AM | Updated on Apr 20 2025 12:15 PM

Raj Thackeray And Uddhav Thackeray Both Hinted At A Reunion

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార బీజేపీ మహాయుతి కూటమికి షాకిస్తూ మహారాష్ట్ర నవ్‌ నిర్మాణ సేన (ఎంఎస్‌ఎన్‌)అధినేత రాజ్‌ ఠాక్రే సంచలన నిర్ణయం తీసుకున్నారు. 20ఏళ్ల తర్వాత తన బంధువు ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. అటు రాజ్‌ఠాక్రే నిర్ణయాన్ని సైతం ఉద్దవ్‌ ఠాక్రే సమర్థించారు. ఇప్పుడీ ఈ ఇరువురి నిర్ణయం మహా రాజకీయాల్లో కీలక మలుపు తిరిగినట్లైంది.

వేర్వేరు కార్యక్రమాల్లో విభేదాలు పక్కనపెట్టి మహారాష్ట్ర కోసం, మరాఠా ఉనికోసం  ఉద్దవ్‌ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలు కలిసిపోతే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ నిర్వహించిన పాడ్‌ కాస్ట్‌లో రాజ్‌ ఠాక్రే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఉద్దవ్‌కు నాకు మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు మహారాష్ట్ర ప్రయోజనాలకు హానికరంగా మారాయి. ఈ వివాదాలు చిన్నవి మాత్రమే. వాటి కంటే మహారాష్ట్ర పెద్దది. మా మధ్య అనుకూలతలు మహారాష్ట్ర, మరాఠీ ప్రజలకు అవసరం. మేం కలిసిపోవడం కష్టం కాదు. ఇది నా ఆకాంక్ష.. స్వార్థం కాదు. అన్నింటికన్నా మహారాష్ట్ర ప్రజలు మా రాజకీయ పార్టీలను వేర్వేవేర్వేగా చూడకూడదు. ఒకే పార్టీగా అవతరించాలి’ అని వ్యాఖ్యానించారు.  

నేను ఏక్‌నాథ్‌ షిండేలా కాదు 
అయితే, 2005లో శివసేన నుంచి విడిపోయే సొంత పార్టీ మహారాష్ట్ర నవ్‌ నిర్మాణ సేన (ఎంఎస్‌ఎన్‌)స్థాపించడం, 2022లో శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే విడిపోవడంలో చాలా తేడాలున్నాయని చెప్పారు. ‘నేను శివసేన నుండి బయటకు వచ్చే సమయంలో నా వద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.  కానీ నేను మాత్రం ఒంటరిగానే బయటకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను బాలాసాహెబ్ ఠాక్రే కింద మాత్రమే పని చేశాను. ఉద్దవ్‌ ఠాక్రేతో పని చేయడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అని అన్నారు.

ఉద్దవ్‌ ఠాక్రే షరతు
భారతీయ కర్మాగర్ సేన నిర్వహించిన ఒక సమావేశంలో రాజ్ ఠాక్రే వ్యాఖ్యలకు ఉద్దవ్‌ ఠాక్రే బహిరంగగా మనసులో మాటను బయటపెట్టారు. ‘నేను మా మధ్య ఉన్న విబేధాలను పక్కన పెట్టడానికి సిద్ధం. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని మరాఠీ ప్రజలను కలిసిపోవడానికి  దృష్టి సారించాను. కానీ ఓ షరతు. గతంలో అన్నీ పరిశ్రమలు మహరాష్ట్ర నుంచి  గుజరాత్‌కు తరలిపోయే సమయంలో కలిసి ఫైట్‌ చేసి ఉంటే మహారాష్ట్ర కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వాళ్లం. అది సాధ్యం కాలేదు. రాష్ట్రం కోసం ఓ నిర్ణయం తీసుకుని దానిమీద ఐక్యంగా పోరాటం చేయాలి. ఆ తరహా ఐక్యత లేకుండా ఇప్పుడు కలిసి పని చేద్దాం అని అనడం సరైంది కాదు’ అని అంటూనే అవును, మహారాష్ట్ర కోసం ఐక్యమవుదాం అని హింట్‌ ఇచ్చారు. 

ఈ ఇద్దరు ఠాక్రేలు.. మహారాష్ట్ర ప్రభుత్వం మహాయుతి కూటమి ప్రభుత్వం ఒకటి నుంచి  ఐదవ తరగతి వరకు అన్నీ పాఠశాలల్లో  హిందీని తప్పని సరి చేసేలా నిర్ణయం తీసుకున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు.    

రాజ్‌ఠాక్రే, ఉద్దవ్‌ ఠాక్రేల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
రాజ్‌ఠాక్రే, ఉద్దవ్‌ ఠాక్రేల నిర్ణయంపై రాజకీయ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. రాజ్‌ఠాక్రే, ఉద్దవ్‌ ఠాక్రేల నిర్ణయంపై మహాసీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు కలిస్తే బీజేపీకి సంతోషమే. వారు కలసినా మునిసిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల్లో ఎన్‌డీఏని ఓడించలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావంకులే కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేతో కలవాలా? వద్దా?అనేది ఆయన స్వేచ్ఛ. ఆయన తన పార్టీ భవిష్యత్తును నిర్ణయించుకోవచ్చు. అందుకు బీజేపీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదన్నారు.    

మహాయుతిని కాదని ఉద్దవ్‌ ఠాక్రేతో చేతులు 
స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్‌ఠాక్రేతో కలిసి పనిచేసేందుకు బీజేపీ ప్లాన్‌ వేసింది. ఇందులో భాగంగా మహాయుతి కూటమిలో భాగమైన శివసేన అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేని రంగంలోకి దించింది. గత వారం రాజ్‌ఠాక్రేతో సంప్రదింపులు జరిపింది. ఆ పొత్తులపై ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ తాజా రాజకీయ పరిణామాలపై ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని  శివసేన ఎంపీ సంజయ్ నిరుపమ్  ఘాటుగా స్పందించారు. ‘రెండు సున్నాలు కలిస్తే సున్నానే అవుతుంది’. ఉద్దవ్ ముందుగా కాంగ్రెస్‌తో కలిసి ముస్లిం ఓట్లపై ఆధారపడ్డారు. అది ఫలించకపోతే ఇప్పుడు రాజ్ ఠాక్రే వైపు మొగ్గుతున్నారు. ఇది మహారాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం. వీరిద్దరూ కలిసి వచ్చినా మహాయుతిని ఏం చేయలేరని స్పష్టం చేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement