తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్‌ నేతలను ఆరా తీసిన రాహుల్‌

Rahul Gandhi Asked Telangana Congress Leaders Party Situation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అగ్రనేత రాహల్‌గాంధీ తెలంగాణలో రాజకీయాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీల పనితీరు, కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాల విషయాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలు, మైనార్టీల మొగ్గు, ఓబీసీల జనగణన వంటి అంశాలపై చర్చించారు. సోమవారం మధ్యాహ్నం కర్ణాటకలోని బీదర్‌ జిల్లా బాల్కిలో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వెళ్తూ మార్గమధ్యలో ఆయన శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆగారు. కొద్దిసేపు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావెద్, రోహిత్‌చౌదరిలు పాల్గొన్నారు.  

జాతీయ నాయకులొస్తే బాగుంటుంది.. 
రాష్ట్రంలో హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రలు జరుగుతున్న తీరు గురించి రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. యాత్రలు బాగా జరుగుతున్నాయని, అయితే వీటికి జాతీయ స్థాయి నేతలు హాజరయితే బాగుంటుందని రేవంత్‌రెడ్డి కోరినట్టు తెలిసింది. ఇందుకు రాహుల్‌ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై రోజురోజుకూ పెరుగుతున్న వ్యతిరేకతను కాంగ్రెస్‌ పారీ్టవైపు మరల్చుకునే విషయంలో ఎలాంటి కార్యాచరణను అమలు చేస్తారన్న దానిపై కూడా రాహుల్‌ చర్చించారు. బీజేపీ కార్యకలాపాలపై కూడా ఆరా తీశారు.  

మైనార్టీలు.. ఓబీసీల జనగణన.. 
ముఖ్యంగా రెండు ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. రాష్ట్రంలో మైనారీ్టల మూడ్‌ ఎలా ఉందని, ఆ వర్గాలు ఎటువైపు మొగ్గు చూపే అవకాశముందని రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్‌ అర్బన్‌ ప్రాంతంలోని మైనారీ్టలు ఎక్కువగా ఎంఐఎం వైపే ఉంటారని, గ్రామీణ జిల్లాల్లోని మైనార్టీలు మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు అండగా ఉంటారని రాష్ట్ర నేతలు తెలిపారు. అయితే బీజేపీపై కాంగ్రెస్‌ పోరాటం, రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు లాంటి అంశాల నేపథ్యంలో ఈసారి మైనార్టీల ఓటు బ్యాంక్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపే ఎక్కువగా మరలే అవకాశముందని నేతలు వివరించారు.

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఓబీసీల జనగణన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ జనగణనకు కట్టుబడి ఉందన్న అంశాన్ని ప్రజలకు చెప్పాలని రాహుల్‌ సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ విధానం అనుకూలంగా ఉన్నందున అన్ని రాష్ట్రాల పీసీసీలతో తీర్మానాలు చేయించాలని, దీంతో ఓబీసీ ఓటర్లు కాంగ్రెస్‌ పారీ్టకి సానుకూలంగా మారే అవకాశం ఉందని యాష్కీ సూచించగా, రాహుల్‌ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. 30–35 నిమిషాల పాటు రాష్ట్ర నేతలతో మాట్లాడిన రాహుల్‌.. శాండ్‌విచ్‌ తిని, తేనీరు సేవించి ఢిల్లీ వెళ్లారు.
చదవండి: ఆత్మీయ సమ్మేళనాలకు దూరంగా నేతలు..  అసమ్మతిపై బీఆర్‌ఎస్‌ ఆరా!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top