వేములవాడకు త్వరలో ఉపఎన్నిక.. బీజేపీని నాలుగుసార్లు ఓడించా..

Raghunandan Rao, Chennamaneni Ramesh War of Words on Vemulawada By Poll - Sakshi

రఘునందన్‌రావు, రమేశ్‌బాబు వాగ్యుద్ధం

తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. పౌరసత్వ వివాదంలో ఇరుక్కున్న రమేశ్‌బాబుకు పదవీ గండం ఉందని, త్వరలోనే వేములవాడకు ఉప ఎన్నిక వస్తుందని రఘునందన్‌రావు జోస్యం చెప్పారు. దీనిపై రమేశ్‌బాబు దీటుగా స్పందించారు. 


మునుగోడు నుంచి అసెంబ్లీకి మరో ‘ఆర్‌’

వేములవాడ: ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ తరఫున ట్రిపుల్‌ ‘ఆర్‌’ ఉందని, మునుగోడు ఎన్నికతో మరో ‘ఆర్‌’ అసెంబ్లీలోకి అడుగు పెడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పర్యవేక్షకుడు తిరుపతిరావు, అర్చకుల బృందం స్వామివారి ప్రసాదం అందించి, సత్కరించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు.


వేములవాడ ఎమ్మెల్యే పౌరసత్వం అంశంపై కోర్టు తీర్పు వస్తుందని, త్వరలోనే ఇక్కడ కూడా ఉపఎన్నిక జరుగుతుందని చెప్పారు. వేములవాడలో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యే రమేశ్‌బాబు చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పేరు మార్చి, ఎంఐఎం అనుమతితో ప్రభుత్వం వేడుకలు నిర్వహించిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది సెక్యులరిజమా లేక మతతత్వమా? సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఏటా రూ.100 కోట్లు ఇస్తామని మాట తప్పారన్నారు.

మునుగోడులో బీజేపీ గెలుస్తుందని తెలిసి, ఆయనకు నిద్ర పట్టడం లేదని పేర్కొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే 8 ఏళ్లుగా చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. కేవలం రంగురంగుల బ్రోచర్లు తప్ప నయాపైసా పని చేయలేదన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు సంతోష్‌బాబు, శ్రీనివాస్, సుదర్శన్‌యాదవ్, అన్నారం శ్రీనివాస్, కిష్టస్వామి, రమేశ్‌ తదితరులున్నారు. (క్లిక్ చేయండి: కరీంనగర్‌ జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయాలు)


రాజన్న గుడికొచ్చి రాజకీయం చేయొద్దు

వేములవాడ: నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను నాలుగుసార్లు ఓడించానని, సొంత బాబాయ్, బీజేపీ అభ్యర్థి సీహెచ్‌.విద్యాసాగర్‌రావుపై 20 వేల ఓట్లతో గెలిచానని ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పౌరసత్వ వివాదం కోర్టు పరిధిలో ఉందని, దానిపై నో కామెంట్‌ అన్నారు. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. 

మంత్రి కేటీఆర్‌ చాలా సార్లు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారని, ఆయన వేసుకునే దుస్తులు ఆయన ఇష్టమని తెలిపారు. మంత్రి సారథ్యంలో జిల్లా అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. రాజన్న గుడి చెరువులో 365 రోజులు గోదావరి జలాలు ఉండేలా చూస్తున్నామని, గుడికొచ్చిన మీకు ఇది కనిపించలేదా అని ప్రశ్నించారు. పోచమ్మ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే నిధులు కేటాయించామన్నారు. మీరిప్పటి వరకు కేంద్రం నుంచి ఒక్క పైసానన్న రాజన్న ఆలయానికి తీసుకొచ్చారా అని మండిపడ్డారు. 

వేములవాడలో ఉపఎన్నిక అంటూ ఊదరగొడుతున్నారని అన్నారు. ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కౌన్సిలర్‌గా ఓడిపోయారని, ఇదీ వేములవాడలో ఆ పార్టీకి ఉన్న బలం అంటూ ఎద్దేవా చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. (క్లిక్ చేయండి: టీఆర్‌ఎస్‌లో బయటపడ్డ అంతర్గత విభేదాలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top