గుడి వద్ద జరుగుతున్న విస్తరణ పనులు, పిల్లర్లు తవ్వే బాహుబలి యంత్రం (ఫైల్)
సాక్షిప్రతినిధి, కరీంనగర్: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయ పునర్‌నిర్మాణ ప్రక్రియకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వీలైనంత వేగంగా ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని తెప్పించిన బాహుబలి యంత్రం వెనక్కి వెళ్లడంతో అధికారుల లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. గుడి ఆధునీకరణ, అభివృద్ధి, విస్తరణలో భాగంగా ఇప్పటికే పలు నిర్మాణాలు కూల్చేశారు. నూతన నిర్మాణాల కోసం పనులు కూడా మొదలయ్యాయి. ఇక్కడే అధికారులకు ఆటంకాలు ఎదురయ్యాయి.
మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా గుడి చుట్టూ నూతనంగా దాదాపు 76 పిల్లర్లతో (ఫైల్ ఫౌండేషన్ ప్లాన్‌తో ప్లింత్ భీమ్‌ల విధానం) నిర్మాణానికి ప్లాన్ రూపొందించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీలైనంత వేగంగా గుడిని పునర్‌నిర్మించాలని ఆర్‌అండ్‌బీ అధికారులు భావించారు. ఇందుకోసం భారీ యంత్రాన్ని తీసుకువచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ యంత్రంతో ఇక్కడ పనిచేయలేని పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఆలయ నిర్మాణం పనుల్లో జాప్యం తప్పదని తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
గుడి కోసం పిల్లర్లను వేగంగా భూమి లోపల నేరుగా నాటుకుంటూ నిర్మించే భారీ బాహుబలి యంత్రాన్ని ప్రత్యేక వాహనంలో తెప్పించారు. తీరా యంత్రాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పిల్లర్ల పని ప్రారంభించాక మట్టి కుంగిపోవడం, జారిపోవడం మొదలైంది. దీంతో ఈ యంత్రం ఇక్కడ పనికిరాదని అధికారులు నిర్ధారణకొచ్చారు. చేసేది లేక చెన్నై నుంచి తెప్పించిన భారీ బాహుబలి యంత్రాన్ని తిప్పి పంపించారు.
ఫలితంగా ఇంతకాలం యంత్రంతో పిల్లర్ల నిర్మాణం వేగంగా చేపట్టవచ్చని రూపొందించుకున్న ప్లాన్ మారిపోయింది. అధికారులు ఇప్పుడు పిల్లర్లను నిర్మించేందుకు సాధారణ పద్ధతి ప్రకారమే కందకాలు తవ్వే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి బాహుబలి యంత్రంతో పనులు వేగంగా జరిగితే, మేడారం జాతర సమయానికి స్వామి వారి దర్శనాలు ఏర్పాటు చేయాలని భావించారు.
కానీ, ఇప్పుడు యంత్రం తరలిపోవడంతో పనుల్లో జాప్యం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఈఈ శాంతయ్యను వివరణ కోరగా.. బాహుబలి యంత్రాన్ని సాంకేతిక కారణాలతో వెనక్కి పంపిన మాట వాస్తవమేనన్నారు. ఇప్పుడు కందకాలు తవ్వుతున్నామని, తాజా పరిస్థితుల్లో నిర్మాణ ప్లానింగ్, అంచనాలు కూడా మారతాయని వివరించారు.
మేడారం జాతరలోపు రాజన్న దర్శనం అనుమానమే..
మాస్టర్‌ప్లాన్, ఆలయ విస్తరణలో భాగంగా అధికారులు గత నెల 13వ తేదీ నుంచి రాజన్న దర్శనాలు నిలిపివేశారు. ఆలయ ప్రధాన ద్వారం చుట్టూ ఇనుపరేకుల వలయం ఏర్పాటు చేశారు. ప్రత్యామ్నాయంగా భీమన్న ఆలయంలో దర్శనాలు, కోడెమొక్కులు చెల్లించడానికి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ)కి వైస్‌చైర్మన్‌గా కలెక్టర్ వ్యవహరించాలి.
ప్రస్తుతం రాజన్నసిరిసిల్లకు పూర్తిస్థాయి కలెక్టర్ లేరు. అదనపు కలెక్టర్‌కే ఇన్‌చార్జి కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. అయితే సర్పంచ్ ఎన్నికల హడావుడిలో కలెక్టర్ తలమునకలయ్యారు. దీంతో ఈ పనులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని సమాచారం. త్వరలో మేడారం జాతర రాబోతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తొలుత రాజన్నను దర్శించుకునేందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఈసారి మేడారం జాతర ప్రారంభమయ్యేలోగా రాజన్న దర్శనాలు దాదాపు అనుమానమేనని స్థానికులు అంటున్నారు.


