‘ప్రశ్న’కు పవన్‌ భయపడుతున్నారా? | Youtuber Prashna Raavan Arrest Row, Kommineni Comments On Pawan Kalyan And Raises Questions Over Freedom Of Expression | Sakshi
Sakshi News home page

‘ప్రశ్న’కు పవన్‌ భయపడుతున్నారా?

Jul 8 2026 9:29 AM | Updated on Jul 8 2026 10:44 AM

Prashna Ravan Arrest Row: Kommineni Comments On Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది? సోషల్‌ మీడియాను అణచివేయాలన్న ఆలోచనతో టీడీపీ, జనసేన కూటమి నేతలు అనుసరిస్తున్న పద్దతులు ప్రమాదకరంగా మారుతున్నాయి. యూ ట్యూబర్ రావణ్ అనే ఆయనపై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టిన తీరు సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. నిజంగా ఆయన అలాంటి తప్పు చేసి ఉంటే చర్య తీసుకోవచ్చు.

కాని ఒక ప్రసంగంలో ఏదో మాట్లాడాడని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆయన పదే, పదే నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఉద్దేశంతో కేసు పెట్టడం, ఆ వెంటనే అరెస్టు చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం, అవి అంతగా ఫలించకపోవడంతో ఏకంగా దేశద్రోహం కేసులో జైలుకు పంపించడం అంత సమంజసం అనిపించదు.

రావణ్‌ చేసే వ్యాఖ్యలలో అభ్యంతరకర విషయాలు ఉంటే ఎవరూ సమర్ధించరు. కాని అదే టైమ్‌లో ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరించడం శోచనీయం. దళిత క్రైస్తవుల డిమాండ్లకు సంబంధించి ఏలూరులో జరిగిన సభలో ఆయన  పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. పవన్ కళ్యాణ్ గతంలో ఆయా సందర్భాలలో చేసిన  ఆవేశపూరిత ప్రకటనలను  ఉటంకిస్తూ అదే  తరహాలో మాట్లాడారు. పిఠాపురంలో జరిగిన ఒక కుల  వివాదాన్ని ఆయన గట్టిగా ప్రస్తావించారు. అది పవన్‌కు కోపం తెప్పించి ఉండవచ్చు. ఆ వెంటనే జనసేన కార్యకర్తలను పురమాయించి కేసులు  పెట్టించారు.

రావణ్‌ను ముందుగా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ కోర్టువారు బెయిల్ ఇవ్వగానే సర్పవరం, మచిలీపట్నం, నక్కపల్లి పోలీసులు అరెస్టు చేయడం సంబంధిత కోర్టులు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగాయి. పాయకరావు పేట నుంచి ఆయన  బయల్దేరి వస్తుండగా, మళ్లీ పోలీసులు  అరెస్టు చేసి ఈసారి కృష్ణా జిల్లా గన్నవరం తీసుకువచ్చారు. ఏకంగా దేశద్రోహం కేసుపెట్టారు. ఉగ్రవాదులపై పెట్టే  సెక్షన్‌లు పెట్టారు. తద్వారా కోర్టు రిమాండ్ అంటే జైలుకు పంపించేలా  చేశారు. ఈ ఘటనలన్నిటిని చూసినవారికి ఏమనిపిస్తుంది.

రావణ్‌ను జైలులో ఎలాగైనా పెట్టాల్సిందేనని, పవన్ కళ్యాణ్, ఆయన పార్టీవారు కోరుకున్నారని, ఆ కక్ష తీర్చుకోవడానికి, అహం చల్లబరచుకోవడానికి ఇలా చేశారని అనిపించదా? మొదటే దేశద్రోహం కేసు పెట్ట లేదు. ఐదు రోజుల పాటు నిద్రహారాలు సరిగా  లేకుండా అతనిని తిప్పిన తీరు కూడా దారుణంగా ఉంది. ఇక్కడ చిత్రమేమిటంటే శాంతిభద్రతల గురించి, దాడుల గురించి పదే పదే సుద్దులు చెప్పి ప్రభుత్వ పెద్దలు ఈ పోలీస్‌ స్టేషన్ల వద్ద జరిగిన గొడవను మాత్రం సీరియస్‌గా తీసుకోలేదు. జనసేన కార్యకర్తలు ఆయా స్టేషన్ల వద్ద నానా రచ్చ చేశారు.

కొన్నిచోట్ల పోలీసులను కింద పడేశారు. గోడలు దూకి స్టేషన్‌లోకి వెళ్లి రావణ్‌ను కొట్టడానికి యత్నించారు. మరి ఇవేవి తప్పు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? వారిపై ఏమైనా కేసులు పెట్టారా? పెట్టి ఉంటే అవి ఏ  తరహావో చెప్పాలి కదా!ఒక్కరినైనా ఎందుకు అరెస్టు చేయలేదు? అంటే టీడీపీ, జనసేనలకు చెందినవారు ఎలాంటి రౌడీయిజం చేసినా,  అరాచకాలకు పాల్పడినా పోలీసులు కూడా అడ్డుకునే పరిస్థితి లేదని చెప్పదలిచారా? గత కొన్నాళ్లుగా దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ సహనం, సంయమనం లేకుండా కక్ష కట్టి ఒక యూట్యూబర్ పై ఈ రకమైన  కేసులు  పెట్టించడం పిచుకపై బ్రహ్మాస్త్రం వేసినట్లు  అనిపించదా?

ఈయన చేసిన విధంగా గతంలో పవన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదా అంటే పలుమార్లు ఆ తరహాలో  మాట్లాడిన వీడియోలు అనేకం కనిపిస్తాయి. ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయన  తాను నక్సలైట్ అవ్వాలనుకున్నానని, తుపాకి పట్టుకోవడం గురంచి  మాట్లాడారు. బీజేపీతో కలిసి లేనప్పుడు యుద్ధాల గురించి ఆయన ఏమి మాట్లాడారో కూడా కొందరు గుర్తు  చేస్తున్నారు. రావణ్ ఒక స్పీచ్‌లో  ఏదేదో మాట్లాడారని, దానితో దేశ సమగ్రతకు భంగం కలిగించే పనులు చేసినట్లు, వివిధ వర్గాల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు  పోలీసులు ఆరోపించారు.

నిజానికి మతపరమైన, కులపరమైన విద్వేష వ్యాఖ్యలు చేసిన కొందరు నేతలు ప్రస్తుతం కూటమిలో ప్రముఖులుగా ఉన్నారు. అవన్ని  ఎందుకు!ఒకప్పుడు టీడీపీ వారు దేశ ప్రధానిని ఎంతలేసి మాటలు అన్నారో అందరికి తెలుసు కదా! అవేవి తప్పుకాదా?వారికి ఏమీ కాలేదే!  వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు రావణ్ అప్పటి ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగానే విమర్శించేవారు. అయినా అప్పుడు కేసులు రాలేదు. రావణ్‌పై ఇంత తీవ్రమైన కేసులు పెట్టి   అరెస్టు చేయడాన్ని వైఎస్‌ జగన్  ఖండించారు.

రావణ్‌కు మద్దతుగా జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ఆయా కోర్టులలో వాదనలు చేశారు. దేశ ద్రోహం కేసు పెట్టడానికిగాను వీడియోలను మార్ఫింగ్ చేశారని రావణ్ భార్య అనూష ఆరోపించారు. ప్రశ్నించడాన్ని  తట్టుకోలేకపోతే తమ కుటుంబాన్ని చంపేయండని ఆమె ఆవేదనతో వ్యాఖ్యానించారు. రావణ్ నిజంగా దేశ ద్రోహానికి పాల్పడ్డారా? లేదా? అన్నది పోలీసులు ఎలా నిర్థారించుకున్నారో తెలియదు. జనసేన స్థానిక నాయకుడు ఒకరు కేసుపెట్టడం, వెంటనే పోలీసులు రంగంలో దిగిపోవడం జరిగింది.

పోలీసులు అనుసరిస్తున్న తీరు మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట తెస్తుంది. అధికారంలో ఉన్నవారు చెప్పినా అది నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా? అన్నది తేల్చుకుని ఆ తర్వాత కేసు  పెడితే  బాగుంటుంది. రావణ్ అరెస్టు వల్ల ఆయనకు జరిగిన నష్టం ఎంతో చెప్పలేం కాని, పవన్ కళ్యాణ్ కైతే నైతికంగా చాలా అప్రతిష్ట వచ్చే పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం  ఉంది. తనకు  వ్యతిరేకంగా ఎవరైనా పన్నిన ట్రాప్ లో పవన్ పడి, ఇలాంటి అరెస్టులు చేయిస్తున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన ఆయన, తన  ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. మరో ఘటనలో కూడా పవన్‌కు నష్టమే  జరిగింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆయన తప్పు  చేసిన పోలీసు అధికారికి మద్దతు ఇచ్చిన తీరు తీవ్ర విమర్శలకు గురైది. సాయికృష్ణను రౌడీషీటర్ అని, పోక్సో కేసులో నిందితుడని, క్రిమినల్ అని పవన్ చెప్పడాన్ని ప్రజాస్వామికవాదులు ఆక్షేపిస్తున్నారు. ఎవరినైనా చంపే  హక్కు పోలీసులకు ఉందని పవన్ భావిస్తున్నారా? అది ఏ రకంగా చట్ట సమ్మతం అని ప్రశ్నిస్తున్నారు.

పవన్ వ్యాఖ్యలను సాయికృష్ణ తల్లి తీవ్రంగా ఖండించారు. తన కుమారుడిపై ఫోక్సో కేసును  కోర్టు కొట్టివేసిందని,  ఆ యువతి కూడా అలాంటిది జరగలేదని చెప్పినా ఇలా మాట్లాడడం న్యాయమా అని ఆమె అడిగింది. సాయికృష్ణ కూడా పవన్ అభమాని అని, తామంతా ఆయనకే ఓట్లు వేశామని, కాపులు ఆయనకు మద్దతు ఇచ్చినందుకు ఇలా అంటున్నారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్‌ కాని, జనసేన పార్టీ కాని జవాబు ఇవ్వలేకపోయారు.

ఈ రెండు ఘటనలలో టీడీపీ వ్యూహాత్మకంగా చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తూ పవన్‌ను వివాదంలో దించిందా అన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. క్రాంతికుమార్ అనే యువకుడు కూడా పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కూడా ప్రభుత్వం సకాలంలో చర్య తీసుకోలేదు. క్రాంతి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి జగన్ వెళ్లాకే కదలిక వచ్చింది.  విశేషం ఏమిటంటే క్రాంతి తండ్రి టీడీపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి. అయినా పార్టీలకు అతీతంగా వైఎస్‌ జగన్ ఆయన  ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు.

తెలంగాణకు చెందిన జర్నలిస్టు కేవీఆర్‌ను కూడా కక్ష పూరితంగా అరెస్టు చేసి, ఎక్కడో మారుమూల ఉన్న బొబ్బిలి జైలులో పెట్టారు. అది చాలదన్నట్లుగా తమకు విధులకు అడ్డుపడ్డారని చెప్పిన ఆయన భార్యపై కూడా కేసు  పెట్టారు. తన పట్ల ఏపీ పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఆమె కేసు పెట్టడంతో పోటీగా ఈ కేసు  పెట్టారనుకోవాలి. జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లపై దాడి చేసినా కేసులు లేవు. ఇవన్ని చూస్తుంటే ఏపీలో సోషల్ మీడియాను అణచివేయడానికి  ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాపై సుమారు 1400 కేసులు పెట్టి దేశంలోనే ఒక రికార్డు సృష్టించుకుంది. ప్రజలలో వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు దిగితే చంద్రబాబు ప్రభుత్వం మరింత అప్రతిష్టపాలవుతుందని చెప్పక తప్పదు.

 

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement