రంగారెడ్డి: టీఆర్‌ఎస్‌ నేతల్లో పీకే ఫీవర్‌!

Prashant Kishor Tension In Ranga Reddy TRS Leaders And MLAs - Sakshi

అధికార పార్టీ నేతలకు ప్రశాంత్‌ కిషోర్‌(పీకే) ఫీవర్‌ పట్టుకుంది. కొంత మంది సిట్టింగ్‌లపై భూ కబ్జాలు, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలకు తోడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే ఎన్నికల్లో వీరి గెలుపు అత్యంత కష్టమని అధినేత కేసీఆర్‌కు నివేదిక అందడమే ఇందుకు కారణం. ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలో దించాలని గులాబీ బాస్‌ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్‌ఎస్‌ నేతల్లో టెన్షన్‌ మొదలైంది. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమేనని తెలుస్తోంది. మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్లు అవకాశం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సొంత పార్టీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజికవర్గం, బంధువులు, పార్టీ శ్రేణులు, స్నేహితులు, వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.. వెంటనే వాలిపోతున్నారు.   

అంతర్గత కుమ్ములాట 
చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నంల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది. భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, అవినీతిపై వీరిరువురూ బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఎల్బీనగర్‌లోనూ ఇదే తంతు కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ తరఫున గెలుపొంది.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రామ్మోహన్‌గౌడ్‌ మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోంది. రాజేంద్రనగర్‌లో సిట్టింగ్‌ స్థానంపై మంత్రి కుమారుడితో పాటు ఎంపీ కన్నేశారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎవరికి వారు పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వీరు స్థానికంగా ఉన్న సామాజికవర్గం బంధువులు, ముఖ్య నేతలను తరచూ కలుస్తుండటంతో కేడర్‌లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరువురూ విఫలమవుతున్నారు. మొత్తానికి తమపై ఎలాంటి రిపోర్ట్‌ అందిందోనని ఎమ్మెల్యేలు టెన్షన్‌ పడుతున్నారు.   

‘పట్నం’ దాటని జిల్లా సారథి 
ప్రత్యర్థులు బలపడకుండా చూడటంతో పాటు పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం దాటడం లేదు. నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసి, ముఖ్య నాయకుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలేవీ చేయడం లేదు.గ్రామ,మండల,వార్డు, డివి జన్, మున్సిపాలిటీ,కార్పొరేషన్‌ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసినప్పటికీ..జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించలేదు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పార్టీ పదవులను ముట్టుకుంటే తేనెతుట్టెను కదిపినట్లేననే భావనలో నేతలు ఉన్నట్లు సమాచారం.   
చదవండి: గోరంట్ల వెర్సెస్‌ ఆదిరెడ్డి.. సిటీ సీట్‌ హాట్‌ గురూ..! 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top