గోరంట్ల వెర్సెస్‌ ఆదిరెడ్డి.. సిటీ సీట్‌ హాట్‌ గురూ..! 

Internal Clashes Between Adireddy Vasu and Butchaiah Chowdary in Rajamahendravaram - Sakshi

ఎన్నికలకు రెండేళ్ల ముందే టీడీపీలో వార్‌ 

సిటీలో తాను పోటీచేస్తానని వాసు ప్రకటన 

తాజాగా నేతల మధ్య మొదలైన సిగపట్లు  

రాజమహేంద్రవరంలో నువ్వా నేనా

సాక్షి, రాజమహేంద్రవరం: ఇది మల్లెల వేళయని...వెన్నెల మాసమని...తొందరపడి ఒక కోయిల ముందే కూసింది ..విందులు చేసింది...సుఖదుఃఖాలు సినిమాలో దేవులపల్లి రాసిన పాట ఇది.. టీడీపీలో యువ నాయకుడొకరు ఇదే పల్లవి అందుకున్నారు. దీనిపై రాజకీయంగా రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఫలితంగా చాలా కాలంగా పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుకు మరోసారి తెర లేచింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఆ పార్టీలో ఎప్పుడూ హాట్‌ సీట్‌గా పేరున్న రాజమహేంద్రవరం సిటీ కోసం ఇప్పటి నుంచే పోరు మొదలైనట్టుగా కనిపిస్తోంది.

కొన్నేళ్లుగా ఈ విషయంలో సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొరుగున అదే పార్టీకి చెందిన రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోన్న సంగతి బహిరంగ రహస్యమే. ప్రతి ఎన్నికల సందర్భంలో సిటీ నుంచి పోటీ చేయాలని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న గోరంట్ల ప్రయత్నిస్తూనే ఉంటారు.

ఈయనకు పోటీగా ఆదిరెడ్డి అప్పారావు వర్గం టిక్కెట్టు కోసం పోటీ పడుతూ ఉంటుంది. ఇది పార్టీలో సహజ పరిణామంగానే చెప్పుకుంటారు. అటువంటిది సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా రాజమహేంద్రవరం సిటీ నుంచి తానే పోటీ చేస్తానని సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త.. ఆ పార్టీ నాయకుడు వాసు బుధవారం హఠాత్తుగా ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక కారణమేమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అంటే ఇప్పటి నుంచే టీడీపీలో సీట్ల సిగపట్లు మొదలయ్యాయంటున్నారు.

చదవండి: (Atmakur Byelection: బీజేపీ బేజార్‌.. అభ్యర్థి ఎంపికే మైనస్‌)
 
ఆధిపత్య పోరు
రాజమహేంద్రవరం జేకే గార్డెన్స్‌లో సిటీ నియోజకవర్గ పార్టీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే భర్త వాసు బయటకు వచ్చి మీడియాకు ఈ విషయాన్ని తెలియజేశారు.  గత కొంతకాలంగా ఆ పార్టీలో పరిణామాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు.  ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేయకుండానే భగ్గుమనే వాతావరణం ఈ ప్రకటనతో కనిపిస్తోంది. గోరంట్ల రూరల్‌కు వెళ్లిపోయినా సిటీపైనే ఆయన దృష్టి ఉంది.

పార్టీలో సీనియర్‌ అయిన తనను కాదని వేరేవారిని ప్రోత్సహించారనే ఆవేదన ఆయనలో మొదటి నుంచి ఉంది. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో వెళ్లగక్కుతూనే ఉంటారు. ఏడాదిన్నర క్రితం సిటీలో తమ వర్గానికి చెందిన వారికి పదవుల్లో ప్రాతినిధ్యం లేకుండా చేశారనే ఆవేదనతో పార్టీ, రాజకీయాలకు దూరమవుతున్నట్టు మీడియాకు తెలియచేసి హైడ్రామా సృష్టించారు. చివరకు పార్టీ పదవులు తమ వారికి సాధించుకుని ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.  

చదవండి: (జనసేన వారు 62 మంది.. టీడీపీ వారు 21 మంది)

టీడీపీలో అంతర్యుద్ధం 
సిటీ నియోజకవర్గంలో తనకంటూ ఉన్న మాజీ కార్పొరేటర్లతో ఆదిరెడ్డి వర్గానికి పోటీగా గోరంట్ల పార్టీ కార్యాలయాన్ని  ప్రారంభించారు. ఇవన్నీ నడుస్తోన్న క్రమంలోనే తన రాజకీయ వారసుడిగా సోదరుడు శాంతారామ్‌ తనయుడు రవిరామ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అంతటితోనే ఆగకుండా సిటీలో తన పుట్టిన రోజు వేడుకలను విస్తృతంగా నిర్వహించి రాజకీయాలకు తానేమీ దూరం కాలేదని స్పష్టం చేశారు. ఇంతకంటే ముందుగానే గోరంట్ల వైరి పక్షమైన మాజీ ఎమ్మెల్సీ అప్పారావు కూడా రాజకీయ వారసుడిగా తనయుడు వాసును ప్రకటించడంతో టీడీపీలో అంతర్యుద్ధం మొదలైంది. నాటి నుంచి చాపకింద నీరులా సాగుతోన్న ఈ రెండు వర్గాల అంతర్గత పోరు వాసు తాజా ప్రకటనతో మళ్లీ తెరపైకి వచ్చింది. 

ప్రకటన వెనుక వ్యూహం 
వాసు ప్రకటన వెనుక రాజకీయ దూరాలోచన ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. భవిష్యత్‌ రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానానికి ఆదిరెడ్డి కుటుంబం నుంచి పోటీకి పెడతారని ఇటీవల  ఆ పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిని గోరంట్ల వర్గం భుజానకెత్తుకుని చేస్తోందని ఆదిరెడ్డి వర్గం అనుమానం వ్యక్తం చేస్తోంది. సిటీ కోసం ఆరాటపడుతోన్న గోరంట్ల వర్గం పనిగట్టుకుని చేస్తున్న  ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహంలో భాగంగానే  వాసు తాజా ప్రకటన అంతరార్థమని తెలుస్తోంది. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీ నుంచే పోటీ చేస్తామని, ఎంపీగా వెళ్లే ప్రసక్తే లేదని వాసు తేల్చి చెప్పారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే భవాని ఉండగా ఆమెను  కాదని భర్త వాసు పోటీ చేస్తాననడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.  ఆమె పనితీరు సమర్థవంతంగా లేదనా, లేక రాజకీయాల్లో రాణించలేక పోతున్నారనా.. వీటిలో ఏ కారణంతో వాసు పోటీకి సై అంటున్నారని నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆమెను బలపరిచాను, వచ్చే సారి ఆమె నన్ను బలపరుస్తుంది అని వాసు మీడియా వద్ద ముక్తాయించడం గమనార్హం. దీనిపై గోరంట్ల వర్గం ఏ రకమైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతుందో వేచి చూడాల్సిందే.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top