
సాక్షి, అమరావతి: అమలాపురంలో విధ్వంసం కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి పాల్పడిన అల్లరి మూకలపై రాజకీయాలకు అతీతంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీడియో, సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 143 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
వారిలో జనసేన, టీడీపీలకు చెందినవారు అత్యధికంగా ఉండటం గమనార్హం. జనసేనకు చెందిన వారు 62 మంది, టీడీపీకి చెందిన వారు 21 మంది ఉండగా... బీజేపీ, వైఎస్సార్‌సీపీలకు చెందిన వారు చెరో ఐదుమంది ఉన్నారు. మిగిలిన 50 మంది ఏ పార్టీకి చెందని వారుగా పోలీసులు గుర్తించారు. దాడుల్లో ప్రమేయం ఉందని భావించిన వైఎస్సార్‌సీపీకి చెందినవారిని కూడా పోలీసులు అరెస్టు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా అమలాపురం అల్లర్ల కేసులో ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.