Prashant Kishor: టార్గెట్‌ 370! కాంగ్రెస్‌ ముందు పీకే బ్లూప్రింట్‌

Prashant Kishor Meets Gandhis Amid Speculations Of Induction In Congress - Sakshi

వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలు

పార్టీ ప్రక్షాళనపై కీలక సూచనలు

సోనియా, రాహుల్‌కు ప్రజెంటేషన్‌

సూచనల అధ్యయనానికి కమిటీ

పార్టీలో చేరాలంటూఆహ్వానం

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల వరుస ఎన్నికల్లో పరాజయాలను మూటగట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ కాలూచెయ్యీ కూడదీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో సీనియర్‌ నేత రాహుల్‌గాంధీ ఇప్పటికే నేతలతో వరుస భేటీలు జరుపుతూ వారి మధ్య ఐక్యత తెచ్చే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో కాంగ్రెస్‌ అధిష్టానం శనివారం కీలక సమావేశం జరిపింది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నివాసంలో 4 గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై లోతుగా చర్చించారు.

ముఖ్యంగా 370 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే బరిలో దిగాలని, మిగతా చోట్ల పొత్తులు పెట్టుకోవాలని పీకే సూచించారు. అందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, వ్యవస్థాగతంగా చేసుకోవాల్సిన మార్పుచేర్పులతో కూడిన బ్లూ ప్రింట్‌ను నేతల ముందు ప్రజెంట్‌ చేశారు. దానిపై అధ్యయనానికి అంతర్గత కమిటీని సోనియా నియమించారు. పీకే సూచనల్లోని సాధ్యాసాధ్యలపై వారం రోజుల్లో తుది నివేదిక అందించాలని ఆదేశించారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా పీకేను ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధిష్టానం ఆహ్వానించినట్టు సమాచారం. అందుకాయన సానుకూలంగా స్పందించారని, త్వరలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు.

పీకే ‘కలి’విడి’ వ్యూహం
సోనియా–పీకే భేటీలో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ, కీలక నేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్‌సింగ్, అంబికా సోని, అజయ్‌మాకెన్‌ కూడా పాల్గొన్నారు. 2024 ఎన్నికలకు ఇప్పట్నుంచే దూకుడుగా సిద్ధం కావాలని పీకే చెప్పారు. ‘‘ఇందుకోసం 365 నుంచి 370 లోక్‌సభ స్థానాలపై పార్టీ ప్రధానంగా ఫోకస్‌ పెట్టాలి. వాటిలో ఒంటరిగానే పోటీ చేయాలి.

మిగతా చోట్ల గెలిచే పార్టీలతో స్థానిక పరిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకోవాలి. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిషాల్లో ఒంటరిగా బరిలో దిగాలి. తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో పొత్తులతో ముందుకు పోవాలి’’ అన్న సూచనలకు రాహుల్‌ సహా నేతలంతా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా పీకే ప్రజెంట్‌ చేశారు. కాంగ్రెస్‌ బలంగా ఉన్న రాష్ట్రాల్లో తిరిగి అధికారం సాధించే మార్గాలపై నిర్మాణాత్మక సూచనలు చేశారు.

చదవండి: ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురు

‘కమ్యూనికేషన్‌’ సమూలంగా మారాలి
కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని అధిష్టానానికి పీకే సూచించారు. ‘‘కమ్యూనికేషన్‌ విభాగంలో సమూల మార్పులు అవసరం. కమ్యునికేషన్‌ వ్యూహాన్ని పూర్తిగా మార్చాలి’’ అని చెప్పడంతో పాటు కొత్త పంథాలో ప్రజలకు చేర్చే వ్యూహాలనూ వివరించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా సోనియా సహా ముఖ్య నేతలంతా ఈ సందర్భంగా పీకేను కోరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్సల్టెంట్‌గా కాకుండా పార్టీలో చేరి నేతగా పని చేయాలని కోరగా పీకే సానుకూలంగా స్పందించారని నేతలంటున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై పీకే సవివరమైన ప్రజెంటేషన్‌ ఇచ్చారని వేణుగోపాల్‌ చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దానిపై అధ్యయనానికి అంతర్గత కమిటీని సోనియా నియమించారు. అది వారంలో నివేదిక ఇస్తుంది’’ అని వివరించారు. పీకేను కాంగ్రెస్‌ చేరాల్సిందిగా కోరిన మాట నిజమేనా అని ప్రశ్నించగా వారంలో అన్నీ తెలుస్తాయని వేణుగోపాల్‌ బదులిచ్చారు. పీకే బ్లూప్రింట్‌పై రాజస్తాన్‌లో జరిగే కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌లోనూ చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం. 2020లో జేడీ (యూ)లో చేరిన పీకే, పౌరసత్వ (సవరణ) చట్టంపై పార్టీ వైఖరితో విభేదించి బహిష్కరణకు గురవడం తెలిసిందే. 

చదవండి: పంజాబ్‌ ప్రజలకు ఆప్‌ సర్కార్‌ శుభవార్త..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top