నిత్యం ప్రజల్లోనే..  | Sakshi
Sakshi News home page

నిత్యం ప్రజల్లోనే.. 

Published Sun, Oct 16 2022 8:12 AM

Political Special Story On Kottagudem MLA Vanama Venkateswara Rao - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : సుఖసంతోషాల్లోనే కాదు.. కష్టనష్టాల్లోనూ ప్రజల మధ్య మెదిలే నాయకుడిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు పేరుంది. ప్రజస్వామ్యంలో వార్డు సభ్యుడి నుంచి మంత్రి వరకు అనేక పదవులు ఆయన సొంతం చేసుకున్నారు. వార్డు సభ్యుడిగా చిన్న స్థాయిలో ఉన్నా, మంత్రిగా ఉన్నత పదవులు అలంకరించినా గర్వం లేని ప్రజాప్రతినిధిగా ఆయన గురించి చెప్పుకుంటారు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో అతి పెద్ద వయస్కుడైన ఎమ్మెల్యేగా వనమా  కొనసాగుతున్నారు. 50 ఏళ్ల ఆయన రాజకీయ ప్రస్థానం, గుర్తింపు తెచ్చిన ఘటనలు తదిరత అంశాలను ఈ ఆదివారం ప్రత్యేకంగా సాక్షి పాఠకుల కోసం ఆయన మాటల్లోనే.. 

నలుగురిలో ఒకడిగా
నా తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, నాగభూషణం. పాత పాల్వంచలో మాకు పెద్ద ఎత్తున సాగు భూమి ఉండేది. ఇల్లు, పొలంలో కలిపి పద్దెనిమిది మంది పాలేర్లు పని చేసేవారు. పాత పాల్వంచలో ఎకరం విస్తీర్ణంలో ఇల్లు ఉండేది. చుట్టు పక్కల ఉన్న ఊళ్లకు మా నాన్న పెద్ద మనిషిగా వ్యవహరించేవారు.  ఎవ రి ఇళ్లలో శుభకార్యం జరిగినా ఇంటికి వచ్చి పిలిచేవారు. ఫంక్షన్‌ ఖర్చులకు అమ్మానాన్న సాయం చేసేవారు. ఎవరిళ్లలో ఏదైనా కీడు జరిగితే మా అమ్మే అన్నం వండి కావళ్లలో వారి ఇంటికి పంపేది. అలా మా ఇల్లు ఎప్పుడూ కోలాహలంగా ఉండేది. గద్దెల మీద జనాలు ఎప్పుడూ కూర్చుని ఉండేవా ళ్లు. వాళ్లతో కలిసిపోయి, వాళ్ల కష్టాలు విని నాన్నకు చెప్పేవాడిని. అలా ప్రజలతో మమేకం అవడం నాకు చిన్నతనం నుంచే అబ్బింది. విద్యార్థి దశలో ఉండగా నేలకొండపల్లిలో మా మిత్రబృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు శ్రీశ్రీ, దాశరథి వంటి మహామహులు హాజరయ్యారు.

అభివృద్ధికి కేరాఫ్‌గా పాల్వంచ
పాల్వంచ పంచాయతీ ప్రెసిడెంట్‌గా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ పంచాయతీగా పాల్వంచకు గుర్తింపు తీసుకొచ్చాను. గ్రామాల్లో సమస్యలు ఎలా పరిష్కరించాలి, ఎలా అభివృద్ధి చేయాలనే అంశాలను పరిశీలించేందుకు ఇతర పంచాయతీల సర్పంచ్‌లను పాల్వంచకు వెళ్లి చూడమంటూ అప్పటి కలెక్టర్‌ ఈమని పార్థసారధి సూచించేవారు. ఆ తర్వాత కలెక్టర్‌గా వచ్చిన పీవీఆర్‌కే ప్రసాద్‌ సైతం నాపై ప్రత్యేక అభిమానం చూపించేవారు. అధికారిక కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్లేప్పుడు పాల్వంచలో కచ్చితంగా ఆగేవారు. నేను అందించే ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేసేవారు. అప్పటి కొత్తగూడెం ఎమ్మెల్యే పానుగంటి పిచ్చయ్య సైతం ప్రజాకార్యక్రమాల్లో తన వెంట తిప్పుకుంటూ అవసరమైన మేరకు రాజకీయ శిక్షణ ఇచ్చేవారు. పాల్వంచను అన్ని విధాలా అభివృద్ధి చేసి ఉత్తమ పంచాయతీ ప్రెసిడెంట్‌గా అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పరకాల శేషాచలం చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నాను.

సంజయ్‌గాంధీ పర్యటనతో..
ప్రెసిడెంట్‌గా వచ్చిన గుర్తింపుతో చిన్న వయసులోనే భూ తనఖా (ల్యాండ్‌ మార్టిగేజ్‌) బ్యాంక్‌కు చైర్మన్‌గా నియమించారు. అప్పుడు యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడిగా జలగం ప్రసాదరావు, జనరల్‌ సెక్రటరీగా నేను ఉండేవాళ్లం. ఆ రోజుల్లో ముఖ్య మంత్రిగా జలగం వెంగళరావు పని చేస్తున్నారు. ఆ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ పాల్వంచ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి కిన్నెరసాని వరకు భారీ మోటార్‌ వెహికిల్‌ ర్యాలీని యూత్‌ కాంగ్రెస్‌ ఆ«ధ్వర్యంలో చేపట్టాను. ఆ రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీలో సంజయ్‌గాంధీ హవా కొనసాగుతుండేది. కిన్నెరసాని పర్యటనతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో నా గురించి చర్చ మొదలైంది. మంచి గుర్తింపు దక్కింది. 

హత్యాప్రయత్నమూ చేశారు.. 
పాల్వంచ పంచాయతీ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్న రోజుల్లో నా ఎదుగుదల స్థానికంగా కొంతమందికి కంటగింపుగా మారింది. తమ రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా మారుతున్నాననే దుగ్ధతో నా ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారు. 1980వ దశకంలో ఐదుగురు వ్యక్తులు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో నేను పొలానికి వెళ్లాను. నేను ఇంట్లో లేకపోవడంతో పద్మావతిపై దాడి చేశారు. ఆమె చేతికి గాయమైంది. పొలం నుంచి అనుచరులతో నేను రావడం గమనించి     ఇంటి నుంచి పారిపోయారు.   

ప్రజాసేవకే అంకితం
ఇప్పటి వరకు 1989, 1999, 2004, 2018 సంవత్సరాల్లో అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. వైఎస్సార్‌ హయాంలో వైద్యవిధాన పరిషత్‌ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే జిల్లాకు ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చాను. ప్రకాశం స్టేడియంలో మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్డు సభ్యుడి నుంచి మంత్రి వరకు అన్ని రకాల పదవులూ చేపట్టాను. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కుటుంబ సభ్యుడిలా వ్యవహరించాను. యాభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగినా ఆల్కహాల్, సిగరెట్‌ వంటి అలవాట్లను దరి చేరనీయలేదు. 80 ఏళ్ల వయసులో ఉన్నా ఇప్పటికీ ఎవరి సాయం లేకుండా రాయగలను, చదవగలను, నడవగలను. చుట్టూ ఉన్న పది మందికి సాయపడటమనే అలవాటు తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఊపిరి ఉన్నంతవరకూ ప్రజాసేవలోనే ఉంటా.  

రాజ్‌దూత్‌ బండిపై..
1970వ దశకంలో పాల్వంచ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నన్ను వార్డు మెంబర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే సమయంలో భద్రాచలంలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన పద్మావతితో నా వివాహం జరిగింది. ఆ మరుసటి ఎన్నికల్లో ఏకంగా పాల్వంచ పంచాయతీకి ప్రెసిడెంట్‌ అయ్యాను. అప్పట్లో నాకు రాజ్‌దూత్‌ ద్విచక్ర వాహనం ఉండేది. ఉదయాన్నే పాల్వంచ గ్రామపంచాయతీ ఈఓను వెంటబెట్టుకుని రాజ్‌దూత్‌పై పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు వెళ్లే వాడిని. ఎక్కడైనా ఏదైనా సమస్య కనిపిస్తే వెంటనే నోట్‌ చేసుకునే వాడిని. మధ్యాహ్నం అంతా పంచాయతీ ఆఫీసులో ఉంటూ అక్కడికి వచ్చే ప్రజల కష్టనష్టాలు వినేవాడిని. చీకటి పడే సమయంలో మళ్లీ బండి మీద ఫీల్డ్‌ విజిట్‌కు వెళ్లి వీధి దీపాలు వెలుగుతున్నాయా ? ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పరిశీలించేవాడిని. 

పీఎం వరాలు.. షాకైన సీఎం..
1989 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్‌ హయాంలో మంత్రిగా పని చేసిన కోనేరు నాగేశ్వరరావుతో తలపడాల్సి వచ్చింది. అయితే ప్రెసిడెంట్‌గా, ఇతర సంస్థల చైర్మన్‌గా నా పనితీరు, ప్రజల్లో కలిసిపోయే గుణం మెచ్చిన ప్రజలు విజయం కట్టబెట్టారు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా తెలుగువారైన పీవీ నర్సింహారావు వచ్చారు. ఖమ్మం కలెక్టర్‌గా పని చేసిన పీవీఆర్‌కే ప్రసాద్‌ అప్పుడు పీవీ దగ్గర ప్రధానమంత్రి కార్యాలయంలో  అధికారిగా ఉన్నారు. నన్ను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకుని, ప్రధానితో మాట్లాడి రికార్డు స్థాయిలో ఒక్క కొత్తగూడెం నియోజకవర్గానికే 18 వేల ఇళ్లు మంజూరు చేశారు. ఒక నియోజకవర్గానికి ఈ స్థాయిలో ఇళ్లు మంజూరు కావడం చూసి అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సైతం ఆశ్చర్యపోయారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement