బీజేపీకి కొత్త టెన్షన్‌.. బీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఐదుగురు నేతలు!

Political New Discussion On Suspension Of BJP MLA Raja Singh - Sakshi

తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో మాత్రం ఆయనతో ప్రచారం చేయించారు. ఇక్కడ మాత్రం సస్పెన్షన్ ఎత్తేయమని అడిగినా పట్టించుకోవడంలేదు. గోషామహల్లో కమలం పార్టీకి దిక్కులేకుండా పోయింది. ఇంతకీ రాజాసింగ్ సస్పెన్షన్ మీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ఏమంటున్నారు?..

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీలో ఫైర్ బ్రాండ్ లీడర్. నిరంతరం కాంట్రవర్సీ ప్రకటనలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆ కాంట్రవర్సీలే ఆయన్ను కటకటాల్లోకి  కూడా నెట్టాయి. వివాదాస్పద ప్రకటనల కారణంగానే పార్టీ హైకమాండ్ రాజాసింగ్‌ను సస్పెండ్ చేసింది. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రస్తుతం ఎమ్మెల్మే ఎలాగూ తన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. దీంతో, నియోజకవర్గంలో బీజేపీ కార్యక్రమాలేవీ జరగడంలేదు. ఈ అవకాశంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గోషామహల్‌ను స్వాధీనం చేసుకోవాలని గులాబీ పార్టీ పట్టుదలతో వ్యవహరిస్తోంది. పార్టీ నాయకత్వం ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ అసెంబ్లీ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. 

ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచీ నియోజకవర్గంలో పెద్దగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. గోషామహల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్‌కు పార్టీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడంలేదు. ఒక పక్కన ఎమ్మెల్యే పార్టీ నుంచి దూరంగా ఉండటం, మరోవైపు పోటీ చేస్తానంటున్న నేతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో గోషా మహల్లోని బీజేపీ కేడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఐదుగురు బీజేపీ కార్పోరేటర్లు.. అధికార పార్టీ నేతలతో టచ్‌లో ఉంటూ పనులు చేయించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. గోషామహల్‌లో లైన్ క్లియర్ చేస్తే పనిచేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విక్రమ్ గౌడ్ మొరపెట్టుకుంటున్నా కమలం పార్టీలో ఆలకించే నాథులే లేరు.

ఇక్కడేమో రాజాసింగ్ మీద పార్టీ సస్పెన్షన్ కొనసాగుతోంది. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో రాజాసింగ్ బీజేపీ తరఫున ప్రచారం చేయడంతో పార్టీలోనే హాట్ టాపిక్‌గా మారింది. రాజాసింగ్ విషయంలో బీజేపీ హైకమాండ్ ద్వంద్వ నీతితో వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర కమిటీ రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు ఎత్తేయాలని హైకమాండ్‌కు సిఫారసు చేసినా ఢిల్లీ నుంచి ఎలాంటి స్పందనా కనిపించడంలేదు. రాజాసింగ్ విషయంలో త్వరలోనే పార్టీ హైకమాండ్ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.

ఇదిలా ఉండగా.. గోషామహల్ బీజేపీ కార్యకర్తలు మాత్రం పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే సిగ్నల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గోషామహల్‌లో  బీజేపీ జెండాను రాజాసింగే మోస్తారా? విక్రమ్ గౌడ్ చేతికిస్తారా? అనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: బీజేపీ అధినాయకత్వం వరుస భేటీలు.. ఢిల్లీలో ఏం జరుగుతోంది?

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top