 
													సాక్షి, విజయవాడ: టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుపై తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధిలేని ఎమ్మెల్యేని టీటీడీ మెంబర్‌గా నియమించడమేంటి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని నిలదీశారు.
ఎమ్మెస్ రాజు ఓ బుద్ధిలేని వ్యక్తి. భగవద్గీత పై నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులను టిటిడి బోర్డు మెంబర్ గా పెట్టొచ్చా. టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించేముందు ఆ వ్యక్తికి హిందూ ధర్మం పై నమ్మకం, జ్ఞానం ఉందో లేదో చూడాలి. ఇలాంటి వాళ్లు టిడిపిలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలుగా ఉన్నారో చంద్రబాబు ఒకసారి సర్వేచేయాలి. ఎమ్మెస్ రాజును పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయాలి. భగవద్గీత , హిందూ ధర్మం పై మరొకరు వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ఎమ్మెస్ రాజు పై చర్యలు తీసుకోవాలి అని చంద్రబాబును రాజా సింగ్ డిమాండ్ చేశారు.
‘భగవద్గీత ప్రజల బతుకులను మార్చలేదు’ అంటూ ఓ కార్యక్రమంలో ఎంఎస్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దుమారం రేగింది. ఈలోపు ఆయన అనుచరులు ఆ వ్యాఖ్యను సమర్థించే ప్రయత్నం చేశారు. అయితే విశ్వహిందూ పరిషత్ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం.. క్షమాపణలకు డిమాండ్ చేయడంతో ఆయన దిగిరాక తప్పలేదు.
 
					
					
					
					
						
					          			
						
				
 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
