కాషాయ పార్టీలో కోల్డ్‌వార్!.. ఈటల, వివేక్‌ మధ్య విభేదాలకు కారణం?

Political Cold War Between BJP Etala Rajender And Gaddam Vivek - Sakshi

తెలంగాణలో జెండా పాతేస్తామని కమలం పెద్దలు చెబుతున్నారు. ఇక్కడేమో పార్టీ నాయకులు గ్రూప్లుగా విడిపోయి రచ్చకెక్కుతున్నారు. వ్యక్తిగత వైరాలతో పార్టీ పరువు బజారుకీడుస్తున్నారని టాక్. నేతల మధ్య విభేదాలు కొంప ముంచుతాయని కేడర్ ఆందోళన చెందుతోంది. ఇంతకీ తెలంగాణలో రచ్చకెక్కిన ఆ ఇద్దరు ఎవరు? అసలు వారి మధ్య గొడవకు కారణం ఏంటి..?

తెలంగాణలో అధికారమే లక్ష్యమని కమలం పార్టీ అధినాయకత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. రాష్ట్రానికి ఎవరు వచ్చినా వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలను ఒక కుదుపు కుదుపుతామని..అమిత్‌ షా ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని ముఖ్య నాయకులు గ్రూపులు కడుతూ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయని బీజేపీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. 

ఇద్దరూ కరీంనగర్‌ నేతలే..
పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ గడ్డం వివేక్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోందని బీజేపీ ఆఫీస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే. హుజురాబాద్ ఎన్నికల సమయంలో కలిసి మెలిసి తిరిగిన ఈటల, వివేక్ మధ్య.. ఆ తర్వాత ఎక్కడో వ్యవహారం బెడిసి కొట్టింది. వివేక్ కాల్ చేసినా ఈటల రాజేందర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని ప్రచారం నడుస్తోంది. దీంతో, పంచాయితీ కాస్తా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ లక్ష్మణ్ ముందుకు వెళ్ళినట్టు సమాచారం.

కారణాలపై పార్టీ పెద్దల ఆరా..
ఇక, సీనియర్ నాయకులతో మాట్లాడుకుంటూనే.. ఈటల రాజేందర్, వివేక్ పరస్పరం అరుచుకున్నట్లు సమాచారం. అయితే, అప్పుడే అనుకోకుండా అక్కడికి తెలంగాణ మంత్రి ఒకరు రావడంతో నేతల పంచాయితీ మధ్యలో ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఇంతగా రచ్చ కెక్కడానికి కారణాలేంటో​ పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎప్పటికప్పుడు కేంద్ర పెద్దలు రాష్ట్ర నాయలకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్లుగా కొందరు నేతలు ఫీలవుతున్నారని.. అందుకే పార్టీలో గ్రూప్‌లో తయారవుతున్నాయని కేడర్ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఢిల్లీ పెద్దల దగ్గర ప్రాధాన్యం పెరగడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో ఈటల, వివేక్ మధ్య విభేదాలు బయటికొచ్చాయి.

అయితే, ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యం నిర్దేశించుకున్న సమయంలో నాయకుల మధ్య ఇలాంటి గొడవలు ఏమాత్రం మంచిది కాదని హైకమాండ్ గట్టిగా క్లాస్ పీకినట్లు సమాచారం. హైకమాండ్ చొరవతో అయినా ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా? లేదో వేచి చూడాల్సిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top