కూటమి బలం 'నీటి బుడగే'! | Sakshi
Sakshi News home page

కూటమి బలం 'నీటి బుడగే'!

Published Thu, Apr 18 2024 5:15 AM

Political analysts say YSRCP Grand Victory In AP Assembly Election - Sakshi

బస్సు యాత్రలో అడుగడుగునా సీఎం జగన్‌కు జన నీరాజనం 

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉప్పొంగిన అభిమాన సంద్రం 

వారధిపై పాదయాత్ర నాటి ప్రభంజనాన్ని తలపించిన బస్సు యాత్ర 

మండుటెండైనా.. అర్ధరాత్రయినా రోడ్‌ షోలకు పోటెత్తుతున్న జన సంద్రం 

విజయవాడలో 4.30 గంటలపాటు జైత్రయాత్రలా సాగిన రోడ్‌ షో 

తామెన్నడూ ఈ ప్రజా స్పందనను చూడలేదంటోన్న ఉద్యోగ, వ్యాపార వర్గాలు 

తాము పుంజుకున్నామనే చోట బస్సు యాత్ర సక్సెస్‌తో టీడీపీలో నైరాశ్యం 

తమది బలుపు కాదు వాపే అంటున్న టీడీపీ సీనియర్‌ నేతలు 

తొలిసారి ఓటేయబోతున్న 18–21 ఏళ్ల విద్యార్థులంతా జగన్‌ వెంటే.. 

మళ్లీ రాబోయేది వైఎస్సార్‌సీపీ సునామీయేనంటున్న రాజకీయ విశ్లేషకులు 

జగన్‌ మామయ్యా.. జగన్‌ మామయ్యా.. అంటూ స్కూలు విద్యార్థుల ఆత్మీయ పలకరింపులు.. రాష్ట్ర రూపురేఖలను మరింత గొప్పగా మార్చేందుకు నీ వెంటే నడుస్తామంటూ యువతీ యువకుల నినాదాలు.. మంచి చేసిన మిమ్మల్ని గెలిపించడానికి మేమంతా సిద్ధమంటూ మహిళల హామీ.. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు పెత్తందార్లపై యుద్ధానికి సిద్ధమంటూ రైతులు, కార్మికులు భరోసా.. మనవడా మళ్లీ నువ్వే కావాలి.. నువ్వే రావాలి.. అంటూ వృద్ధుల ఆశీస్సులు.. 

సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ప్రతి రోజూ కన్పిస్తున్న దృశ్యాలివి. రాజకీయాల్లో అరుదుగా కన్పించే ఘట్టాలకు బస్సు యాత్ర వేదికగా మారింది. మండుటెండైనా.. అర్ధరాత్రయినా సీఎం జగన్‌ను చూసేందుకు జనం ఆరాట పడుతున్నారు. బస్సు యాత్ర సాగుతున్న రోడ్డుకు ఇరువైపులా స్కూలు పిల్లల నుంచి వృద్ధు్దల వరకూ కిలోమీటర్ల కొద్దీ బారులుతీరి.. సీఎం జగన్‌పై పూల వర్షం కురిపిస్తున్నారు. మంచి చేసిన మిమ్మల్ని గెలిపించి మళ్లీ సీఎంగా చేసుకుంటామని హామీ ఇస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్‌షోలకు జనం పోటెత్తుతున్నారు. రోడ్‌ షో సాగినంత దూరం సెల్‌ఫోన్‌లను చేతులతో పైకెత్తి లైట్‌లను ఆన్‌ చేసి సంఘీభావం తెలుపుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలు జనసంద్రాలను తలపిస్తున్నాయి. 
 
తానెన్నడూ ఈ స్థాయి ప్రజా స్పందనను చూడలేదని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వెంకటేశ్వర యాదవ్‌ అనే ఉపాధ్యాయుడు చెప్పారు. ‘ఓ వైపు ఎండలు మండిపోతుంటే ఇంతగా జనం వచ్చారంటే ఏమని చెప్పాలి? మళ్లీ జగనే అని ప్రత్యేకించి చెప్పాలా?’ అని ఒంగోలుకు చెందిన కుమార్‌ అనే వ్యాపారి అన్నారు. విజయవాడలో  అభిమానం ఇంతలా కట్టలు తెంచుకోవడం ఏమిటో అర్థం కాలేదని రాజేశ్వర్‌ అనే న్యాయవాది అన్నారు. బస్సు యాత్ర సాగుతున్న ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార వర్గాల వారందరిదీ ఇదే మాట.     

మేలు చేశారు కాబట్టే జనం జేజేలు 
బస్సు యాత్రకు మేమంతా సిద్ధమంటూ స్కూలు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ పోటీపడి వస్తున్నారు. దారి పొడవునా సీఎం జగన్‌ను చూసేందుకు జనం ఆరాటపడుతున్నారు. రోడ్‌ షోలు.. బహిరంగ సభలకు లక్షల సంఖ్యలో వస్తున్న జనం.. జగన్‌ను మళ్లీ సీఎంగా చేసేందుకు మేమంతా సిద్ధమంటూ నినదిస్తున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా సీఎం జగన్‌ అన్ని వర్గాలకు మంచి చేయడం వల్లే ఇంత భారీ స్పందన వస్తోంది. జనం జేజేలు పలుకుతున్నారు. 
– గుంటూరు ఏటుకూరు క్రాస్‌ వద్ద సభకు వచ్చిన వ్యాపారి చందోలు మల్లికార్జున  

సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో, తూర్పు ప్రాంతంలో ఇటీవల తాము బలం పుంజుకున్నామని కూటమి.. ప్రధానంగా టీడీపీ చెబుతోంది. కానీ.. బస్సు యాత్రతో ఆ ప్రాంతాలలో తమది బలం కాదు వాపేనన్నది స్పష్టమైందని గుంటూరు జిల్లా టీడీపీకి చెందిన చెందిన ఓ సీనియర్‌ మాజీ ఎమ్మెల్యే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి చెందిన ఓ మాజీ ఎంపీదీ అదే మాట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో బస్సు యాత్రకు తండోపతండాలుగా జనం కదలి రావడం.. ఏటుకూరు క్రాస్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు లక్షల మంది జనం తరలివచ్చారు.

గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్‌ జిల్లాలోకి అడుగుపెట్టే విజయవాడ–తాడేపల్లి మధ్య కృష్ణా నదిపై నిర్మించిన వారధిపై బస్సు యాత్రకు సునామీలా పోటెత్తిన జనసందోహం.. పాదయాత్ర నాటి దృశ్యాన్ని సాక్షాత్కరింపజేసింది. విజయవాడ నగరంలో అశేష జనవాహిని మధ్య 4.30 గంటలపాటు జైత్రయాత్రలా రోడ్‌ షో సాగింది. ఇది చూసి ఓర్వలేకే సీఎం జగన్‌పై దాడికి టీడీపీ నేతలు ఉసిగొలిపారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కూటమి బలం అంతా ప్రచారంలో మాత్రమే ఉందని, వాస్తవంగా ఆ బలం అంతా నీటి బుడగేనని పలువురు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఒప్పుకుంటున్నారు. 
 
రాబోయేది ఫ్యాన్‌ సునామీయే..  
బస్సు యాత్రకు 18–21 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు అధిక శాతం మంది కదిలివస్తున్నారు. అభిప్రాయ నిర్ణేతలైన (ఒపీనియన్‌ డిసైడర్స్‌) యువతీ యువకులు బస్సు యాత్రలో భారీ ఎత్తున కదలి వస్తుండటాన్ని బట్టి చూస్తే రాబోయేది వైఎస్సార్‌సీపీ సునామీయేనన్నది స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. సీఎం జగన్‌ను చూసేందుకు స్కూలు పిల్లలు తల్లితండ్రులతో కలిసి తరలివస్తున్నారు.

జగన్‌ మామయ్య.. జగన్‌ మామయ్య అంటూ అప్యాయంగా పలకరిస్తున్నారు. చంటి బిడ్డలను చంకనేసుకున్న మహిళలు సీఎం జగన్‌ను దగ్గర నుంచి చూసేందుకు యువతీ యువకులతో పోటీ పడుతూ బస్సు వెంట పరుగులు తీసే దృశ్యాలు అడగడుగునా కన్పిస్తున్నాయి. మండుటెండను లెక్క చేయకుండా అవ్వాతాతలు సీఎం జగన్‌ను చూసేందుకు ఆరాటపడుతున్నారు. వీటిని పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు.. వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కళ్లకు కట్టినట్లు కన్పిస్తోందని తేల్చిచెబుతున్నారు.  
 
యూత్‌ అంతా జగనన్న వెంటే 
బీటెక్‌ చదువుతున్నా. ఫస్ట్‌ టైమ్‌ ఓటేయబోతున్నా. అదీ మంచి పనులు చేస్తున్న సీఎం జగన్‌కు ఓటేయబోతున్నందుకు గర్విస్తున్నా. విద్యా దీవెన ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన ద్వారా వసతి–భోజన ఖర్చులకు డబ్బులు సీఎం జగన్‌ ఇస్తున్నారు. దాంతో నన్ను చదవించడానికి మా తల్లితండ్రులకు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి తప్పించారు. నైపుణ్యాలను పెంచుకునేలా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. బీటెక్‌ పూర్తికాగానే క్యాంపస్‌ ఇంటర్వ్యూలో కచ్చితంగా ఉద్యోగం సాధిస్తా. నాలాంటి పేద విద్యార్థులు అందరూ ఉన్నత చదువులు చదవాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి. జగన్‌ ఘన విజయం మా విద్యార్థుల ఓట్లతోనే ప్రారంభమవుతుంది. 
– హనుమాన్‌ జంక్షన్‌ వద్ద బస్సు యాత్రలో పాల్గొన్న విద్యార్థి కమలాకర్‌     

Advertisement
 
Advertisement