మోదీ కొత్త రాగం.. బీజేపీలో బిగ్‌ ట్విస్ట్‌! | PM Narendra Modi Sensational Comments In An Interview, More Details Inside | Sakshi
Sakshi News home page

మోదీ కొత్త రాగం.. బీజేపీలో బిగ్‌ ట్విస్ట్‌!

Published Sat, May 25 2024 9:20 AM

PM Narendra Modi Sensational Comments

ఢిల్లీ: భారత్‌ భవిష్యత్‌ కోసం ఎప్పుడో 18వ శతాబ్దంలో రూపొందించిన చట్టాలు, పద్దతులను తాను ఉపయోగించలేనన్నారు ప్రధాని మోదీ. కొత్త సంస్కరణలు, చట్టాలు తీసుకురావాలనే ఆలోచనలో తాను ఉన్నట్టు మనసులోకి మాటను కుండబద్దలు కొట్టారు. అలాగే, ఒక ముఖ్యమైన పని కోసం దేవుడు ఆయనను భూమి మీదకు పంపినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

కాగా, ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘వికసిత్‌ భారత్‌’ కల నెరవేర్చడం కోసం 2047 వరకు నిరంతరాయంగా పనిచేయాలనే బాధ్యతను దేవుడు నా మీద పెట్టాడు. ఆ పనిని పూర్తిచేయడానికే నన్ను భూమి మీదకు పంపించాడని నాకు అనిపిస్తున్నది. దీని కోసం దేవుడు నాకు దారిచూపించి, శక్తిని ఇచ్చాడు. ఇక, 2047 కల్లా వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానన్న నమ్మకం నాకుంది. అది నెరవేర్చే వరకు దేవుడు నన్ను పైకి పిలువడు’ అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

అయితే, బీజేపీ పార్టీ విషయానికి వస్తే కాషాయ పార్టీలో 75ఏళ్లకే రిటైర్మెంట్‌ అనే నిబంధన ఉంది. ఈ నిబంధన పార్టీలో ఉన్న ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది. ఇక, ప్రస్తుతం మోదీ వయసు 74ఏళ్లు. మరో ఏడాదిలో మోదీ రిటైర్మెంట్‌ తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మోదీ.. వికసిత్‌ భారత్‌ నినాదం ఎత్తుకోవడంపై రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు.

మోదీ మరికొన్నేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇలా కామెంట్స్‌ చేశారని చెబుతున్నారు. 75 ఏళ్లకే రిటైర్మెంట్‌ నిబంధన అనేది తనకు వర్తించబోదని మోదీ చెప్పారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన మనసులో దాచిపెట్టుకొన్న పదవీ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు బయటపెట్టారని అంటున్నారు. ఇక, బీజేపీలో 75 ఏళ్లు దాటిన కారణంగానే సీనియర్లను పక్క పెట్టిన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
 
Advertisement