
ఎన్నికలు దగ్గర పడుతున్నా ఇంకా అస్పష్టతే
తన సీటుకూ టీడీపీపైనే ఆధారం
భీమవరం, గాజువాక అభ్యర్థుల ప్రకటనా పెండింగ్‌లోనే..
ఉమ్మడి విశాఖ నుంచి పవన్‌ను పోటీచేయించే యోచన
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసేది ఇంకా తేలలేదు. మరో 40–45 రోజుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా, ఈ విషయంలో జనసేన పార్టీ గానీ పవన్‌కళ్యాణ్ గానీ ఇంకా పూర్తి స్పష్టతకు రాలేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోటా పవన్‌కళ్యాణ్ పోటీకి సంబంధించి చర్చ జరుగుతున్న దాఖలాలు లేవంటున్నారు. పరిస్థితులు చూస్తుంటే... తాను పోటీ చేసే స్థానంపై కూడా చంద్రబాబుపై ఆధారపడినట్టు ఉన్నారని సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అంతర్గతంగా సర్వేలు చేయించుకుని, కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాతో గాజువాక, భీమవరం స్థానాలను పవన్‌కళ్యాణ్ ఆఖరి నిముషంలో ఎంపిక చేసుకున్నారు. వామపక్షాలు, బీఎస్పీ మద్దతు ఇచ్చాయి. అయితే రెండు చోట్లా పవన్‌కళ్యాణ్ ఓడిపోయారు. గాజువాకలో మొత్తం 1,99,314 ఓట్లు పోలవగా, పవన్‌కళ్యాణ్ కేవలం 58,539 ఓట్లు (29.37 శాతం) మాత్రమే తెచ్చుకోగలిగారు.
భీమవరంలో 1,92,558 ఓటు పోలవగా, 62,285 ఓట్లు (28 శాతం) మాత్రమే పడ్డాయి. గాజువాకలో 17 వేలు, భీమవరంలో 8 వేల ఓట్లకు పైగా తేడాతో ఆయన ఓడిపోయారు. ఈ నేపధ్యంలో తాను ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోయినా కచ్చితంగా గెలిచే సీటు అయి ఉండాలని భావిస్తున్నారు. గాజువాక, భీమవరం, పిఠాపురం స్థానాలు పరిశీస్తున్నట్టు సమాచారం.
చంద్రబాబు లెక్కలు వేరు
అయితే పవన్ సీటు విషయంలో చంద్రబాబు లెక్కలు వేరుగా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ పోటీచేసే నియోజకవర్గం పరిధిలోని లోక్‌సభ స్థానంలో టీడీపీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందన్న ఆలోచనలతో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌కు కేటాయించే స్థానం, ఆ చుట్టుపక్కల టీడీపీ బలహీనంగా ఉండే స్థానాలను చంద్రబాబు బేరీజు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పవన్‌కళ్యాణ్‌ను పోటీ చేయించాలని చూస్తున్నారని, అలా జరిగే పక్షంలో గాజువాక నుంచే మరోసారి పోటీ పడే అవకాశం ఉందంటున్నారు.
15 రోజుల క్రితం భీమవరం పర్యటనలో పవన్ టీడీపీ, బీజేపీ నాయకుల ఇళ్లకు స్వయంగా వెళ్లారు. దీంతో ఈసారీ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని జనసేనలో అంతర్గత చర్చ సాగింది. అయితే, సీట్ల సర్దుబాటులో భాగంగా భీమవరం నుంచి పోటీ చేయని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు చంద్రబాబును హైదరాబాద్ వెళ్లి మరీ కోరడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పోటీపై అనుమానాలు మొదలయ్యాయి.
ఆ తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కొంత ప్రచారం కొనసాగినా స్పష్టత లేదు. మరోవైపు జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిలో మాత్రమే అభ్యర్ధులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పార్టీ అధినేతే ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని సందిగ్థంలో ఉన్నప్పుడు తమ గురించి ఆలోచించే వారెవ్వరని జనసేన ఆశావహులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.