మహారాష్ట్ర సీఎం కుర్చీలో షిండే కుమారుడు.. ఫోటోలు వైరల్‌

A Photo Of Eknath Shinde Son Sitting On CM Chair Went Viral - Sakshi

ముంబై: ఏక్‌నాథ్‌ శిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాక్రే వర్గంతో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కొన్ని ఫోటోలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో.. ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, లోక్‌సభ ఎంపీ శ్రీకాంత్‌ షిండే కూర్చోవటం వివాదానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. 

సూపర్‌ సీఎం: ఎన్‌సీపీ
శివసేన వ్యవస్థాపకులు బాలా సాహేబ్‌ థాక్రే ఫోటో ముందు ఉన్న కుర్చీలో శ్రీకాంత్‌ షిండే కూర్చున్న చిత్రాలను ట్వీట్‌ చేశారు ఎన్‌సీపీ అధికార ప్రతినిధి రవికాంత్‌ వార్పే. ఆ కుర్చి వెనకాలే ఉన్న బోర్డుపై ‘మహారాష్ట్ర ప్రభుత్వం- ముఖ్యమంత్రి’ అని రాసి ఉంది. ఈ క్రమంలో సూపర్‌ సీఎం అంటూ పేర్కొన్నారు రవికాంత్‌. ఇది ఎలాంటి రాజధర్మమని ప్రశ్నించారు. మరోవైపు.. సీఎం కుర్చీపై జోకులు వేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తన సానుభూతి తెలుపుతున్నట్లు వ‍్యంగ్యాస్త్రాలు సంధించారు శివసేన నాయకురాలు ప్రియాంక ఛతుర్వేది. ఆధిత్య థాక్రే ఒక మంత్రిగా ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే వారికి సమస్య అనిపించిందని, కానీ, శ్రీకాంత్‌ షిండే కనీసం ఎమ్మెల్యే కాకపోయినా ఎలాంటి సమస్య లేదని ఎద్దేవా చేశారు.

తిప్పికొట్టిన షిండే.. 
ఈ క్రమంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు శ్రీకాంత్‌ షిండే. ఆ ఫోటో తన నివాసంలో తీసుకున్నదని, తన తండ్రి కోసం అధికారికంగా కేటాయించిన కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేశారు. అలాగే.. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం సైతం కాదని, థానేలోని ప్రైవటు నివాసం, ఆఫీసుగా వెల్లడించారు. వెనకాల ఉన్న బోర్డును తరుచూ తరలిస్తుంటారని, తన నివాసం నుంచే వర్చువల్‌గా సమావేశాలు నిర‍్వహిస్తున్నందున అక్కడ ఉందని వివరణ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఆఫీసును సీఎం, తానూ ఉపయోగిస్తానని వెల్లడించారు.

ఇదీ చదవండి: సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top