Pegasus: ఆగస్టు 16 కి విచారణ వాయిదా

Pegasus snooping scandal: Supreme Court adjourns hearing to August16 - Sakshi

సాక్షి,ఢిల్లీ: పార్లమెంటులో ప్రకంపనలు రేపుతున్న పెగాసస్‌ స్నూపింగ్ కుంభకోణంపై సుప్రీంకోర్టులో మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను ఆగస్టు 16వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, జస్టిస్ వినీత్ శరణ్ , జస్టిస్ సూర్య కాంత్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది.

ఈ సందర్భంగా సుప్రీం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవైపు కోర్టులో కేసు వాద‌న‌లు జ‌రుగుతుండగానే, పిటీష‌న‌ర్లు సోష‌ల్ మీడియాలో స‌మాంత‌ర చ‌ర్చ‌లు ఎందుకు చేపడుతున్నారని ప్ర‌శ్నించింది. ఏదైనా చెప్పాల‌నుకుంటే, కోర్టులోనే చెప్పాలని సీజే పేర్కొన్నారు. ఒకసారి కోర్టులను ఆశ్రయించిన తరువాత కోర్టులపై విశ్వాసముంచాలని ఆయన సూచించారు. దీనిపై స్పందించిన  సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కేసు విచారణలో ఉన్న విషయాన్ని బయట చర్చించకూడని తామూ అంగీకరిస్తున్నామన్నారు. 

పిటిషన్లు అందాయని కోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్(ఎస్‌జీ) తుషార్ మెహతా ప్రభుత్వం నుంచి తమకు సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ సూచనలు, సలహాల నిమిత్తం శుక్రవారం వరకు సమయం కావాలని కోరారు. దీనిని వ్యతిరేకించిన పిటిషనర్ల తరపు న్యాయవాది  కబిల్‌ సిబల్‌ తక్షణమే కేంద్రానికి నోటీసులు జారీ చేయాలని కోరారు.  కానీ సోమవారం వరకు సీజేకు గడువు ఇచ్చిన సుప్రీం, తదుపరి విచారణను వాయిదా వేసింది.

కాగా ఇప్పటికే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆరోపణలు నిజమైతే ఇవిచాలా తీవ్రమైనవని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.  రాజకీయ, న్యాయ, రక్షణ రంగ ప్రముఖులు, జర్నలిస్టులు సహా 300మందికి పైగా ప్రముఖుల ఫోన్ నంబర్ల హ్యాంకింగ్‌ వ్యవహారం దుమారాన్ని రాజేసింది. అయితే భారత్‌లో నిఘా లేదంటూ  కేంద్రం  ఇప్పటికే పార్లమెంట్‌లో ప్రకటించింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top