రామోజీ.. తప్పుడు రాతలు కట్టిపెట్టు

చంద్రబాబు డెయిరీకన్నా రైతులకు ఎక్కువే చెల్లిస్తున్నాం
మాది న్యాయబద్ధమైన వ్యాపారం.. హెరిటేజ్‌లా దోచుకోలేదు
‘ఈనాడు’ రాతలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం
చిత్తూరు అర్బన్:‘ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి రావడానికి రామోజీరావుది కీలకపాత్ర. బాబుపై ఉన్న ప్రేమతో ఈనాడును అడ్డుపెట్టుకుని మాపై విషం చిమ్మడమే లక్ష్యంగా ప్రజలకు అవాస్తవాలను చేరవేస్తున్నారు. రాజకీయ విమర్శలు ఉండొచ్చు కానీ వ్యక్తిగత విషయాల్లో అబద్ధపు రాతలు ఉండకూడదు. రామోజీ.. నీకు ఒక్కటే చెబుతున్నా. 10 లీటర్ల పాలు తీసుకుని పుంగనూరులోని సదుం, సోమలలో పర్యటించు. 5 లీటర్లు శివశక్తి డెయిరీకి, మరో 5 లీటర్లు హెరిటేజ్‌కు ఇవ్వు. ఎవరు ఎంత ధర చెల్లిస్తారో ప్రత్యక్షంగా చూడు’ అంటూ రాష్ట్ర గనులు, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడులో అబద్ధపు రాతలు రాస్తూ, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు రామోజీరావు చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1994 నుంచి శివశక్తి డెయిరీ నడుస్తోందని, ఆనాటి నుంచి రైతులు తమను నమ్మి తమ డెయిరీకి పాలు విక్రయిస్తున్నారని మంత్రి చెప్పారు. తన నియోజకవర్గంలోని సదుం, సోమల మండలాల్లో పాడి రైతులకు మిగిలిన ప్రాంతాల కంటేæ రైతులకు తక్కువ ధరలు చెల్లిస్తున్నట్టు ఈనాడులో రాయడం దుర్మార్గమన్నారు. రామోజీరావు తప్పుడు రాతల్ని కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
‘హెరిటేజ్ కంటే తక్కువ ధర చెల్లిస్తే నిరూపించు’
సదుం, సోమల మండలాల్లో చంద్రబాబు సంస్థ హెరిటేజ్ రైతులకు చెల్లించేది తమ సంస్థకంటే తక్కువ ధర అనే విషయం రామోజీరావు గ్రహించాలని మంత్రి పెద్దిరెడ్డి హితవు పలికారు. శివశక్తి డెయిరీ మొత్తం 347 సెంటర్లలో పాలను సేకరిస్తోందని, ఏ ఒక్క ప్రాంతంలో అయినా రూ.29 కంటే తక్కువ ధర చెల్లిస్తే నిరూపించాలని సవాల్ చేశారు. పాలలో వెన్న శాతం ఆధారంగా లీటర్‌కు రూ.29 నుంచి రూ.33 పాడి రైతులకు చెల్లిస్తున్నామని చెప్పారు. దీంతోపాటు అదనంగా ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నామన్నారు.
హెరిటేజ్ మాత్రం లీటరుకు రూ.24 నుంచి రూ.29 మాత్రమే చెల్లిస్తోందని స్పష్టం చేశారు. నిస్సిగ్గుగా, ప్రజలు నవ్వుకుంటారేమో అనే స్పృహ లేకుండా అబద్ధపు రాతలు రాయడం ఈనాడుకు నిత్యకృత్యమైపోయిందన్నారు. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకు వెళతామని, తమ సంస్థ పేరు మసకబారేలా వార్తల్ని ప్రచురించినందుకు పరువు నష్టం దావా కూడా వేయాలని నిర్ణయించామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు.