
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. మళ్లీ అదే.. అదే నిర్లక్ష్యం వహిస్తోంది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెనాలి పర్యటనలో ఉద్దేశపూర్వకంగా వ్యవహరించింది. భారీగా జనసందోహం వస్తారని తెలిసి కూడా భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడం.. అరకోర సిబ్బందిని కేటాయించినా వాళ్లు పట్టిపట్టనట్లుగా వ్యవహారించడం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది.
పోలీసుల చేతిలో హింసకు గురైన బాధిత యువకుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ జగన్ తెనాలి వెళ్లారు. మార్గమధ్యంలో.. చింతలపూడి చెక్ పోస్టు నుంచి జగన్ కాన్వాయ్‌కు ఆటంకాలు కలిగాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను పోలీసులు కావాలనే నిలవరించలేదని స్పష్టమైంది. ఇక.. తెనాలిలోకి ఎంటరయ్యాక కూడా రోప్ పార్టీ కనిపించలేదు.
దీంతో కార్యకర్తలే జగన్ వాహనానికి రక్షణగా నిలిచి ముందుకు తీసుకెళ్లారు. చివరకు ఐతా నగర్‌లోని జాన్ విక్టర్ ఇంటి వద్దకు చేరుకునేందుకు చాలా సమయం పట్టింది. మరోవైపు.. జగన్ వచ్చేదాకా కూడా ఆ ఇంటి వద్ద ఒక్క పోలీసు సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు.. జగన్ తెనాలి పర్యటనలో భద్రతాలోపాలపై వైఎస్సార్‌సీపీ నేతలు కూటమి ప్రభుత్వం, పోలీసులపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
