సీఎం మార్పు.. చెక్‌ పెట్టిన రాజాహులి

No More Changes In Karnataka CM Post Yediyurappa Fix - Sakshi

అసమ్మతులు, ప్రత్యుర్థుల నుంచి విమర్శల తాకిడి

మంత్రివర్గ విస్తరణలో జాప్యం, నాయకత్వ మార్పుపై వదంతులు

వీటన్నింటి మధ్య తానేంటో నిరూపించుకున్న కర్ణాటక సీఎం

హైకమాండ్‌ ఆశీస్సులు తనకే ఉన్నాయని తెలిపిన ముఖ్యమంత్రి

సాక్షి, బెంగళూరు : అపార రాజకీయ అనుభవం, చాకచక్యంతో మళ్లీ రాజాహులి (రాజా పులి) బీఎస్‌ యెడియూరప్ప పైచేయి సాధించారు. బీజేపీ అధిష్టానం వద్ద తన మాటకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. పదేపదే నాయకత్వ మార్పు వదంతులు, కేబినెట్‌ విస్తరణ వాయిదా పడుతూ ఉండడంతో యెడ్డీ పని అయిపోయిందని, రాష్ట్ర బీజేపీకి కొత్త నాయకత్వం రాబోతుందని అంతా ఊహించారు. కానీ అక్కడుండేదీ రాజాహులి యెడియూరప్ప.. అంతటితో ఆగిపోతారా!! తన రాజకీయ అనుభవాన్ని రంగరించి తన ప్రత్యర్థులు, శత్రువులకు నోట్లో మాట లేకుండా చేశారు. ఆదివారం ఒక్క ఢిల్లీ పర్యటనతో అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఒకేదెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా తన పర్యటన ద్వారా నాయకత్వ మార్పుతో పాటు కేబినెట్‌ విస్తరణ సమస్యకు చెక్‌ పెట్టారు.

సంక్రాంతికి మంత్రివర్గ విస్తరణ
కొన్ని నెలలుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు ఢిల్లీ నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప తీపి కబురు మోసుకొచ్చారు. దీర్ఘకాలంగా కొలిక్కి రాకుండా సీఎంతోపాటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మంత్రివర్గ విస్తరణ సమస్య పరిష్కారం అయింది. ఈ నెల 13 లేదా 14న మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. యెడియూరప్ప తన ఢిల్లీ పర్యట నతో అధిష్టానం తన వైపే ఉం దని మరోసారి నిరూపించారు. రాష్ట్రంలో పెండిం గ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణకు బీజేపీ అధి ష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సంక్రాంతి ముందు రోజు లేదా పండుగ రోజు ఉదయాన్నే ఏడుగురిని మంత్రివర్గంలో చేర్చుకోబోతున్నారు.

పదేపదే నాయకత్వ మార్పుపై పుకార్లు
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎంకి వ్యతిరేకంగా కొందరు అసమ్మతి రాగం వినిపించారు. మంత్రివర్గంలో స్థానం దక్కని వారంతా యెడియూరప్పకు వ్యతిరేకంగా నాయకత్వ మార్పు ఉండబోతోంది అంటూ వదంతులు ప్రచారం చేశారు. దీనికితోడు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా అధిష్టానం పెద్దల నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ రాకపోవడంతో యెడియూరప్ప తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అలాగే మరోవైపు ప్రతిపక్షాల ఎదురుదాడికి సరిగ్గా బదులివ్వలేక చెతికిల పడ్డారు.

రోజుల తరబడి నిరీక్షణ
2019 జూలై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత యెడియూరప్ప తన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నెల రోజుల సమయం పట్టింది. అప్పటి వరకు వన్‌ మ్యాన్‌ ఆర్మీగా పాలన సాగించారు. ఆగస్టు 20న 17 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే తనను నమ్మి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో అన్నీ తానై దగ్గరుండి గెలిపించుకున్నారు. డిసెంబర్‌లో ఉప ఎన్నికలు జరిగినా ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవులు ఇచ్చేందుకు రెండు నెలలు పట్టింది. రెండు, మూడు దఫాలు అధిష్టానం పెద్దలను కలిసి చర్చించి వారిని ఒప్పించేందుకు ఎంతో శ్రమించారు. చివరికి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు బీజేపీని నమ్ముకున్న సొంత ఎమ్మెల్యేలకు అన్యాయం చేయొద్దని సూచిస్తూ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఫిబ్రవరి 6న 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇలా అడుగడుగునా నిరీక్షణలు, అనుమతుల కోసం వేచి చూడడం వంటి కారణాలతో అధిష్టానం వద్ద యెడియూరప్ప పని అయిపోయిందని ఊహాగానాలు వినిపించాయి.

పట్టునిలుపుకున్న యెడ్డి
2020, ఫిబ్రవరి తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ చేసేందుకు ఏకంగా ఏడాది సమయం పట్టింది. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు, ఆర్‌.శంకర్, విశ్వనాథ్‌లకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు అనేక సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి రిక్తహస్తాలతో వచ్చేవారు. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అయితే హఠాత్తుగా యెడియూరప్ప ఈ సారి చక్రం తిప్పి స్వయంగా హైకమాండే తనను ఢిల్లీకి పిలిచేలా చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లినా ప్రతిసారి ఒక్కో నాయకుడిని వేర్వేరుగా కలుసుకున్న సీఎం ఈ దఫా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అరుణ్‌సింగ్‌తో ఒకేసారి కలిసి చర్చించి పట్టునిలుపుకున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top