Sakshi News home page

ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ యత్నం

Published Fri, Sep 8 2023 5:17 AM

Narendra Modi and co using Sanatana ploy to divert attention says Minister Udhayanidhi Stalin - Sakshi

చెన్నై: సనాతన ధర్మకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న తీవ్ర ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ఎదురుదాడి ప్రారంభించారు. ప్రధాని మోదీ సహా కాషాయ పార్టీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వ్యాఖ్యలపై దాఖలైన కేసులన్నిటినీ చట్టపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మణిపూర్‌లో నెలలుగా కొనసాగుతున్న హింసపై విమర్శలను ఎదుర్కోలేని ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తన వ్యాఖ్యలపై రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు.

బుధవారం జరిగిన కేబినెట్‌ భేటీలో ప్రధాని మోదీ, మంత్రులు సనాతన ధర్మపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై చర్చించిన విషయం తెలిసిందే. ‘ప్రజలకిచ్చిన వాగ్దానాలను తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ఫాసిస్ట్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు ‘జనహననం’అంటూ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. తమను తాము రక్షించుకునేందుకు దీనిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు’అని గురువారం ఉదయనిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. ‘మణిపూర్‌లో ఆగని హింసపై సమాధానం ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే మోదీజీ స్నేహితుడు అదానీని వెంటేసుకుని ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నారు. మణిపూర్‌ హింసలో 250 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు..మోదీ ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది.

వీటన్నిటినీ మరుగుపరిచేందుకే మోదీ, ఆయన బ్యాచ్‌ సనాతన వ్యాఖ్యలను వాడుకోవాలనుకుంటున్నారు. ప్రజల అమాయకత్వమే వారి రాజకీయాలకు పెట్టుబడి. ’అని విమర్శించారు. ‘ఈ రోజుల్లో సాధువులు కూడా ప్రచారం కోరుకుంటున్నారంటూ తన తలపై రూ.10 కోట్లు ప్రకటించిన సాధువుపై ఉదయనిధి వ్యాఖ్యానించారు. అంతా త్యాగం చేసిన ఆ సాధువుకు రూ.10 కోట్లు ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  

అమానవీయ విశ్వాసాలపైనే..: స్టాలిన్‌
సనాతన ధర్మంపై తన కొడుకు, మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారంపై సీఎం స్టాలిన్‌ స్పందించారు. సనాతన ధర్మంలో భాగమైన అమానవీయ సిద్ధాంతాలపైనే ఉదయనిధి మాట్లాడారని చెప్పారు. వీటి ఆధారంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.

Advertisement

What’s your opinion

Advertisement