విద్యార్థి మృతిపై లోకేశ్‌ తప్పుడు ప్రచారం

Nara Lokesh false propaganda on student death - Sakshi

సంబంధం లేని ట్వీట్‌తో అభాసుపాలు 

తలంటిన చంద్రబాబు

సాక్షి, అమరావతి/ఒంగోలు: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి ప్రైవేట్‌ విద్యాసంస్థలో చదువుతున్న విష్ణు అనే బాలుడు మృతి చెందిన ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తనయుడు లోకేశ్‌ ట్విట్టర్‌ వేదికగా తప్పుడు ప్రచారం చేసి అభాసుపాలయ్యారు. ‘నాడు బడి.. నేడు పాడుబడి’ అంటూ.. నాడు–నేడు కింద పనులు చేసిన ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి బాలుడు మృతి చెందినట్టు లోకేశ్‌ శనివారం ట్వీట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకుల అవినీతి వల్లే పాఠశాల కూలిపోయిందని, అందుకే అక్కడ చదువుకుంటున్న బాలుడు చనిపోయాడని కనీస సమాచారం తెలుసుకోకుండా సోషల్‌ మీడియా టీం ఇచ్చిన ట్వీట్‌ను వదిలేశారు. తాను చేసిన ట్వీట్‌ తప్పని అదే సోషల్‌ మీడియా సెటైర్లతో విరుచుకుపడటంతో లోకేశ్‌ నాలుక కరుచుకున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. నిజానికి ప్రకాశం జిల్లా రాజుపాలెం గ్రామంలో కూలిన పాఠశాల చాలా ఏళ్లుగా వినియోగంలో లేదు. శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని వినియోగించడం మానేశారు.

అది నాడు–నేడు పథకంలో లేదు. గత నెల 29వ తేదీన ఆదివారం కావడంతో బాలుడు విష్ణు ఆడుకోవడానికి అక్కడికి వెళ్లినప్పుడు ఆ భవనం స్లాబు కూలి అతనిపై పడింది. దురదృష్టవశాత్తు బాలుడు మృతి చెందాడు. వాస్తవానికి ఆ బాలుడు ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నాడు. లోకేశ్‌ ఇవన్నీ తెలుసుకోకుండా నాడు–నేడు కింద బాగు చేసిన పాఠశాల కూలి బాలుడు మృతి చెందినట్టు అర్థం పర్థం లేకుండా ట్వీట్‌ చేసి దొరికిపోయారు. కనీసం నాడు–నేడు పథకం గురించి కూడా సరిగా తెలియకుండా కామెంట్లు, ట్వీట్లు చేయడం ఏమిటని టీడీపీ సీనియర్‌ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు అభాసుపాలవడంతో చంద్రబాబు కూడా ఏం చేయాలో తెలియక లోకేశ్‌ను మందలించినట్టు టీడీపీ నాయకుల తెలిపారు. విషయం తెలుసుకుని, కొంచెం అవగాహన చేసుకుని ట్వీట్లు చేయాలని కుమారుడికి తలంటినట్టు చెబుతున్నారు.

నాడు–నేడుపై అసత్య వ్యాఖ్యలు
రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల పైకప్పు కూలి విద్యార్థి విష్ణు మృతి చెందిన నేపథ్యంలో లోకేశ్‌ చేసిన ట్వీట్‌పై ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందించారు. రాజుపాలెంలో కూలిన పాఠశాల భవనం నాడు–నేడులో నిర్మించినది కాదని తెలిపారు. ఆ భవనం అనేక సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉందని తెలిపారు. ఆ విషయం తెలియని ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థి అటువైపు వెళ్లి దుర్మరణం చెందాడన్నారు. కేవలం శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలే కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాల శిథిల భవనాలను సైతం కూల్చివేయడానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రీట్వీట్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top