నేనెవర్ని మోసం చేయలేదు.. విచారణకు సహకరిస్తా: నామా

Nama Nageswara Rao Comments On ED Investigation On Madhucon Group - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నామా జూన్‌ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

''40 ఏళ్ల కిందట మధుకాన్ సంస్థను ప్రారంభించాను.. రాత్రింబవళ్ళు కష్టపడి సంస్థను కాపాడుకున్న. చైనా బార్డర్ లో కనీసం వెళ్లలేని ప్రాంతాల్లో కూడా ఈ సంస్థ వెళ్లి రోడ్లు వేస్తోంది.. ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు. ఈ సంస్థను మా ఇద్దరు సోదరులు చూసుకుంటున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ అనుమతులు ఇచ్చిన కంపెనీకి ఇవ్వాల్సిన 80 శాతం   సైట్ ఇవ్వాలి కానీ 21 శాతం మాత్రమే ఇచ్చింది. కంపెనీల్లో నేను ఎండీగా లేను. నాకు న్యాయవ్యవస్థ పై నమ్మకం ఉంది. 25 న ఈడీ పిలిచింది కచ్చితంగా వెళ్తాను.. నేను అన్నింటికీ సహకరిస్తాను. నేనెప్పుడూ నీతి నిజాయితీగా ఉంటూ, రాబోయే రోజుల్లో అదే విదంగా ప్రజలకు సేవ చేయాలని నడుస్తున్న. నన్ను ఆదరించి సీఎం కేసీఆర్ ఎంపీని చేశారు. నా బలం సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలు. ''అంటూ పేర్కొన్నారు.

ఇక కేసు విషయంలోకి వెళితే.. 2011లో జార్ఖండ్‌లో రాంచీ– రార్‌గావ్‌– జంషెడ్‌పూర్‌ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్‌ హైవే–33 పనులను మధుకాన్‌ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. మధుకాన్‌ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది.

తర్వాత మధుకాన్‌ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. నిజాలేమిటో తేల్చాలని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్‌ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది.మధుకాన్‌ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్‌ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. 

చదవండి: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామాకు ఈడీ షాక్‌..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top