Nagarjuna Sagar Bypoll: బీజేపీకి భారీ షాక్

Nagarjuna Sagar Bypoll Big Setback To BJP Ahead Polling - Sakshi

సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్‌ శాసన సభ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆ పార్టీ నేత కడారి అంజయ్య అధికార టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాగా చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన అభ్యర్థుల ఖరారు అంశంలో బీజేపీ ఆచితూచి వ్యవహరించి, రవికుమార్‌(ఎస్టీ వర్గం)కు టికెట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, అంజయ్య మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆయనను సంప్రదించి చర్చలు జరుపగా ‘కారు’ ఎక్కేందుకు సమ్మతించినట్లు సమాచారం. 

కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్‌ బీజేపీ డిపాజిట్‌ కోల్పోయింది. అప్పుడు ఆ పార్టీ తరఫున బరిలోకి దిగన నివేదితారెడ్డికి 2,675 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుతం బీజేపీ నుంచి టికెట్‌ ఆశించిన అంజయ్య  27,858 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య హఠాన్మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 

విజయం మాదే: మంత్రి ఎర్రబెల్లి
మరోవైపు సిట్టింగ్‌స్థానంలో విజయంపై గులాబీ దళం ధీమాగా ఉంది. నోముల నరసింహయ్య కుమారుడు నోముల భగత్‌కు టికెట్‌ కేటాయించిన అధికార పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ‘‘ సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌దే విజయం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బీజేపీ చతికిల పడింది. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతోంది. టీఆర్ఎస్ వైపు బీజేపీ నేతలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి జానారెడ్డి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.

చదవండి: సాగర్‌ బీజేపీ అభ్యర్థిగా ‘పానుగోతు రవికుమార్’‌
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top