సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కోరిన కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి

MP Komatireddy venkat reddy Sought Sonia Gandhi Appointment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ పార్టీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూనే.. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఉన్న నేతల నుంచీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాలు కొనసాగుతుండగానే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అపాయిట్‌మెంట్ కోరారు. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పరిణామాలను సోనియాకు వివరించనున్నారు. అలాగే తమకు పార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వారు మీడియాకు వివరించారు. 

చదవండి: (ఆలోచించి మాట్లాడండి.. మర్రి శశిధర్‌ రెడ్డికి అద్దంకి దయాకర్‌ సూచన)

బాధ్యతలిస్తే ప్రచారం చేస్తా: కోమటిరెడ్డి
దక్షిణ తెలంగాణపై సీఎం కేసీఆర్ సవతి ప్రేమ చూపిస్తున్నాడని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న, ధర్మభిక్షం విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించాడు. అనంతరం చౌటుప్పల్ నుంచి మల్కాపూర్ వెళ్లే రహదారి పనులు పరిశీలించారు. సీఎం కేసీఆర్ సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌లో మాత్రమే వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు. మునుగోడు ఎన్నికల్లో స్టార్ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగిస్తే ప్రచారం చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

చదవండి: (విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆ విషయం పార్టీ నేతలనే అడగండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top