బండి సంజయ్ -రాజాసింగ్ భేటీపై ఉత్కంఠ | MP Bandi Sanjay Meets Raja Singh | Sakshi
Sakshi News home page

బండి సంజయ్ -రాజాసింగ్ భేటీపై ఉత్కంఠ

Apr 12 2025 3:14 PM | Updated on Apr 12 2025 3:33 PM

MP Bandi Sanjay Meets Raja Singh

హైదరాబాద్: ఇటీవల రాష్ట్ర బీజేపీపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్ భేటీ కానుండటంపై ఉత్కంఠ నెలకొంది.  హిందుత్వ ఎజెండాతో పని చేస్తున్న ఈ ఇద్దరు నేతల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని పెంచుతుంది. రాజాసింగ్ తో సంధి కోసమే.. బండి సంజయ్ భేటీ అవుతున్నారనే ప్రచారం ఒకవైపు జరుగుతుండగా, బీజేపీలో రాజాసింగ్ ను మళ్లీ యాక్టివ్ చేయడానికే బండి సంజయ్ భేటీ అవుతున్నారని మరోవైపు ప్రచారం ఊపందుకుంది.

ఈరోజు(శనివారం) పాతబస్తీకి వెళ్లనున్న బండి సంజయ్.. ఆకాశ్ పురిలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రాజాసింగ్ తో సమావేశం కానున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించిన రాజాసింగ్‌...  తన స్టేట్ మెంట్స్ తో రాష్ట్ర నేతలను ఒకింత కలవరానికి గురి చేశారు.ఈ క్రమంలోనే రాజాసింగ్ తో బండి సంజయ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రాజాసింగ్ ను కాస్త శాంతిపచేసి మళ్లీ తిరిగి బీజేపీ కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కోరే అవకాశం ఉంది.

మరొకవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ వీరు భేటీ కావడం మరో వాదనకు తెరలేపింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై అభిప్రాయ సేకరణ పూర్తైన నేపథ్యంలో రాజాసింగ్ తో బండి సంజయ్ సమావేశం అవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. తాను అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ ప్రకటించినప్పటికీ వేరే వాళ్లకు మద్దతు ఇస్తే, ఎవరికి మద్దతు ఇస్తారు అనే దానిపై చర్చ నడుస్తోంది. మద్దతు కూడగట్టేందకే రాజాసింగ్ తో భేటీ అవుతున్నారా ? అనేది భేటీ తర్వాత క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది. 

ఇదిలా ఉంచితే, హైదరాబాద్  జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్యే ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎన్ గౌతంరావు బరిలో ఉన్నారు. దీనిపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. గౌతంరావును పట్టుబట్టి బరిలో దింపారు బండి సంజయ్.  ఈ విషయంపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేయడమే కాకుండా రాష్ట్ర పార్టీ నాయకత్వంపై కూడా విమర్శలు చేశారు. ఈ ఎన్నికను బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, పార్టీలో కీలక నేతగా ఉన్న రాజాసింగ్ మాత్రం ఎమ్మెల్సీ అభ్యర్థిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలో వీరి భేటీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. 

Advertisement
 
Advertisement
Advertisement