
సాక్షి, హైదరాబాద్: ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో తామేదో.. రెచ్చగొడుతున్న లోకేశ్ మాట్లాడటం సరికాదన్నారు. ఆయన ముందుగా.. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి తెలుసుకుంటే మంచిది అంటూ హితవు పలికారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘ఏపీ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల కోసం వరద నీరు తీసుకుపోతే ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారని అంటున్నారు. నికర జలాలు, మిగులు జలాల సంగతి తేలాక వరద జలాల గురించి ఆలోచించాలి. ఆయన ముందుగా.. వరద జలాలు, నికర జలాలు, మిగులు జలాల గురించి తెలుసుకుంటే మంచిది. తెలంగాణ ప్రాజెక్టుల పైనున్న ప్రాజెక్టుల్లో నీటి వినియోగం పూర్తైన తర్వాత వరద జలాల గురించి ఆలోచన చేయాలి. అవేమీ తెలియకుండా లోకేశ్.. ఏపీ ప్రజలను మభ్యపెట్టి, తప్పుదోవ పట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, ట్రిబ్యునల్స్ చెప్పినదాని ప్రకారం ఒక్క చుక్క నీటిని కూడా తెలంగాణ వదులుకోదు.

సీనియర్ నాయకుడిగా చంద్రబాబు ఇలాంటి నీటి వాటాలపై ఘర్షణ పూరిత వాతావరణానికి ఇరు రాష్ట్రాల మధ్య తెర లేపొద్దు. వరద జలాలు సముద్రంలో కలవాలని ఎవరూ కోరుకోరు.. మీరు వాటిని వాడుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరమూ ఉండదు. కానీ, మా కోటా, మా వాటా పూర్తి కాకుండా నీటిని తరలిస్తామంటే మా హక్కులపై కచ్చితంగా నిలదీస్తాం, అడ్డుకుంటాం. మా రైతుల హక్కుల కోసం కచ్చితంగా మాట్లాడతాం. దానికి మేమేదో ప్రాంతీయ అసమానతలను రెచ్చగొడుతున్నట్టు లోకేశ్ వక్రీకరించడం సరికాదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి లభ్యత దృష్ట్యా 968 టీఎంసీలు తెలంగాణకు, 531 టీఎంసీలు ఏపీకి ఇచ్చిన తరువాత ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాల గురించి ఆలోచించాలి. మా రాష్ట్ర హక్కులు మేము కాపాడుకుంటాం.. మీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోండి. అంతే కానీ ప్రజలను మోసం చేసే విధంగా తప్పుడు సమాచారం ఇవ్వకండి అంటూ హితవు పలికారు.