సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గోదావరి జిల్లాలో కనిపించే పచ్చదనంపై తెలంగాణ నాయకులు దిష్టి పెట్టారని.. నరుడి దిష్టికి రాయి కూడా పగిలిపోతుందని అంటారు అని పవన్ చేసిన కామెంట్లపై తెలంగాణ నాయకులు భగ్గుమంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. పవన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను బాధించాయి. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి. పవన్ క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వం. మంత్రిగా చెబుతున్నా.. ఒక్క థియేటర్లో కూడా పవన్ సినిమా విడుదల కాదు. పవన్ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. రాజకీయ అనుభవం లేకనే ఇలా మాట్లాడుతున్నాడు.
పవన్ తెలిసి మాట్లాడాడో, తెలియక మాట్లాడాడో తెలియదు.. కానీ ఆయన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో నష్టపోయాం. తెలంగాణ వచ్చాక కేసీఆర్ వల్ల నష్టపోయాం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చిరంజీవి సూపర్ మ్యాన్ ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. పవన్ కల్యాణ్ అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైదరాబాద్ ఆదాయం అంతా విశాఖ, కాకినాడ, తిరుపతికే వాడుకున్నారు. తెలంగాణ ప్రజలు దిష్టి కాదు.. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ తాగారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నేతలు గరం..
ఇక, అంతకుముందు.. పవన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కు సిగ్గుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రాలో ఉండాలని ఒక వీడియోతో బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తించి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడడానికి తెలంగాణ అంటే ఇష్టం అని, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే ఇక్కడి యువత పరిగెత్తించి తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వార్నింగ్ ఇచ్చారు.
పవన్ కల్యాణ్‌కు తెలంగాణపై అక్కసు ఉంటే... హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలని కోరారు. తెలంగాణ విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు కూడా తెలంగాణలో ఆడవని హెచ్చరించారు. సినిమాల షూటింగ్‌లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించిపోవడానికి, వాళ్లు అభివృద్ధి చెందడానికి మాత్రమే తెలంగాణ అవసరం ఉంటుందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతమంటే ఎంత వివక్షనో ఇప్పడు బయటపడిందని పవన్ కల్యాణ్‌పై భగ్గుమన్నారు.


