OPS Vs EPS: పన్నీర్‌ సెల్వానికి షాక్‌.. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

AIADMK: Madras High Court To Decide On Big OPS Vs EPS Battle - Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అంతర్గత కలహాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి మద్రాసు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పన్నీరు సెల్వం పిటిషన్‌ను జస్టిస్ కృష్ణన్ రామసామి తిరస్కరించారు. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంపై నిషేధం లేదని తేల్చి చెప్పింది. మద్రాస్‌ హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే చీఫ్‌ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. నేడు(సోమవారం) జరగనున్న సర్వసభ్య సమావేశంతో ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య సాగుతున్న ఆధిపత్యపోరుకు తెరపడుతుంది. 

ఇదిలా ఉండగా అన్నాడీఎంకే కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. ఓపీఎస్‌-ఈపీఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వసం అయ్యాయి.

అసలు కథ ఏంటంటే..
అన్నాడీఎంకేలో ఒక ఒరలో రెండుకత్తులు ఇమడవన్నట్లుగా ఈపీఎస్, ఓపీఎస్‌ వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పన్నీర్‌సెల్వంను పక్కనపెట్టడం ద్వారా ప్రధాన కార్యదర్శిగా అవతరించాలని ఎడపాడి ఎత్తులు వేయడం ప్రారంభించగానే.. పన్నీర్‌సెల్వం కూడా తానేమీ తక్కువకాదన్నట్లు పైఎత్తులతో న్యాయపోరాటానికి దిగారు. గత నెల 23వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశం వేదికగా ఈపీఎస్, ఓపీఎస్‌ మద్దతుదారులు భౌతికదాడులకు కూడా సాహసించారు. పన్నీర్‌సెల్వంను పార్టీ నుంచి శాశ్వతంగా తప్పించమే శ్రేయస్కరమనే స్థాయికి ఎడపాడి వర్గం సిద్ధమైంది.

ఈ క్రమంలో సోమవరాం మరోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించి ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా పన్నీర్‌పై రాజకీయ బాణం ఎక్కుపెట్టనున్నారు. ఎడపాడిని ప్రధాన కార్యదర్శిని చేయడం, పన్నీర్‌సెల్వంను ఇంటిబాట పట్టించాలనే పట్టుదలతో ఉన్నారు. మెజార్టీ వర్గం ఎడపాడి పంచన చేరిపోవడంతో సర్వసభ్య సమావేశం జరగకుండా స్టే కోరుతూ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుండగా 9 గంటలకు తీర్పు చెబుతామని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రెండురోజుల క్రితం ప్రకటించారు.

కోర్టు తీర్పు కోసం ఎదురుచూడకుండా ఎడపాడి వర్గీయులు ఆదివారం సభాస్థలికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించి వచ్చారు. పన్నీర్‌ ఆశిస్తున్నట్లుగా స్టే మంజూరవుతుందా..? లేక ఎడపాడి ఏర్పాట్లకు అనుగుణంగా సర్వసభ్య సమావేశానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుందా..? అని ఇరువర్గాలు నరాలు తెగే ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. ఇదిగాక, రూ.4,800 కోట్ల టెండర్‌ కుంభకోణానికి పాల్పడ్డారనే అభియోగం కింద ఎడపాడి పళనిస్వామిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ ప్రారంభం కానుండటం ఆయన మద్దతుదారులకు మరో తలనొప్పిగా మారింది. 
చదవండి: ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. ‘భారత్‌ కూడా శ్రీలంకలాగే.. మోదీకి అదే గతి’

ఎవరికి వారు.. 
ఈపీఎస్, ఓపీఎస్‌ ఎవరికివారు సర్వసభ్య సమావేశానికి సమాయత్తం అవుతున్నారు. ‘విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాం’ అన్నట్లుగా ఎడపాడి, పన్నీర్‌ మద్దతుదారులు కార్లు, వ్యాన్లు, బస్సుల్లో, మరికొందరు విమానాల్లో ఆదివారం చెన్నైకి చేరుకున్నారు. సుమారు 2,650 మంది కోసం చెన్నై నగరం, శివార్లలోని లగ్జరీ హోటళ్లలో ముందుగానే రిజర్వ్‌ చేసుకున్న గదుల్లో బసచేసి ఉన్న తమ వర్గం నేతలతో ఈపీఎస్, ఓపీఎస్‌ సమాలోచనల్లో మునిగిపోయారు. వీరుగాక నేతలు, కార్యకర్తలతో హోటళ్లన్నీ నిండిపోయాయి. పార్టీపరంగా 75 జిల్లాలకు గాను 70 జిల్లాల కార్యదర్శులు ఎడపాడి వైపు ధీమాగా నిలిచి ఉన్నారు.

ఎడపాడి దూకుడును అడ్డుకోవడం ఎలా.. అని న్యాయనిపుణులతో ఓపీఎస్‌ ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ఓపీఎస్‌ మరోసారి మద్దతుదారులతో సమావేశం అవుతుండగా, ఎలాంటి వ్యూహం పన్నుతాడోనని ఎడపాడి వర్గం అప్రమత్తంగా గమనిస్తోంది. సమావేశం జరుపుకునేలా తీర్పు వెలువడటంతో పన్నీర్‌సెల్వం సహా ఆయన మద్దతుదారులు కార్యక్రమాన్ని బహిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top