పార్టీ అభ్యర్థులకు లీగల్‌ సెల్‌ రక్షణ కవచంలా నిలవాలి: సజ్జల | Legal Cell Leaders Meet At YSRCP Central Office | Sakshi
Sakshi News home page

పార్టీ అభ్యర్థులకు లీగల్‌ సెల్‌ రక్షణ కవచంలా నిలవాలి: సజ్జల

Oct 10 2026 4:32 PM | Updated on Oct 10 2026 5:03 PM

Legal Cell Leaders Meet At YSRCP Central Office

సాక్షి, తాడేపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు లీగల్ సెల్ రక్షణ కవచంలా, అవసరమైనప్పుడు న్యాయపరమైన ఆయుధంలా నిలవాలని వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ లీగల్ సెల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పూడి శ్రీహరి, లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైన దశలోకి వెళ్తున్నాయని, పార్టీ లీగల్ సెల్ ఇక సాధారణ అనుబంధ విభాగంగా కాకుండా ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని న్యాయపరంగా పర్యవేక్షించే వ్యవస్థగా పనిచేయాలని అన్నారు.

రాష్ట్రంలో చట్టాలు, నిబంధనలు, ఎన్నికల వ్యవస్థలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలవడం లేదని ఆయన అన్నారు. 2024 ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు, దాడులు, వేధింపులు జరిగాయని, అలాంటి పరిస్థితుల్లో లీగల్ సెల్ కార్యకర్తలకు అండగా నిలిచిందని అభినందించారు.

ఎస్‌ఐఆర్ పూర్తయ్యేలోపే ఎన్నికలకు ఎందుకు తొందర?
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో చనిపోయినవారి, డూప్లికేట్, అనర్హ ఓట్లు తొలగిస్తున్న పరిస్థితుల్లో, కొత్త ఓటర్ల జాబితా అందుబాటులోకి రాకముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం తొందరపడుతోందని సజ్జల అన్నారు. ఎస్‌ఐఆర్ ఫైనల్ జాబితా త్వరలోనే రావాల్సి ఉన్నప్పుడు, దానికి ముందే నోటిఫికేషన్ ఇవ్వాలనే ప్రయత్నం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారిని జాబితాలో చేర్చకుండా ఎన్నికలు నిర్వహిస్తే వారి రాజ్యాంగబద్ధ హక్కు దెబ్బతింటుందని అన్నారు.

బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలి
బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికను ప్రజలకు అందుబాటులో పెట్టకుండా శాతం నిర్ణయించడం ఏ ప్రాతిపదికన జరిగిందో వెల్లడించాలని సజ్జల డిమాండ్ చేశారు. కమిషన్ నివేదికను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆధారాలు వెల్లడించాలని అన్నారు.

నామినేషన్ దశ నుంచే అప్రమత్తంగా ఉండాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు పోరాటం నామినేషన్ దశ నుంచే ప్రారంభమవుతుందని సజ్జల అన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, ఇతర అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా అభ్యర్థులకు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని, అందువల్ల ముందుగానే అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేయించాలని సూచించారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత నామినేషన్లకు చాలా తక్కువ సమయం ఉండే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు, ప్రత్యామ్నాయ అభ్యర్థులు, అవసరమైన లీగల్ టీమ్‌లను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని చెప్పారు.

గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు లీగల్ నెట్‌వర్క్
ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండే న్యాయవాదులను మ్యాపింగ్ చేసి, వారి కాంటాక్ట్ వివరాలను కంప్యూటరైజ్ చేయాలని సజ్జల సూచించారు. గ్రామ స్థాయి అభ్యర్థికి కూడా తనకు అవసరమైనప్పుడు ఏ న్యాయవాదిని సంప్రదించాలో ముందుగానే తెలిసేలా వ్యవస్థ ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో లీగల్ వార్‌రూమ్, నియోజకవర్గ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు, రాష్ట్ర కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే జిల్లా నుంచి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం చేరి, అవసరమైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్, కోర్టులను ఆశ్రయించేలా వ్యవస్థ పనిచేయాలని చెప్పారు. సెన్సిటివ్ ప్రాంతాలు, నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను ముందుగానే గుర్తించి, అక్కడి పరిస్థితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.

ప్రతి అక్రమాన్ని రికార్డు చేయాలి
ఎన్నికల సమయంలో అధికారులు, పోలీసులు లేదా ఇతరులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే వాటిని ఆధారాలతో నమోదు చేయాలని సజ్జల చెప్పారు. ప్రతి ఫిర్యాదు, ప్రతి ఘటన, ప్రతి అధికారిపై వచ్చిన ఆరోపణను డిజిటల్‌గా రికార్డు చేసి, అవసరమైతే లీగల్ చర్యలకు ఉపయోగించాలన్నారు. ఫీల్డ్ స్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని మీడియా, సోషల్ మీడియా, లీగల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

పార్టీ కార్యకర్తలకు లీగల్ సెల్ అండగా నిలిచింది: పొన్నవోలు
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, గత రెండున్నరేళ్లుగా పార్టీ కార్యకర్తలు ఎదుర్కొన్న కేసులు, అరెస్టులు, వేధింపుల సమయంలో లీగల్ సెల్ వారికి భరోసాగా నిలిచిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన, పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిన సందర్భాల్లో లీగల్ సెల్ వీధుల్లోనూ, కోర్టుల్లోనూ పోరాడిందన్నారు. పార్టీ కోసం కష్టకాలంలో పనిచేస్తున్న ప్రతి న్యాయవాదిని భవిష్యత్తులో పార్టీ గుర్తిస్తుందని, వారికి తగిన గౌరవం లభించేలా చూడాలని కోరారు.

అభ్యర్థులకు న్యాయవాదులు వెన్నుముకగా నిలవాలి: చెవిరెడ్డి
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి లీగల్ సెల్ కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. కొత్తగా పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలు, నామినేషన్ ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండకపోవచ్చని, అందువల్ల న్యాయవాదులు వారికి ప్రతి దశలో మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

నామినేషన్ పత్రాలు నింపడం నుంచి దాఖలు చేయడం వరకు, కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలు పొందడం వరకు లీగల్ సెల్ పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఏ అభ్యర్థి నామినేషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురికాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నామినేషన్‌కు సమర్పించిన పత్రాలన్నింటినీ స్కాన్ చేసి సంబంధిత రిటర్నింగ్ అధికారులకు డిజిటల్ రూపంలో కూడా పంపితే, తర్వాత పత్రాలు లేవని చెప్పి తిరస్కరించే పరిస్థితుల్లో ఆధారంగా ఉపయోగపడుతుందని సూచించారు. నామినేషన్ తిరస్కరణ జరిగితే వెంటనే న్యాయపరంగా స్పందించి అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని చెప్పారు.

ప్రతి నియోజకవర్గంలో న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేసి, ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలను ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. పార్టీ అభ్యర్థులకు కేసులు, అరెస్టులతో భయపెట్టే ప్రయత్నాలు జరిగినా వారికి ధైర్యం చెప్పి, చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత లీగల్ సెల్‌పై ఉందన్నారు. తాను కూడా అనేక కేసులు, జైలు జీవితం ఎదుర్కొన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ, కష్టాలను భయపడకుండా గట్టిగా నిలబడటం ద్వారానే రాజకీయంగా ఎదగగలమని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే నాయకులే భవిష్యత్తులో మరింత ఉన్నత బాధ్యతలకు ఎదగగలరని అన్నారు. అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా దాఖలు కావడం నుంచి వారి గెలుపు వరకు న్యాయవాదులు వెన్నుముకగా నిలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో లీగల్ సెల్ ప్రధాన పాత్ర పోషించాలి అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యం: మనోహర్‌రెడ్డి
లీగల్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సమావేశం సాధారణ పార్టీ సమావేశం కాదని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించే బాధ్యతతో ఏర్పాటు చేసిన సమావేశం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పోలీస్ స్టేషన్లలో ఎదురయ్యే సమస్యలు, రౌడీ షీట్లు, బైండ్ ఓవర్ కేసులు తదితర అంశాల్లో న్యాయవాదులు చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.

నియోజకవర్గ కమిటీలను వెంటనే పూర్తి చేసి, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అవసరమైన న్యాయసహాయం 24 గంటలు అందుబాటులో ఉండేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. లీగల్ సెల్‌లో నిజాయితీగా, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారిని ప్రోత్సహించాలని, అవకాశవాదులను దూరంగా ఉంచాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశలో పార్టీ అభ్యర్థులకు పూర్తి న్యాయపరమైన రక్షణ కల్పించేందుకు లీగల్ సెల్ రాష్ట్రవ్యాప్తంగా సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఇదీ చదవండి: AP: స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement