సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక వివరాలు వెల్లడించింది. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఒక దశలోనే నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించేందుకు పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన సమయం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. నోటిఫికేషన్ వెలువడిన 14 రోజుల్లోనే పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. 15 రోజుల్లో పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు జరగనున్నాయి. రెండు రోజుల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 16 రోజుల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు.. రెండు రోజుల తర్వాత ఫలితాలు రానున్నాయి.
పంచాయతీలకు మాత్రం పార్టీ రహితంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు. పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికలు నోటిఫికేషన్ నుంచి 15 రోజుల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 16 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పోలింగ్ పూర్తయిన రెండు రోజుల తరువాత వీటిలో ఓట్లు లెక్కించనున్నారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా.. మిగిలినవన్నీ పార్టీ పరంగా నిర్వహిస్తారు. నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ ఏది ముందు వెలువడితే.. అదే రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఎన్నికలకు మొత్తం 1,05,432 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. తెలంగాణ నుంచి 17,650 బాక్సులు తెప్పించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎస్ఈసీ ప్రకటించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఎస్ఈసీ మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు మెటీరియల్ సిద్ధం చేశాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించాలన్న సూచనలు పరిశీలించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎన్నికల హామీని గంగలో కలిపేసిన బాబు సర్కార్


