ఆ కుట్రలో బాలకృష్ణ కూడా భాగమే

Kurasala Kannababu Fires On Chandrababu Balakrishna - Sakshi

ఎన్టీఆర్‌ ఆత్మక్షోభకు గురిచేసి ఇప్పుడు పెద్ద మనుషుల్లా ప్రగల్భాలు 

ఇందిరా సాగర్‌ పేరును చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుగా ఎందుకు మార్చారు? 

మాజీమంత్రి కురసాల కన్నబాబు   

కాకినాడ రూరల్‌: ఎన్టీ రామారావును పదవీచ్యుతుడ్ని చేసి ఆయనపై రాళ్లు, చెప్పులు వేసి.. ఆయన మరణానికి కారకులైన వారు ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్నారని.. అలాగే, తండ్రి కన్నీళ్లకు కరగని తనయుడిగా బాలకృష్ణ చరిత్రలో నిలిచిపోయారని మాజీమంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు.

కాకినాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నతండ్రి కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోని కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నించారు. ఆ రోజు ఎన్టీఆర్ ఎంత ఆత్మక్షోభతో చనిపోయారో చెప్పడానికి ఈ రాష్ట్రమే సాక్ష్యమన్నారు. ఆ కుట్రలో బాలకృష్ణ కూడా ఒక భాగమని.. అటువంటి వ్యక్తి ఇప్పుడు పంచ్‌ డైలాగులు కొడుతున్నారని కన్నబాబు విమర్శించారు.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని ఎన్నికల ముందు వాగ్దానం చేసిన వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి వచ్చాక ఆ మాట నిలబెట్టుకున్నారని గుర్తుచేశారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు థ్యాంక్స్‌ చెప్పడానికి నోరుపెగలని నాయకులందరూ ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు అండ్‌ కోకు ఎంత ప్రేమ ఉందో అందరికీ తెలుసని అన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్‌ అనే పేరును రాజశేఖరరెడ్డి పెట్టారని, ఆ తర్వాత చంద్రబాబు ఆ పేరును ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరును డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పెడితే ఎన్‌టీఆర్‌ పేరు పెట్టారని.. దానిని కూడా ఉంచాలా.. వద్దా.. అని వాడు.. వీడు.. అంటూ ఎన్టీఆర్‌ను సంబోధించారని కన్నబాబు గుర్తుచేశారు. ప్రజలు చరిత్రను మరచిపోరని, బాలకృష్ణ ఆత్మపరిశీలన చేసుకుని మాట్లాడాలని హితవు పలికారు. డైలాగులు, పంచ్‌లు సినిమాల్లోనే పేలుతాయని, రాజకీయాల్లో పేలవన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top