గంజాయి సాగుదారులకే బాధ

Kurasala Kannababu Comments On TDP Leaders - Sakshi

రాష్ట్రంలో రైతులంతా సంతోషంగానే ఉన్నారు: మంత్రి కన్నబాబు  

కోవిడ్‌ సమయంలో పంటల కొనుగోళ్లతో అన్నదాతలను ఆదుకున్నాం 

కాకినాడ రూరల్‌: రైతుల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఇది చేతల ప్రభుత్వమని నిరూపిస్తూ ప్రతి రైతు జీవితకాలం గుర్తుంచుకునేలా ఆర్బీకేలు లాంటి వ్యవస్థలను తెచ్చారని చెప్పారు. బుధవారం కాకినాడలో ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ రైతుల హృదయాల్లో నిలిచిపోవటాన్ని తట్టుకోలేక టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా తదితరులు లేఖలు రాస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులంతా బాగున్నారని, గంజాయి సాగు చేసే టీడీపీ నేతలే బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు నెలలుగా విస్తృతంగా దాడులు జరిపి గంజాయి సాగు చేసే నిందితులను పట్టుకున్నామన్నారు. 

అన్నీ అవాస్తవాలే 
అనంతపురం జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేయటాన్ని కన్నబాబు ఖండించారు. కోస్తా జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో క్రాప్‌ హాలిడే ప్రకటించినట్లు అసత్యాలు వల్లిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో అమలాపురం ప్రాంతంలో క్రాప్‌ హాలిడే ప్రకటించిన రైతులను నాడు హోంశాఖ మంత్రిగా ఉన్న చినరాజప్ప పోలీసులతో బెదిరించారని గుర్తు చేశారు. వ్యవసాయ బోర్లకు మీటర్ల బిగింపుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఎక్కడైనా రూపాయి అదనంగా చార్జీ పడుతోందా? అని ప్రశి్నంచారు. 

వ్యవసాయ బడ్జెట్‌ 14 శాతానికి పెంచాం 
టీడీపీ హయాంలో 2014–15 బడ్జెట్‌లో వ్యవసాయానికి 12 శాతం నిధులు కేటాయించగా 2018– 19 నాటికి 10 శాతానికి కుదించారని కన్నబాబు తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 2019– 20లో 13 శాతం, తరువాత 14 శాతానికి పెంచిందని చెప్పారు. 2014– 15లో టీడీపీ ప్రభుత్వం రూ.5,583 కోట్లు విలువైన 40.62 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా 2018 –19 సీజన్‌లో రూ.12,639 కోట్ల మేర ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు. 2019– 20లో రూ.15,037 కోట్లు, 2020– 21లో రూ.15,487 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా పప్పు దినుసులు, ఉల్లి, జొన్న తదితరాల సేకరణకు 2014– 15లో రూ.402 కోట్లు వెచి్చంచగా వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక 2019– 20లో రూ.2,595 కోట్లు వెచ్చించిందని తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఉల్లి మొదలుకుని బత్తాయిలు, పూలు కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామన్నారు. 

ఉచిత పంటల బీమా.. 
ఈ –క్రాప్‌లో నమోదు చేసుకుంటే రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేకుండా ఉచిత పంటల బీమా కల్పిస్తున్నామని కన్నబాబు తెలిపారు. గత సర్కారు రైతుల నుంచి డబ్బులు వసూలు చేసి 60.84 లక్షల మందికి పంటల బీమా సదుపాయం కల్పించగా తమ ప్రభుత్వం రెండేళ్లలో 1.21 కోట్ల మంది రైతులకు ఉచితంగా పంటల ఇన్సూరెన్స్‌ చేసిందని చెప్పారు. రెండేళ్లలో రూ.3,716 కోట్లు ఇన్సూరెన్స్‌ కింద ప్రభుత్వం చెల్లించిందన్నారు. రూ.15 వేల కోట్లతో రాష్ట్రంలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను  ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రతి గ్రామంలో గోడౌన్‌లు, కోల్డ్‌ స్టోరేజ్‌లు, పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్‌ యూనిట్లను తెస్తున్నామన్నారు. 7.38 లక్షల టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, యూరియా 2.66 లక్షల టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 3.30 లక్షల టన్నులు నిల్వ ఉన్నాయన్నారు. నాడు టీడీపీ రుణమాఫీ పేరుతో రైతులను వంచించగా ఇప్పుడు రెండేళ్లలో రైతు భరోసా కింద మొత్తం రూ.17,030 కోట్లను 23 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top