మీ నాన్న వెన్నుపోటు పొడవలేదని ప్రమాణం చేస్తావా?

Kurasala Kannababu Comments On Chandrababu And Lokesh - Sakshi

లోకేష్‌కు మంత్రి కన్నబాబు సవాలు

తండ్రి కొడుకులవి ఎన్నికల డ్రామాలే

రాజకీయ స్వార్థం కోసం విమర్శలు మంచిది కాదు

తిరుపతి తుడా: ఎన్టీఆర్‌కు మీ నాన్న చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదని ప్రమాణం చేస్తావా? అని మంత్రి కురసాల కన్నబాబు నారా లోకేష్‌కు సవాలు విసిరారు. అలాగే మీ మామ బాలకృష్ణ కాల్పులు జరపలేదని, ఇంట్లో రక్తసిక్తం కాలేదని ప్రమాణం చేయగలవా? నీ తండ్రి సరదాకోసం గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోలేదని ప్రమాణం చేస్తావా? అంటూ నిలదీశారు. కన్నబాబు బుధవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. తిరుపతిలో ఘోర పరాజయం తప్పదని గుర్తించిన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌లు ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలకు దిగారని విమర్శించారు. శ్రీవారి పాదాలచెంత గరుడ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలపై నిషేధం ఉందన్నారు.

అలాంటి పవిత్రస్థలంలో లోకేష్‌ మేధావి అనుకుని వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు సంబంధం లేదని ప్రమాణం చేస్తామని, అదే రీతిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తమకేమీ సంబంధం లేదని ప్రమాణం చేయగలరా? అంటూ సవాలు విసరడం సిగ్గుచేటన్నారు. ‘‘నువ్వెంత? నీ స్థాయెంత? నీ బతుకెంత? అనేది తెలుసుకుని సవాలు విసరాలి. బుర్రతక్కువ మాటలు మాట్లాడితే సహించేదిలేదు. మా నాన్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవలేదు. అధికారంలో నుంచి దించేయలేదంటూ అదే అలిపిరి వద్ద ప్రమాణం చేస్తే బాగుంటుంది’’ అని లోకేష్‌కు ఆయన చురకలేశారు. విశాఖలో జగన్‌పై జరిగిన దాడికేసును ఎన్‌ఐఏకు, అంతర్వేది రథం దగ్ధం కేసు సీబీఐకు, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించి సీఎం నిజాయతీని నిరూపించుకున్నారన్నారు. అలాంటి వ్యక్తిపై రాజకీయ స్వార్థంకోసం విమర్శలు చేయడం మంచిదికాదన్నారు.

ఇళ్లల్లోని మహిళలనుసైతం రాజకీయాల్లోకి లాగడం వారి సంస్కారానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్నెన్నాయుడు చెప్పినట్టు టీడీపీ కనుమరుగవుతుందన్నారు. వెంకన్నపై విశ్వాసముంటే.. తిరుపతిలో ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చాలని కన్నబాబు డిమాండ్‌ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటే ప్రత్యేక హోదా తీసుకొస్తారని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రద్దు చేస్తున్నామని, ద్రవ్యలోటు తీర్చుతున్నామని, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు విడుదల చేశామని, విభజన హామీలను నెరవేర్చి మీ ముందుకొస్తున్నాం, మాకు ఓట్లు వేయండని అడుగుతారేమోనని తామంతా ఎదురు చూశామని ఆయన అన్నారు. అయితే వీటి సంగతి పక్కనపెట్టి తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని నడ్డా ప్రకటించడాన్ని బట్టి బీజేపీ కుట్ర విదితమవుతోందన్నారు. బీజేపీ కుట్రను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top