మీది ఎన్‌డీఏనా.. ఎన్‌పీఏనా?.. కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

KTR Satires On NDA Government Should We Call It NDA or NPA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు మంగళవారం ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి దేశంలో నిరుద్యోగం పెరిగింది. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంత స్థాయికి ద్రవ్యోల్బణం చేరింది. ఇంధన ధరలు పెరగడంతోపాటు ఎల్పీజీ సిలిండర్‌ ధర ప్రపంచంలోనే అతిఎక్కువ ధరకు చేరుకుంది. వినియోగదారుల నమ్మకం అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు చెప్తోంది.

దీనిని ఎన్‌డీఏ ప్రభుత్వం అనాలా లేక ఎన్‌పీఏ ప్రభుత్వం అనాలా? భక్తులారా.. ఎన్‌పీఏ అంటే నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్స్‌ (నిరర్ధక ఆస్తులు) అని అర్థం’అంటూ ఎద్దేవా చేశారు. తమ కార్యకర్తలకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకుంటే యుద్ధం చేస్తామంటూ వీహెచ్‌పీ వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపైనా కేటీఆర్‌ స్పందించారు. ‘కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గారూ.. వీళ్లందరూ ఈ దేశ రాజ్యాంగం, పీనల్‌ కోడ్‌ నిబంధనలకు అతీతులా? మీ అధికార పరిధిలో ఉన్న ఢిల్లీ పోలీసులకు ఇలాంటి దారుణ పరిస్థితులను మీరు సహిస్తారా?’అని ప్రశ్నించారు. 
(చదవండి: కేసీఆర్‌ మోకాళ్ల యాత్ర చేయాలి)

బెంగళూరులో పెట్టుబడులివిగో! 
కర్ణాటకలో నెలకొన్న పరిస్థితుల్లో పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు రావాలంటూ మంత్రి కేటీఆర్‌ గతంలో చేసిన ట్వీట్‌పై కర్ణాటక డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ గ్రూప్‌ స్పందించింది. ‘కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు పరిసరాల్లో సుమారు రూ. 11,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 46,984 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వం ఆమోదించిన పరిశ్రమల జాబితాలో రెండు లిథియం అయాన్‌ సెల్‌ యూనిట్లు, ఎక్సైడ్‌ ప్లాంటు ఉన్నాయి’ అని పరిశ్రమల జాబితాను కేటీఆర్‌ ట్విట్టర్‌ ఖాతాకు ట్యాగ్‌ చేసింది.   
(చదవండి: రాహుల్‌ రాకతో ’సీన్‌’ మారాల్సిందే)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top