బాబూ.. ఎంత అదిరిందో వారినే అడగాల్సింది! | KSR Comments On Chandrababu Mahanadu | Sakshi
Sakshi News home page

బాబూ.. ఎంత అదిరిందో వారినే అడగాల్సింది!

May 29 2025 10:57 AM | Updated on May 29 2025 11:28 AM

KSR Comments On Chandrababu Mahanadu

ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో ఒక సభ పెట్టారు. సూపర్‌ సిక్స్‌ అంటూ కొన్ని ఎన్నికల హామీలను ప్రకటించిన తరువాత ఆయన ‘‘అదిరిందా తమ్ముళ్లూ.. అదిరిందా’’ అని ఒకటికి రెండుసార్లు అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. తాజాగా ఇప్పుడు కడపలో జరిగిన మహానాడులోనూ వాటిని ప్రస్తావించారు. అలాగే.. పాలన అదురుతోందా? రాజమండ్రిలో చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం కదా. ప్రజలంతా అదిరిపోతున్నారా? అని కార్యకర్తలను అడగాలి కదా! కానీ ఎందుకో మరి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఆ సాహసం మాత్రం చేయలేకపోయారు!. ఎందుకు జరుగుతోందో? ఏమి సాధించాలని అనుకుంటున్నారో తెలియకుండా సాగిన మహానాడు బహుశా ఇదేనేమో!.

సాధారణంగా మహానాడు కార్యక్రమాల్లో విధానాలపై చర్చ జరిగేది. పాలనలోని మంచిచెడు గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడలా కాదు.. స్వోత్కర్ష, గప్పాలు కొట్టుకోవడం, అతిశయోక్తులతో ప్రసంగాలు ఒకవైపు, అంతా లోకేశ్‌ మయం అన్నట్లుగా మరోవైపు ఈ సభ జరిగింది. లోకేశ్‌ నా తెలుగు కుటుంబం అని సొంత లోగోని ఏర్పాటు చేసుకోవడం, ఆయన కొత్తగా కనిపెట్టినట్లు చెప్పుకుంటున్న ఆరు శాసనాలు ప్రచారం కోసం ఈ సభలు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే  ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ పెత్తనం చేస్తున్న సంగతి తెలిసిందే. కారణం ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముందని అంటూనే పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని చెప్పడం ద్వారా ఆయన మనసులోని మాట చెప్పకనే చెప్పినట్లయింది.

జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదిహేనేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒకటికి, రెండుసార్లు అనడం ద్వారా లోకేశ్‌కు బ్రేక్ వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆలోచన వచ్చింది కానీ, దానికి పవన్ కళ్యాణ్, జనసేన కేడర్‌ సుముఖంగా లేరని చెబుతున్నారు. పవన్ స్థాయి తగ్గినట్లవుతుందని వారి బాధ. దీనిని గమనిస్తే, వారిద్దరి మధ్య ఇంకా డీల్ కుదరలేదేమో అన్న సందేహం వస్తుంది. ఈ సంగతి పక్కన బెడితే  చంద్రబాబు స్పీచ్ అంతా ఎప్పటి మాదిరి అసత్యాలు, అర్ధసత్యాలు, జగన్ ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలతో పేలవంగా సాగింది. రాజమండ్రిలో ఆయన చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించినట్టు కనిపిస్తోంది. పెన్షన్ రూ.వెయ్యి పెంచడం, గ్యాస్ సిలిండర్ల పథకం అరకొర అమలు మినహా మిగిలిన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారో వివరించాలి కదా!. పోనీ ఫలానా అభివృద్ది సాధించామని చెప్పగలిగారా? నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేలు, స్కూల్‌కు వెళ్లే ప్రతీ విద్యార్ధికి రూ.15 వేలు, ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సూపర్ సిక్స్ లో ప్రధానంగా ఉన్నాయి.

ఇవి కాకుండా షణ్ముక వ్యూహం అంటూ, ఎన్నికల ప్రణాళిక పేరుతో దాదాపు 200 హామీలు ఇచ్చారు. జూన్‌లో తల్లికి వందనం, ఆగస్టులో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తామని అంటున్నారే తప్ప, ఈ సంవత్సరం అంతా ఎందుకు ఇవ్వలేదో, అది తమ వైఫల్యమో కాదో చంద్రబాబు మాట మాత్రం చెప్పలేకపోయారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామని తమ మేనిఫెస్టోలో రాసినప్పటికీ, ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బుతో కలిసి మూడు విడతలుగా ఇస్తామని అంటున్నారు. వేరే హామీలలో వలంటీర్ల కొనసాగింపు, బీసీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ వంటివి చాలానే ఉన్నాయి. ఎల్లో మీడియాలో కవరేజీకి అవసరమైన  డైలాగులు మాత్రం చెప్పారనిపిస్తుంది. రాష్ట్రం దశ, దిశ మార్చే విధంగా అవసరమైన విధానాలు  రూపొందిస్తామని చంద్రబాబు ఇప్పుడు చెప్పడం ఏమిటి?.

గత మహానాడు అనండి, పార్టీ సభ అనండి.. లేదా తాము  విడుదల చేసిన మేనిఫెస్టోలో చెప్పిన విధానాలు కాకుండా కొత్త విధానాలు ఏం తీసుకువస్తారు?. అంటే మేనిఫెస్టోలోని అంశాలన్నిటినీ గాలికి వదలివేసినట్లేనా!. కార్యకర్తల ద్వారా రాజకీయ పాలన చేస్తారట. ఈ ఏడాది కాలం టీడీపీ కార్యకర్తలు, నేతలు సాగించిన అరాచకాలు, ఎమ్మెల్యేలు చేసిన దందాలు సరిపోలేదని భావిస్తున్నారా? లేక అవినీతి పథకాలతో కార్యకర్తల జేబులు నింపుతారా!. గతంలో జన్మభూమి కమిటీల మాదిరి వారు ప్రజలపై పెత్తనం చేస్తూ సంపాదించుకోవచ్చని చెబుతున్నారా?. ఆ డబ్బుతో ఎన్నికలలో గెలవవచ్చన్నది వీరి ఉద్దేశమా?.

గత ముఖ్యమంత్రి జగన్ ఆయా స్కీములలో కులం, మతం, పార్టీ, ప్రాంతం ఏవీ చూడవద్దని అధికారులకు చెబితే, ఎంతో సీనియర్ అయిన చంద్రబాబు మాత్రం సంకుచిత ధోరణితో టీడీపీ కార్యకర్తలకే  పనులు చేయమని చెప్పడం సముచితమేనా!. వైఎస్సార్‌సీపీ పాలనలో అవినీతి జరిగిందని.. గాడి తప్పిన నేతలను, అధికారులను శిక్షిస్తామని ఆయన అంటున్నారు. అవినీతిని సహించబోమని, అవినీతిపై పోరాడిన పార్టీ తెలుగుదేశం అని ఆయన చెబితే సభికులు చెవిలో పూలు పెట్టుకుని విని ఉండాలి. జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుపై, కొందరు అప్పటి మంత్రులపైన అవినీతి కేసులు ఆధార సహితంగా వచ్చాయి కదా!. అప్పటి దర్యాప్తు అధికారులు చూపించిన ఆధారాలు సరైనవా? కావా? అన్నవాటిపై చంద్రబాబు కానీ, మరే టీడీపీ నేత అయినా మాట్లాడారా!. అవన్ని ఎందుకు టీడీపీ ఖాతాలోకి అక్రమ సొమ్ము చేరిందని ఆరోపణలు వచ్చాయి.

అలాగే  కేంద్ర ప్రభుత్వ సీబీటీడీనే చంద్రబాబు కార్యదర్శి ఇంటిలో సోదాలు జరిపి రూ.రెండు వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ప్రకటించిందా? లేదా?. ఆదాయ పన్ను శాఖ ఎందుకు నోటీసు ఇచ్చింది?. వాటి గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా!. కాకపోతే ఆయనకు మేనేజ్ మెంట్ స్కిల్‌ ఉంది కనుక ఆ కేసులు ముందుకు వెళ్లకుండా చూడగలిగారు. జగన టైమ్ లో హత్యా రాజకీయాలు జరిగాయట. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా, పార్టీ రంగు పులిమి రాజకీయం చేసిన సంగతి ఆయన ఆత్మకు తెలియదా!. మాచర్ల వద్ద హత్యకు గురైన ఒక టీడీపీ కార్యకర్త కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం సరైనదేనా?. అది కొలమానం అయితే ఈ మహానాడులో ప్రసంగాల ప్రకారం వెయ్యి మందికి పైగా హత్యలకు గురయ్యారని చెప్పారు కదా!. మరి ఆ వెయ్యి మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా?. నిజానికి మాచర్ల హత్య కూడా వ్యక్తిగత కక్షలతో జరిగినదే. కాని రాజకీయ లబ్దికోసం టీడీపీ గేమ్ ఆడిందని అంటారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు హత్యలకు గురయ్యారు?. ఎందరు పోలీసుల వేధింపులు ఎదుర్కుంటున్నారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న  ఘోరాల మాటేమిటి!. తెనాలిలో దళిత, ముస్లిం యువకులు ముగ్గురిని పోలీసులు బహిరంగంగా అరికాళ్లపై ఇష్టారాజ్యంగా కొట్టడమే టీడీపీ ప్రభుత్వ విధానమా?. ఇక అక్రమ కేసుల సంగతి సరే సరి. ఇన్ని చేస్తూ జగన్ ప్రభుత్వంలో అది జరిగింది.. ఇది జరిగింది అంటూ అసత్యాలు, అర్ధ సత్యాలు వల్లే వేస్తున్నారు. ఇక లోకేష్ చెబుతున్న ఆరు శాసనాలు మరీ విడ్డూరంగా ఉన్నాయనిపిస్తుంది. తెలుగు జాతి విశ్వ ఖ్యాతి అంటూ పేర్కొన్న అంశంలో 1984లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేస్తే ఢిల్లీ పెద్దల మెడలు వంచి మళ్లీ సీఎం పదవి చేపట్టారని అన్నారు. బాగానే ఉంది. మరి 1995లో స్వయంగా అల్లుడు అయిన చంద్రబాబే  ఎందుకు ఎన్టీఆర్‌ను పదవిచ్యుతిడిని చేశారు కదా? చంద్రబాబును అప్పట్లో ఎన్టీఆర్‌ ఎన్ని విధాలుగా దూషించారన్నది కూడా విశ్వ విఖ్యాతమైనవే కదా!.

తెలుగుదేశంలో యువతకు పెద్దపీట వేసే యువగళం అన్నారు. అభ్యంతరం లేదు. వారిష్టం. స్త్రీ శక్తి మూడో శాసనమని తెలిపారు. ఎన్టీఆర్‌ మహిళలకు సమాన  ఆస్తి హక్కు ఇస్తే, చంద్రబాబు వారికి ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చారట. అదేమిటో? మరి ఆడబిడ్డ నిధి, ఈ ఏడాది తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు? పేదల సేవలో సోషల్ ఇంజినీరింగ్ అనేది మరో శాసనమట. వృద్దులకు రూ.నాలుగు వేలు ఫింఛన్‌ ఇస్తున్నారు. దాంతోనే పేరికం పోతుందా!. పీ-4 పేరుతో పేదలను పెట్టుబడిదారులకు వదలి వేయడం తెలుగుదేశం పాలసీగా మారింది కదా!.

2029 నాటికి పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలకు ఉండే విలువ ఎంతో తెలియదు. అన్నదాతకు అండగా ఉండటం మరో శాసనం అని చెప్పారు. వారికి ఇవ్వవలసిన రూ.ఇరవై వేలు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? చివరి శాసనం కార్యకర్తే అధినేత అని పేర్కొన్నారు. వారిని సొంతకాళ్లపై నిలబడేలా ఆర్థికంగా బాగు చేస్తారట. అంటే ప్రభుత్వ సొమ్మును వారికి దోచిపెడతామని పరోక్షంగా చెప్పడమే కదా అని వైఎస్సార్‌సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అన్నిటినీ మించి టీడీపీ పేదల పార్టీ అట. ఆ పేదల పార్టీకి ఒక్క రోజులో సుమారు రూ.22 కోట్ల విరాళం వచ్చిందట. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తుంది.

1987 మహానాడు విజయవాడ కృష్ణా తీరంలో జరిగింది. అందులో ఒక హుండీ పెట్టారు. విరాళాలు  ఇవ్వదలిచిన వారు అందులో వేయవచ్చని ప్రకటించారు. ఆ హుండీ వద్దకు ఎవరూ వెళ్లినట్లు కనిపించలేదు. కాని తెల్లవారే సరికల్లా భారీ మొత్తాలు వచ్చాయని ప్రకటించేవారు. ఇందులో మతలబు ఏమిటని అప్పట్లో కథనాలు  వచ్చాయి. మరి ఇప్పుడు నిజంగానే అభిమానులు, పార్టీ నేతలు  విరాళాలు ఇస్తుంటే  మంచిదే. ఏది ఏమైనా వైఎస్ జగన్ సొంత ప్రాంతమైన కడపలో మహానాడు పెట్టి చంద్రబాబు, లోకేశ్‌లు తమ అహం చల్లబరుచుకుని ఉండవచ్చు కానీ, రాయలసీమకు గానీ, రాష్ట్ర ప్రజలకు కానీ.. ఈ మహానాడు వల్ల ఒరిగింది ఏమిటి అన్న దానికి జవాబు  దొరుకుతుందా?. అందుకే జగన్ ఒక మాట అన్నారు. మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేస్తే హీరోయిజం కాని, కడపలో మహానాడు పెడితే హీరోయిజం ఏముందని అడిగారు. దానికి ఎవరు సమాధానం ఇవ్వగలరు!.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement