Pawan Kalyan: పప్పులో కాలేసిన పవన్‌ కళ్యాణ్‌!

Kommineni Srinivasa Rao Article On Pawan Kalyan Politics - Sakshi

జనసేన అధినేత  పవన్ కళ్యాణ్ ఆత్మరక్షణలో పడినట్లుగా ఉంది. తాను చంద్రబాబునాయుడు దత్తపుత్రుడిని కాదని చెప్పుకోవడానికి తంటాలు పడవలసి వస్తోంది. అంతేకాక తనది తెలుగుదేశం బి.టీమ్ కాదని తన పార్టీ కాడర్‌కు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల పరామర్శకు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన సమాధానం ఇచ్చారు.

అందులో కూడా ఆయన పప్పులో కాలేసినట్లుగా మాట్లాడటం విశేషం. జగన్ సీబీఐ దత్త పుత్రుడని, వైసీపీ నేతలు కోర్టుకు దత్త పుత్రులు, చర్లపల్లి జైలులో షటిల్ ఆడే బ్యాచ్ అని ఇలా పలు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు స్క్రిప్టు రాసినవారెవరో తెలివి తక్కువగా రాశారని అనుకోవాలి. ఎందుకంటే ఎవరి ద్వారా అయినా లాభం పొందితే అప్పుడు వారికి దత్తపుత్రుడు అని అంటారు కాని, వారి వల్ల ఇబ్బందులు పడితే దానిని దత్తపుత్రుడు అని ఎలా అంటారో అర్థం కాదు. గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను స్థాపించిన తర్వాత జగన్ పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆనాడు పవర్‌ పుల్‌గా ఉన్న సోనియాగాంధీని ఎదిరించారు. ధిక్కరించారు. ఓదార్పు యాత్రను తన పద్దతిలోనే కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దాంతో ఆమె ఆగ్రహానికి గురై జగన్‌పై సీబీఐ ద్వారా కేసులు వచ్చేలా చేశారన్నది సర్వత్రా ఉన్న అభిప్రాయం. జగన్ కూడా పలుమార్లు ఈ విషయం చెప్పారు. సోనియాగాంధీకి చంద్రబాబు కూడా తోడై, కేసులతో జగన్‌ను చాలా ఇబ్బందికి గురి చేశారు. అయినా జగన్ తగ్గలేదు. ఒక సందర్భంలో చంద్రబాబే తన పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతూ సోనియాగాంధీని జగన్ ఎదిరించి కేసులు పెట్టించుకున్నారని వ్యాఖ్యానించారు. అలాగే బిజెపి నేత, కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మస్వరాజ్ పార్లమెంటులోనే జగన్ పై సీబీఐతో అక్రమ కేసులు పెట్టించారని విమర్శించారు. పరిస్థితి అది అయితే సీబీఐకి జగన్ ఎలా దత్తపుత్రుడు ఎలా అవుతారో తెలియదు.

దత్తపుత్రుడైతే పదహారు నెలలపాటు సీబీఐ నిర్భందించేదా? జగన్  బెయిల్ పిటిషన్ వచ్చినప్పుడల్లా వ్యతిరేకించి ఇక్కట్లకు గురి చేసేదా? జగన్ కాకుండా మరెవరైనా అయితే మూడు రోజులలో బెయిల్ వచ్చేదని ప్రముఖ న్యాయవాది ఎస్.రామచంద్రరావు ఒక సందర్భంలో చెప్పారు. అలా అష్టకష్టాలు పడి, అన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని , 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలను మెప్పించి ఆయన అదికారంలోకి వచ్చారు. ఆ మాటకు వస్తే  కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యపై పవన్ స్పందించి ఉండాల్సింది. ప్రధాని మోదీ తండ్రి మాదిరి జగన్‌ను చూసుకుంటారని అన్నారు. పవన్‌కు అది లోపల బాధ కలిగించినా మాట్లాడలేరు.

చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ఏ రకంగా దత్తపుత్రుడు కాడో చెప్పగలిగి ఉంటే బాగుండేది. 2014లో తెలుగుదేశంను గెలిపించడానికి పవన్ కల్యాణ్ కృషి చేశారు. అది కూడా కొంత పనిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తదుపరి ప్రత్యేక విమానాలలో అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ ను చంద్రబాబు రప్పించుకున్నారు. ఆనాటి బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ దీనికి అనుసంధాన కర్తగా ఉండేవారు. ఆ సందర్భంలో చంద్రబాబు ఈయనను దత్తపుత్రుడు మాదిరి చూసుకున్నారని ప్రత్యర్దులు విమర్శలు చేస్తుంటారు. రాజధాని రైతుల భూ సేకరణ విషయంలో పవన్ కళ్యాణ్ ఒకటి,రెండు రోజులు పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు చేసి. తదుపరి హైదరాబాద్ వచ్చి చంద్రబాబుతో కలవగానే ఆ ఊసే పెద్దగా ఎత్తలేదు.

చంద్రబాబుకు దత్తపుత్రుడు కనుకే ఆయన అలా చేశారని విమర్శిస్తుంటారు. మధ్యలో చంద్రబాబుపైన, లోకేష్ పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసినా, 2019 ఎన్నికల నాటికి టీడీపీతో పరోక్ష స్నేహం చేశారన్న భావన ఉంది. పేరుకు బీఎస్పి, వామపక్షాలతో పొత్తు అయినా, చంద్రబాబుతోనే  సంప్రదింపులు జరిపి, చంద్రబాబు కోరిన అభ్యర్థులను తన పార్టీ తరపున, సీపీఐ తరపున ఆయా చోట్ల నిలబెట్టారని చెబుతారు.అప్పట్లో  ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి టీడీపీకి లాభం చేసే లక్ష్యంతోనే పవన్ అలా చేసి ఉంటారని చాలామంది అనుమానించారు.

పవన్ కళ్యాణ్ పోటీచేసిన నియోజకవర్గాలలో చంద్రబాబు ప్రచారానిక వెళ్లలేదు. అలాగే చంద్రబాబు, లోకేష్‌ల నియోజకవర్గాలకు ఈయన ప్రచారం చేయలేదు. తదుపరి ఆయా సమస్యలపై చంద్రబాబు కామెంట్లు చేసిన తర్వాత,  దాదాపు అవే విమర్శలను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తుంటారన్న అభిప్రాయం ఎక్కువగా ఉంది.అన్నిటికి మించి వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడడానికి పవన్ తంటాలు పడుతున్నారు. అది ఎలా సాధ్యమో తెలియక గందరగోళం పడుతున్నారు. ప్రస్తుతం బిజెపి కూటమితో పవన్ ఉన్నారు. టిడిపి ఈ కూటమిలోకి రావాలని ప్రయత్నిస్తోంది. గతంలో ప్రధాని మోదీని నానా రకాలుగా దూషించడంతో బిజెపి టిడిపిపై ఆగ్రహంతో ఉంది. ఓటమి తర్వాత మళ్లీ బిజెపితో స్నేహాన్ని ఆశిస్తున్న టిడిపిని కలపడానికి పవన్ యత్నిస్తున్నారన్న భావన ఏర్పడింది.

అందుకే వైసీపీ వ్యతిరేక ఓటు చీలదు అని తన సభలో అన్నారన్న విశ్లేషణ వస్తుంది. ఆయన ఇంతవరకు తాను, బిజెపినే కలిసి కూటమిగా పోటీచేస్తామని చెప్పలేకపోతున్నారు.అలాగే తెలుగుదేశంతో పొత్తు ఉంటుందో, లేక ఉండదో నిర్దిష్టంగా చెప్పలేక సతమతమవుతున్నారు.. ఇలాంటి కారణాలవల్లే పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ నేపథ్యంలో పవన్ పేరు ప్రస్తావించకుండా దత్తపుత్రుడు అని సంభోదించారు. జనసేన పార్టీలో కూడా పవన్ పై ఈ విషయంలో అసంతృప్తి ఏర్పడింది అంటారు. ఈ నేపథ్యంలోనే తాను చంద్రబాబు దత్తపుత్రుడిని కానని పార్టీకి ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారని అనుకోవాలి. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇలా డొంకతిరుగుడుగా చెప్పడం కాకుండా, నేరుగా టీడీపీకి మిత్రుడిని కాను అని చెప్పేవరకు జనం ఎవరూ నమ్మకపోవచ్చు. పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన దత్తపుత్రుడు క్లిక్ అవడంతోనే ఆయన ఆత్మరక్షణలో పడి, దానినుంచి బయటపడడానికి బాధలు పడుతున్నారు.


కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్టు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top