కర్ణాటక ఫలితం.. తెలంగాణలో ఇప్పుడెలా?.. బీజేపీ బేజార్‌, 'కారు'కు ఫియర్..

Kommineni Srinivasa Rao Analysis On Congress Wins In Karnataka - Sakshi

ప్రజాస్వామ్యం గొప్పదనం ఇదే. తమకు నచ్చని ప్రభుత్వాన్ని తీసివేయడం ప్రజాస్వామ్యంలోనే సాధ్యం. దేశ ప్రధాని స్వయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రోజుల తరబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, మతపరమైన సెంటిమెంట్‌ను రాజకీయంగా వాడుకోవడానికి యత్నించినా ప్రజలు మద్దతు ఇవ్వకపోవడం కూడా విశేషమే. కర్నాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఆ పార్టీకి కొత్త ఊపిరి పోసినట్లయింది.

ఈ ఏడాది ఎన్నికలు జరిగే ఇతర రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గత కొద్ది సంవత్సరాలలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలో ఓటమి చెందడమే కాకుండా డిపాజిట్లు సైతం కోల్పోయింది. అనూహ్యంగా బిజెపి పుంజుకుని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో గెలిచింది.గెలిచిన ఇద్దరూ ఒరిజినల్ గా బిజెపివారేమీకాదు. వారి వ్యక్తిగత పలుకుబడే వారి గెలుపులో ప్రముఖ పాత్ర వహించిందని చెప్పాలి. అయినా బిజెపిలో ఉత్సాహం ఉరకలేసింది.

ఆ ఊపులో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని బీజేపీలోకి తీసుకువచ్చి రాజీనామా చేయించి ఉప ఎన్నికలో పోటీచేయించినా, అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓడించింది. ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడోస్థానానికే పరిమితమై డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. దాంతో కాంగ్రెస్ పని అయిపోయిందన్న భావన ఏర్పడింది. పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పార్టీని నడుతుండడం పార్టీ సీనియర్ లకు అసంతృప్తిగా మారింది. ఉప ఎన్నికలలో ఓడిపోవడం ఆయనకు మైనస్ అయింది. కాని రేవంత్ పట్టువీడకుండా రకరకాల కార్యక్రమాలు,పాదయాత్రలు చేపట్టారు.

శాసనసభ పక్ష నేత మల్లు భట్టి కూడా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయినా కాంగ్రెస్ ఎంతవరకు పుంజుకుంటుందన్న భావన ఏర్పడింది. అలాంటి తరుణంలో కాంగ్రెస్ కు ప్రియాంక గాంధీ సభ కాస్త ఆశ కల్పించింది. తదుపరి కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ గెలవడంతో ఇక్కడ కూడా తాము పుంజుకోగలుగుతామని కాంగ్రెస్ నేతలకు ఒక విశ్వాసం కలిగింది. అది అంత తేలికకాదని అందరికి తెలుసు. దానికి ముందుగా తెలంగాణలోని నియోజకవర్గాలలో తన క్యాడర్ ను యాక్టివ్ చేసుకోవలసి ఉంది. తన పార్టీ స్థానిక నేతలు బిజెపి లేదా బిఆర్ఎస్ పార్టీలలోకి వెళ్లకుండా చూసుకోవాలి.ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పజాలం కాని, కర్నాటక ఎన్నికల ఫలితాలతో మళ్లీ రేసులోకి వచ్చే అవకాశం ఏర్పడింది.

ఇంతవరకు బిజెపినే ప్రధాన ప్రత్యర్ధి అవుతుందా అన్న చర్చ నుంచి కాంగ్రెస్ కూడా రంగంలో ఉందన్న అబిప్రాయం కలుగుతుంది.ఇంతవరకు వామపక్షాలు బిఆర్ఎస్ వైపే చూస్తుండగా, ఇప్పుడు తమకు మరో ఆప్షన్ కాంగ్రెస్ ఉందని చెబుతున్నారు. అధికార బిఆర్ఎస్ కు ఈ ఎన్నికల ఫలితాలు ఎలాంటి సంకేతం ఇచ్చాయన్నది పరిశీలించాలి. జాతీయ పార్టీ పెట్టామని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్రలో మార్కెట్ కమిటీ ఎన్నికలలో పోటీచేసి, కర్నాటక శాసనసభ ఎన్నికలలో పోటీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. జెడిఎస్ పార్టీ తో స్నేహం ఉన్నందున పోటీకి దిగలేదని అంటున్నా, కర్నాటకలో పోటీచేసినా ప్రయోజనం లేదనుకునే కామ్ అయిపోయి ఉండవచ్చు.

బీఆర్ఎస్ కు కొన్ని సీట్లు కేటాయించడానికి జెడిఎస్ ముందుకు రాలేదు. మరో వైపు జెడిఎస్ కు కెసిఆర్ ఆర్దిక వనరులు సమకూర్చారని బిజెపి ఆరోపిస్తున్నా,వాస్తవానికి తమకు తగు మేర సాయం చేయలేదని జెడిఎస్ నేత కుమారస్వామి వాపోతున్నారని చెబుతున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలవడం వల్ల ఆ పార్టీకి జోష్ రావడం బిఆర్ఎస్ కు అంత మంచి విషయమేమి కాదు. కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ కాడర్ యాక్టివ్ అయితే తమకు పోటీ అవుతుందని తెలుసు. అదే బిజెపి గెలిస్తే ఆ పార్టీ జోరు పెంచినా , తమకు పెద్ద నష్టం ఉండదని బిఆర్ఎస్ భావిస్తుండవచ్చు.

కాంగ్రెస్‌కు పోటీగా బిజెపి ఎదిగితే, రెండు పార్టీల మధ్య ఓట్ల చీలిక ఏర్పడి తమకు ఇబ్బంది లేకుండా విజయం వరిస్తుందన్న అంచనా బిఆర్ఎస్ లో ఉంది. . బిజెపి గెలిచి ఉంటే ఆయా నియోజకవర్గాలలో ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆకర్షించడంలో బిజీ అయ్యేది. కాని కర్నాటక ఓటమితో ఆ పార్టీలో చేరడానికి కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు అంతగా సుముఖత చూపకపోవచ్చు. హిందూ వ్యతిరేక శక్తులన్నీ కలిసి బిజెపిని కర్నాటకలో ఓడించాయని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అనడాన్ని బట్టి , తెలంగాణ ఎన్నికలలో మతపరమైన అంశాలనే తమ రాజకీయానికి వాడుకుంటామని ఆయన చెబుతున్నట్లుగా ఉంది.

దానికి తోడు హిందూ ఏక్తా యాత్ర కూడా చేపట్టారు. హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాలలో మతం ఆదారంగా ఓట్లు వేసే పరిస్థితి పరిమితమేనని చెప్పాలి. ఆ విషయం గమనించకుండా కర్నాటకలో మాదిరి ముస్లిం రిజర్వేషన్ ల తొలగింపు, తదితర మతాంశాలపై బిజెపి ఆధారపడితే ఆ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతాయన్నది సందేహమే. తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటే, బిజెపి నేతలు నిరాశకు గురయ్యారు. పైకి ఏవో ప్రకటనలు చేసినా వారిలో గుబులు పట్టుకుని ఉంటుంది. ఇక బిఆర్ఎస్ వారు ఈ ఎన్నికల ఫలితాలపై పెద్దగా స్పందించలేదు. తెలంగాణలో ప్రభావం ఉండదని మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటిఆర్ అన్నారు.
చదవండి: ఆ ఐదు శాతమే! రాత మార్చింది

ఓడిపోయిన బీజేపీపై బిఆర్ఎస్ మంత్రులు వ్యాఖ్యానించారు తప్ప, గెలిచిన కాంగ్రెస్ ను ఉద్దేశించి ఎలాంటి మాట మాట్లాడలేదు. కర్నాటకలో హంగ్ వచ్చినట్లయితే , మళ్లీ జెడిఎస్ గేమ్ ఆడి ఉండేది. ఆ గేమ్ లో బిఆర్ఎస్ కూడా ఒక పాత్ర పోషించేది. ఎవరికి మెజార్టీ రాక, ఎమ్మెల్యేల క్యాంపులు నిర్వహించవలసి వస్తే హైదరాబాద్ లో సదుపాయం కల్పించి ఉండేది. కాని ఆ అవసరం లేకుండా పోయింది. జెడిఎస్ బాగా దెబ్బతినడంతో కర్నాటకలో బీఆర్ఎస్‌కు రోల్ లేకుండా పోయింది. ఈ విషయంలో బిఆర్ఎస్ అంచనాలు సక్సెస్ కాలేదనే చెప్పాలి.  ఏది ఏమైనా బీజేపపీ గెలిచి ఉంటే తెలంగాణలో బిఆర్ఎస్‌కు ఒకరకమైన సమస్య ఎదురయ్యేది. అది తన పార్టీ నేతలు ఎవరూ అటువైపు వెళ్లకుండా చూసుకోవలసి వచ్చేది. అంతకు మించి పెద్ద ప్రమాదం ఉండకపోయి ఉండవచ్చు.

అదే కాంగ్రెస్ గెలవడం వల్ల ఆ పార్టీ యాక్టివ్ అయితే కార్యకర్తలు జోష్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఎంతకాదన్నా తెలంగాణలో ఇప్పటికీ కాంగ్రెస్‌కు అత్యధిక నియోజకవర్గాలలో గట్టి కాడరే ఉందని అంటారు. బిజెపి వెనుకంజ వేసి , కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఇప్పుడు ఏర్పడింది. కాంగ్రెస్, బిజెపిలు లేని రాజకీయ కూటమి కి నాయకత్వం వహించాలని కెసిఆర్ ఉవ్విళ్ళూరుతున్నా, ఈ ఫలితాలతో కాంగ్రెస్ ప్రాదాన్యత మళ్లీ పెరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్ధి కాకపోతే కేసీఆర్ రాజకీయం మరో రకంగా ఉండేది. ఈ పరిస్థితులలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలం పెరగకుండా కేసీఆర్ వ్యూహాలు తయారు చేసుకోవచ్చు. తెలంగాణలో ప్రత్యేకించి గ్రామాలలో ఇప్పటికైతే అంత అనుకూల వాతావరణం బీఆర్ఎస్‌కు లేదన్న అభిప్రాయం ఉంది.
చదవండి: పవన్‌ లొంగిపోయింది ఇందుకేనా?.. అర్థం అదేనా?.. పాపం వారి పరిస్థితేంటో!

దానిని కాంగ్రెస్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందన్నది చర్చనీయాంశమే అయినా కర్నాటక ఫలితాలతో వారిలో కొత్త ఆశలు మొలకెత్తుతాయి. ఏది ఏమైనా తెలంగాణలో బీజేపీ జోరుకు ఈ ఫలితాలతో కొంత బ్రేక్ పడే అవకాశం ఉండగా, కాంగ్రెస్ మాత్రం స్పీడ్ పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ రెండు పార్టీలు సమంగా ఉంటే తన పని సులువు అవుతుందని బీఆర్ఎస్ భావిస్తుంటుంది. తెలంగాణ బీజేపీకి ఇది చేదు సంకేతాన్ని ఇస్తే, బీఆర్ఎస్‌కు ఏమి అర్దం కాని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌కు మాత్రం తీపి కబురే అయినా, దానిని తెలంగాణలో ఎలా ఫలప్రదం చేసుకోవాలో అన్నదానిపై మల్లగుల్లాలు పడే దశలోనే ఈ పార్టీ ఉందని చెప్పాలి.!

-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top